RIP Kollam Sudhi: కారు ప్రమాదంలో ప్రముఖ మలయాళం నటుడు మృతి
ABN, First Publish Date - 2023-06-05T16:41:08+05:30
ప్రముఖ మలయాళం నటుడు 39 సంవత్సరాల కొల్లం సుధి ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు. ఇతను చాలా టీవీ ప్రోగ్రామ్స్ తో మలయాళం ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటుడు.
ఈమధ్య కాలంలో సినిమా పరిశ్రమ చాలామంది నటులను కోల్పోయింది. ఇప్పుడు అలాంటిదే మరో యువనటుడు కారు ప్రమాదంలో కన్నుమూశారు. మలయాళ చిత్ర పరిశ్రమకి చేయండి 39 సంవత్సరాల కొల్లం సుధి ఒక కారు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. చిన్నవయసులోనే ఇలా అనంతలోకాలకు వెళ్ళిపోవటంతో మలయాళం పరిశ్రమలో ఎంతోమంది నటులు తీవ్ర దిగ్భ్రాంతి కి లోనయ్యారు. కొల్లం సుధి (Kollam Sudhi Passes Away) చాలా టీవీ ప్రోగ్రామ్స్ తో చాలా ప్రాముఖ్యత గడించారు.
సోమవారం తెల్లవారుజామున కొల్లం సుధి, మరో ముగ్గురి ఆర్టిస్టులతో కలిసి ప్రయాణిస్తున్న కారు కేరళలోని త్రిసూర్‌లో ప్రమాదానికి గురిఅయింది. అందులో వున్న నలుగురిలో కొల్లం సుధి మరణించగా అతనితో ప్రయాణిస్తున్న మిగిలిన కళాకారులకు గాయాలైనట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగిందని, ఈ నటుడు ప్రయాణిస్తున్న కారుని, ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు ఎదురెదురుగా ధీ కొనటంతో ప్రమాద తీవ్రత కూడా అంత ఎక్కువగా ఉందని, ఈ నలుగురిలో సుధి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) మలయాళం నటుడు కొల్లం సుధి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మలయాళం పరిశ్రమనుండి చాలామంది సుధి మరణవార్త తెలిసినవెంటనే తమ సంతాపాన్ని తెలియచేసారు. ఇతను రెండు మలయాళం సినిమాల్లో కూడా నటించాడు అని తెలిసింది.