Virupaksha: ఈ మిస్టరీ థ్రిల్లర్ ఇక ఇంట్లోనే చూసుకోవచ్చు, ఎందులో, ఎప్పుడు అంటే...
ABN, First Publish Date - 2023-05-16T15:24:18+05:30
'విరూపాక్ష' సినిమా ఈ సంవత్సరం మంచి హిట్ అయిన సినిమాల్లో ఒకటి, అలాగే సాయి ధరమ్ తేజ్ కి కూడా అతను బైక్ ప్రమాదం నుండి బయట పడిన తరువాత చేసిన సినిమా. ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో వచ్చేస్తోంది, ఎప్పుడు ఎక్కడా అంటే...
ఈ సంవత్సరం హిట్ అయిన సినిమాల్లో సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) నటించిన 'విరూపాక్ష' #Virupaksha ఒకటి. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై మూడు వారాలు పైనే అయింది. ఇంకా థియేటర్స్ లో కూడా బాగానే పోతోంది. ఈ సినిమాకి కార్తిక్ దండు (KarthikDandu) దర్శకుడు, ఇది అతనికి మొదటి సినిమా. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, ఈ సినిమాకి అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) స్క్రీన్ ప్లే (Screenplay) అందించటమే కాకుండా, నిర్మాణంలో కూడా భాగం అయ్యాడు. సంయుక్త మీనన్ (Samyuktha) ఇందులో కథానాయిక కాగా, ఈ సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్ల వర్షం కురిపించింది.
అయితే ఇప్పుడు ఈ 'విరూపాక్ష' కోసం థియేటర్ కి వెళ్లనవసరం లేదు, ఎందుకంటే త్వరలో ఈ సినిమాని ఓటిటి లో ప్రసారం చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటిటి హక్కులు కొనుక్కుంది. ఈ సినిమా మే 21 (May21) నుండి తమ ఓటిటి లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తమ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది. "మూడో కన్నుతో మాత్రమే చూడకలిగే ఒక నిజం రాబోతోంది. మీరు చూడటానికి సిద్ధం కండి", అని పోస్ట్ చేశారు ట్విట్టర్ లో. #VirupakshaOnNetfix
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, 'రుద్రవనం' అనే ఒక పల్లెటూర్లో క్షుద్ర విద్యలు చేస్తున్నారంటూ ఒక దంపతులని సజీవంగా చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టి కాల్చేస్తారు ఆ ఊరి ప్రజలు. చనిపోతూ ఆ దంపతులు శాపం పెడతారు, పుష్కర కాలం తరువాత ఆ వూరు వల్లకాడు అవుతుందని. పన్నెండేళ్ల తరువాత ఆ వూరిలో వింత మరణాలు సంభవిస్తాయి. అదే సమయంలో సూర్య (సాయి ధరమ్ తేజ్), అమ్మతో ఆ వూరికి వస్తాడు.
ఆ ఊరి పూజారి (సాయి చంద్) ఊరుని అష్ట దిగ్భంధనం చెయ్యాలని, లేకపోతే ఆ వింత మరణాలు ఆగవని చెప్పి, వూరి నుండి ఎవరూ బయటకి వెళ్ళరాదు, అలాగే వూరులోకి కొత్తవారు ఎవరూ రాకూడదు అన్న నిబంధన పెడతాడు. కానీ మరణాలు ఆగవు. అదే సమయంలో సూర్య వూరు నుంచి వెళ్లే అవకాశం వున్నా తన ప్రియురాలు నందిని (సంయుక్త మీనన్) కోసం వూరులోనే ఉండిపోయి, ఈ మరణాల రహస్యం చేధించాలని అనుకుంటాడు. అతను ఆ రహస్యం కనుక్కున్నాడా, ఎవరు దీని వెనక వున్నారు అన్నది ఓటిటి లో వస్తోంది కదా, చూడండి.