Shaitan web series: ట్రైలర్ లోనే ఇంత వైలెన్స్ ఉంటే... అందుకే ఇది అందరికీ కాదు
ABN, First Publish Date - 2023-06-05T16:14:43+05:30
ఈమధ్య తెలుగు సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ లోనూ కూడా నెగటివిటీ ఎక్కువయిపోయింది. ఏమైనా అంటే అవి ఒక ప్రత్యేక ప్రేక్షకులకు అంటున్నారు. వెంకటేష్, రానా నటించిన 'రానా నాయుడు' కుటుంబంతో చూడొద్దు అని ముందే చెప్పారు, అలాగే ఇప్పుడు దర్శకుడు మహి వి రాఘవ కూడా 'సైతాన్' వెబ్ సిరీస్ లో హింస తో పాటు బూతు డైలాగ్స్ కూడా పెట్టాడు. అందరికీ కాదు, కొంతమంది ప్రేక్షకుల కోసమే అని అంటున్నాడు.
మహి వి రాఘవ (Mahi V Raghav) మూడు సినిమాలు దర్శకుడిగా, రెండు సినిమాలు నిర్మాతగా చేసాడు. అలాగే మొన్నీమధ్య విడుదల వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగెర్స్' (SaveTheTigers) లో కూడా మహి వి. రాఘవ చెయ్యి వుంది. అయితే అతను తీసిన సినిమాలు అన్నీ క్లీన్ గా ఉంటాయి, సెన్సార్ వాళ్ళు కూడా ఒక్క కట్ కూడా చెప్పలేదు, అంత క్లీన్ గా తీసాడు మహి. అలాగే 'సేవ్ ది టైగెర్స్' కూడా ఒక కామెడీ వెబ్ సిరీస్. ఇప్పుడు 'సైతాన్' అనే ఒక వెబ్ సిరీస్ తో మళ్ళీ వస్తున్నాడు.
అయితే ఈసారి మహి రాఘవ ముందు సినిమాలకి భిన్నంగా వస్తున్నాడు. ఎందుకంటే ఈ 'సైతాన్' (Shaitan) లో విపరీతమైన హింస, అలాగే చాలా బూతు డైలాగ్స్ వున్నాయి. ట్రైలర్ లోనే హింస ఎంతలా వుంది అంటే, 'గేమ్ అఫ్ థ్రోన్స్' (GameOfThrones) ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కన్నా మించి ఉందా అన్నట్టుగా హింస వుంది ఇందులో. అయితే మహి ఎందుకో రూట్ మార్చాడు, అదీ కాకుండా, ఈ ఓటిటి కి సెన్సార్ నియమనిబంధనలు వర్తించవు కాబట్టి, ఎటువంటి హింస, బూతు డైలాగ్స్ అయినా పెట్టుకోవచ్చు.
ఈమధ్య వెంకటేష్ (VenkateshDaggubati), రానా దగ్గుబాటి (RanaDaggubati) నటించిన 'రానా నాయుడు' (RanNaidu) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయినప్పుడు వెంకటేష్ మీద విపరీతమైన నెగటివిటీ వచ్చింది. ఎందుకంటే అందులో అతను చెప్పే మాటలు కొన్ని పెద్దవాళ్ళు కూడా వినేట్టుగా లేదు. అయితే ఆ సిరీస్ అంతే, అలానే ఉంటుంది, అందుకనే ముందుగానే చెప్పాము, ఈ వెబ్ సిరీస్ కుటుంబం తో చూడొద్దు అని అన్నారు వెంకటేష్.
ఇప్పుడు మహి కూడా అలానే అంటున్నాడు. ఎందుకంటే ఇందులో చాలా హింస ఉంటుంది కాబట్టి, ఇది ఒక ప్రేత్యేక ప్రేక్షకుల మాత్రమే ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ అని చెప్తున్నాడు. "సైతాన్' అనేది క్రైమ్ డ్రామా. ఇంతకు ముందు మేము డిస్ని ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) కోసం 'సేవ్ ది టైగెర్స్' కోసం పనిచేశాం. ఈ 'సైతాన్' అనేది కంప్లీట్ గా డిఫెరెంట్ ప్రాజెక్ట్. క్రైమ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే వారి కోసం టార్గెట్ చేసి ఈ వెబ్ సిరీస్ చేసాం," అని చెప్పాడు రాఘవ. గతంలో అతను చేసిన నాలుగైదు చిత్రాలు దేనికి కూడా న్యూడిటీ, అభ్యంతరకర డైలాగ్స్ లాంటి సెన్సార్ సమస్య రాలేదు, కానీ 'సైతాన్' లో అన్నీ ఉన్నాయి అని అన్నాడు. "మీరు ట్రైలర్ చూస్తే అందులో కనపడుతుంది, కానీ ఒక బలమైన కథ చెప్పేందుకు అటువంటి పదాలు ఉపయోగించాల్సి వచ్చింది," అని చెప్తున్నాడు మహి రాఘవ్.