Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!
ABN, First Publish Date - 2023-05-27T15:08:19+05:30
దాన వీర శూర కర్ణ చిత్రంలో మూడు పాత్రలూ పోషిస్తూ, దర్శకత్వం వహించడం అంటే మొత్తంగా నాలుగు పడవల ప్రయాణం అన్నమాట. ఈ సర్కస్ ఫీట్ అవలీలగా పూర్తి చేసిన ఘటికుడు ఎన్టీఆర్. దుర్యోధనుడు పాత్రకు డ్యూయెట్ పెట్టి.. మెప్పించిన ఘనత ఎన్టీఆర్‌దే. ‘చిత్రం భళారే.. విచిత్రం’ పాట అప్పట్లో ఓ సంచలనం. ఆ పాట వింటే.. అచ్చం ఎన్టీఆర్ పాడుతున్నట్టే ఉంటుంది.
నటుడిగా ఎన్టీఆర్ (NTR) స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో పాత్ర ఒక్కో చరిత్ర! మెగాఫోన్ పట్టి మెరుపులు మెరిపించారు. దర్శకుడిగా ఆయన పాటించిన ప్రమాణాలు, సాధించిన విజయాలు... అనితర సాధ్యం. ఎన్టీఆర్ దర్శకత్వ పటిమ గురించి చెప్పడానికి ‘దాన వీర శూర కర్ణ’ ఒక్కటి చాలు. చలన చిత్ర చరిత్రలో ఏ సినిమాకీ దక్కని ఖ్యాతి... ‘దాన వీర శూర కర్ణ’ (Daana Veera Soora Karna) సొంతం చేసుకొంది. మూడు పాత్రలు ఒకే నటుడు పోషిస్తూ, దర్శకత్వం వహించడం, అందులోనూ పౌరాణిక గాథ కావడం... న భూతో న భవిష్యత్!
మేకప్ వేసుకోవడానికి మూడు గంటలు, దాన్ని తొలగించడానికి మరో రెండు గంటలు పడుతుంది. అందునా మూడు పాత్రలూ పోషిస్తూ, దర్శకత్వం వహించాలి. అంటే నాలుగు పడవల ప్రయాణం అన్నమాట. ఈ సర్కస్ ఫీట్ అవలీలగా పూర్తి చేసిన ఘటికుడు ఎన్టీఆర్. నిజానికి మూడు పాత్రలూ తనొక్కడే పోషించాలన్న ఆలోచన ఎన్టీఆర్‌కు లేనేలేదు. కృష్ణుడి పాత్ర అక్కినేనికి అప్పగిద్దామనుకొంటే.. ఆయన ‘నో’ అనేశారు. కనీసం ‘కర్ణ’ పాత్ర చేయమన్నా కాదన్నారు. ‘‘కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో నన్ను చూడలేరు, ‘కర్ణ’ (Karna)గా నేను చేస్తే... పాండవులు కూడా మరుగుజ్జులుగా కనిపిస్తార’’న్నది అక్కినేని లాజిక్కు. అందుకే చివరికి మూడు పాత్రల భారం తానొక్కడే మోయవలసి వచ్చింది.
దుర్యోధనుడు పాత్రకు డ్యూయెట్ పెట్టి.. మెప్పించిన ఘనత ఎన్టీఆర్‌దే. ‘చిత్రం భళారే.. విచిత్రం’ పాట అప్పట్లో ఓ సంచలనం. ఆ పాట వింటే.. అచ్చం ఎన్టీఆర్ పాడుతున్నట్టే ఉంటుంది. దుర్యోధనుడి బాడీ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకొన్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) ఈ పాటని ఆలపించారు. రికార్డింగ్ సమయంలో పక్కనే ఉండి, ఎన్టీఆర్ బాలుకి సలహాలు అందించారు. అందుకే ఆ పాట అంత అద్భుతంగా కుదిరింది. కర్ణుడి పాత్రపై ఇంత సానుభూతి కురిపించిన చిత్రం ఇదేనేమో..? ఆ పాత్రని ఎన్టీఆర్ అర్థం చేసుకొన్న తీరు, దాన్ని వెండితెరపై ఆవిష్కరించిన విధానం... ఈనాటి సినీ రూపకర్తలకు ఓ పాఠం. ఇక డైలాగులన్నీ డైనమైట్లే. ‘ఏమంటివీ.. ఏమంటివీ..’ అంటూ సాగే సుదీర్ఘమైన సంభాషణ ఇప్పటికీ ఏదో రూపంలో, ఏదో వేదికపై వినిపిస్తూనే ఉంటుంది. డైలాగుల కోసమే ఆడియో రికార్డులు కొనే ట్రెండ్ ఈ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది.
కోటి రూపాయల సినిమా...
3 గంటల 46 నిమిషాల సుదీర్ఘ చిత్రమిది. ఇప్పటి తరమైతే... రెండు భాగాలుగా మార్చి విడుదల చేసేవారు. ‘ఇంత పెద్ద సినిమా ఎవరు చూస్తారండీ..’ అనే కామెంట్లనీ ఎదురొడ్డి... ఈ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టు దైర్యంగా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ (NTR). ఇంత సుదీర్ఘమైన చిత్రాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్ తీసుకొన్న సమయం 43 రోజులు మాత్రమే. విడుదల తేదీ సమీపిస్తున్నందు వల్ల చివరి మూడు రోజులూ రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. కేవలం రూ.10 లక్షల్లో ఈ చిత్ర నిర్మాణం పూర్తయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1977 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అనూహ్యమైన విజయం సాధించింది. ఏకంగా రూ.కోటి వసూలు చేసింది. ‘లవకుశ’ (Lavakusa) తరవాత కోటి రూపాయలు వసూలు చేసిన తెలుగు చిత్రమిదే. రీ రిలీజ్‌లోనూ కోటి రూపాయల వసూళ్లు రావడం మరో రికార్డ్. ఈ చిత్రం విడుదలై యాభై ఏళ్ల కావొస్తోంది. టెక్నాలజీ ఇంత పెరిగినా, ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా.. ఎవ్వరూ ఇంతటి ప్రయోగానికీ సాహసానికి పూనుకోలేకపోయారు. దటీజ్... ఎన్టీఆర్. దటీజ్ ‘దాన వీర శూర కర్ణ’ (Daana Veera Soora Karna).
ఇవి కూడా చదవండి:
************************************************
*K Vasu: మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు కె. వాసు మృతి
*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు
*Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం
*TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?