Nandamuri-Akkineni: 'శ్రీ కృష్ణార్జునయుద్ధం'లో కృష్ణుడుగా ఎన్టీఆర్ కన్నా ముందు ఎవరిని అనుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు
ABN, First Publish Date - 2023-04-13T12:59:14+05:30
నిర్మాత, దర్శకుడు కె.వి. రెడ్డి గారి మరో అద్భుత సృష్టి 'శ్రీ కృష్ణార్జున యుద్ధము' అనే పౌరాణిక సినిమా. అప్పట్లో పెద్ద స్టార్ లతో చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ కృష్ణుడు గా, అక్కినేని అర్జునుడిగా చేశారు. కానీ కృష్ణుడిగా ఎన్టీఆర్ ని మొదట అనుకోలేదు అంటే నమ్ముతారా...
పౌరాణిక సినిమాలు కళ్ళకు కట్టినట్టుగా తీయగల ప్రతిభ ఒక్క తెలుగు చలన చిత్ర పరిశ్రమకే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పౌరాణికం అంటే తెలుగు, అలాగే పౌరాణిక పాత్రలను కూడా సజీవంగా చేసి చూపించగల సత్తా కూడా ఒక్క తెలుగు వాళ్ళకే అప్పుడు ఉండేది. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు పోషించి శభాష్ అనిపించుకోవటమే కాకుండా, ప్రజలకి పౌరాణికాల మీద ఆసక్తి కలిగేటట్టు చేయగలిగారు. అలాగే ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు ఎన్టీఆర్(NTR). అందులో ఒకటి అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao) తో చేసిన 'శ్రీకృష్ణార్జున యుద్ధము' (Sri Krishnarjuna Yuddhamu).
దీనికి కె.వి.రెడ్డి (KV Reddy) దర్శకుడు, నిర్మాత కాగా చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు (Chilakamarthi Narasimham) రాసిన 'గయోపాఖ్యానం' (Gayopakhyanam) నాటకం అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందింది. దాని ఆధారంగా ఈ 'శ్రీ కృష్ణార్జున యుద్ధము' సినిమా కథ రాయబడింది. ఇందులో ఎన్టీఆర్ కృష్ణుడిగా (NTR as Lord Krishna), ఎ.ఎన్.ఆర్ (ANR as Arjuna) అర్జునుడిగా వేయగా, బి. సరోజాదేవి (B Sarojadevi) సుభద్రగా వేశారు. నారదుడిగా కాంతారావు (Kantha Rao), సత్యభామగా ఎస్. వరలక్ష్మి (S Varalakshmi) అద్భుత నటన కనపరిచారు.
అయితే ఈ సినిమాకి ముందుగా కృష్ణుడిని అనుకున్నది ఎవరినో తెలుసా. తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాలో కృష్ణుడుగా ముందు అనుకున్నది అక్కినేని నాగేశ్వర రావు ని. ఎందుకంటే కృష్ణుడు చమత్కారి, మాయలు చేస్తాడు, అందుకని పొట్టిగా వున్న అక్కినేనిని అనుకున్నారు. అర్జునుడు ఆజానుబాహుడు, ధీరోదాత్తుడు, గంభీరంగా ఉంటాడు అందుకని ఎన్టీఆర్ అర్జునుడి అనుకున్నారట. కానీ అక్కినేని నేను కృష్ణుడిగా వేస్తె బాగోదు అని చెప్పారట. అప్పటికే ఎన్టీఆర్ (NTR) 'మాయాబజార్' (Mayabazar) లో కృష్ణుడుగా బాగా ప్రాచుర్యం పొందారు, కాబట్టి అతను వేస్తేనే బాగుంటుంది అని నాగేశ్వర రావు కూడా చెప్పారట. అప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ని కృష్ణుడిగా, నాగేశ్వర రావుని అర్జునుడిగా చేశారు కె.వి. రెడ్డి గారు.
ఈ సినిమా 1963లో విడుదల అయింది. ఇందులో పద్యాలు, పాఠాలు నేటికీ సూపర్ హిట్ గానే ఉంటాయి. 'అలిగితివా సఖీ కలత మానవా ...' పాటని ఎన్టీఆర్, సత్యభామ అయినా ఎస్. వరలక్ష్మి ల మీద అద్భుతంగా చిత్రీకరిస్తే ఈ పాటలోనే ఎస్. వరలక్ష్మి, శ్రీకృష్ణ పాత్రధారి ఎన్టీఆర్ ధరించిన కిరీటాన్ని కాలుతో తంతుంది. అప్పట్లో ఇదొక పెద్ద ఆసక్తికర చర్చాంశం అయింది.