People Media Factory: ఒక ఏడాదిలో రెండు వంద కోట్ల సినిమాలు
ABN, First Publish Date - 2023-01-06T18:51:18+05:30
కరోనా కష్టకాలం తర్వాత తెరుచుకున్న థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. కేవలం కంటెంట్ బాగుండి.. మౌత్ టాక్ బాగుంటేనే..
కరోనా కష్టకాలం తర్వాత తెరుచుకున్న థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. కేవలం కంటెంట్ బాగుండి.. మౌత్ టాక్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్ల వరకూ వస్తున్నారు. కరోనా టైమ్‌లో సినీ పరిశ్రమలో చాలా మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ప్రేక్షకులు థియేటర్లను వదిలి.. ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు. అయితే కంటెంట్ పరంగా కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించి.. థియేటర్ల వరకు రప్పించాయి. ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారని సినిమావాళ్లకు తెలిసేలా చేశాయి. 2022 లో ఆర్ఆర్ఆర్ (RRR), సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టాయి. ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ సినిమాలు వందకోట్ల క్లబ్‌లో చేరడమనే విషయంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ.. ఒకే బ్యానర్‌లో రూపొందిన రెండు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ బ్యానర్ ఏమిటంటే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory).
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) 2017లో స్థాపించిన ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. మొదట అమెరికాలో ఇండిపెండెంట్ సినిమాలను నిర్మించింది. నందమూరి కళ్యాణ్ రామ్ Mla సినిమాతో వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా తెలుగులో సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల (Vivek Kuchibotla) సంయుక్తంగా ఎన్నో హిట్ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. ‘గూఢచారి’, ‘ఓ బేబీ’, ‘రాజ రాజ చోర’ వంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో పాటు ‘వెంకీ మామ’, ‘A1 ఎక్స్‌ప్రెస్’ వంటి జనాదరణ పొందిన సినిమాలను నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇక 2022 సంవత్సరంలో ఈ బ్యానర్‌లో వచ్చిన ‘కార్తికేయ-2’, ‘ధమాకా’ సినిమాలు వందకోట్ల వసూళ్లను రాబట్టాయి.
‘కార్తికేయ 2’ (Karthikeya 2) కాసుల వర్షం:
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి దర్శకత్వంలో నటించిన ‘కార్తికేయ-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. చిన్న సినిమాగా.. సాదాసీదాగా విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దాదాపుగా 120 కోట్లకు పైగా వసూలు చేసి, పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎంతో భారీగా నిర్మించిన ఈ మూవీ భారతీయ సనాతన ధర్మం, కృష్ణతత్వానికి సంబంధించిన కీలక అంశాలను ఆధారంగా అడ్వెంచరస్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది.
‘ధమాకా’ (Dhamaka) కలెక్షన్ల సునామీ:
ఇదే బ్యానర్ నుండి రీసెంట్‌గా వచ్చిన సినిమా ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల హీరోహీన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ కలక్షన్స్ సునామి సృష్టిస్తుంది. మాస్ మహారాజా అభిమానులకు ఈ సినిమా మంచి మాస్ ట్రీట్ ఇవ్వడమే కాకుండా.. వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలు వందకోట్లు వసూలు చేయడం సాధారణ విషయమే. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు, అభిమానులకు వినోదాన్ని అందించే సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అనేది రేర్ థింగ్. కార్తికేయ-2, ధమాకా ఈ రెండు సినిమాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రావడం విశేషం.
ప్రస్తుతం ఈ బ్యానర్‌లో మరికొన్ని సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. గోపీచంద్-శ్రీవాస్ ‘రామబాణం’, అవసరాల శ్రీనివాస్-నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’, అలాగే లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా అగ్రహీరోలైనా పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు కూడా ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోతున్నాయి.