Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!
ABN, First Publish Date - 2023-10-09T13:26:50+05:30
భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయకరావు (ఆంధ్రజ్యోతి) రచించిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.
భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయకరావు (ఆంధ్రజ్యోతి) రచించిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ (Telugu Cine Patrikeya Charitra) పుస్తకాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ మొదటి నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో విడదీయలేని అనుబంధం ఉంది. జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతాఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి అయినా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి వాస్తవానికి దూరంగా కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సృష్టిస్తుంటాయి. నా మటుకు నేను కూడా కొన్ని వార్తల కారణంగా కలత చెందిన సందర్భాలు లేకపోలేదు. ఎప్పుడో వచ్చిన ఆ వార్తల తాలూకు ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉండటం బాధాకరం. మరోవైపు నా తప్పులను ఎత్తిచూపి, వాటిని నేను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కలిగించిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎంతోమంది లేకపోలేదు. అందుకే పెన్ను పవర్ కలిగిన జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబిస్తూ బాధ్యతగా ముందుకు సాగినపుడు ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుంది. నేను దర్శక, నిర్మాతలతో కూర్చుని మాట్లాడినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా రచయితలతో కూర్చుని సంభాషిస్తుంటాను. గతంలో గొల్లపూడి, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానంద్ వంటి వారితో తరచూ సంభాషించేవాడిని. అదే అలవాటు నేటికీ ఉంది. రచయితలకు, జర్నలిస్టులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. సందర్భానుసారం వారి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలన్న సంకల్పంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. (Chiranjeevi About Journalists)
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వినాయకరావు (Vinayaka Rao) ఏ పుస్తకం రాసినా కూలంకషంగా చర్చిస్తూ, లోతుల్లోకి వెళ్లి రాయడం ఆయనకు అలవాటు. అలాగే అరుదైన ఫొటోలు సేకరిస్తుంటాడు. ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని అతను చేసే ప్రయత్నం అభినందనీయం. ఎన్టీఆర్‌గారి గురించి, దాసరిగారి గురించి, కృష్ణగారి గురించి, నా గురించి ఎన్నో అరుదైన పుస్తకాలు రాశాడు. ఇలాంటి వాళ్ళు పుస్తకాలను రాసే ప్రయత్నాన్ని మానుకోకూడడు. నేను కూడా ఈ పుస్తకాన్ని కొంటున్నాను’’ అని తెలిపారు.
అనంతరం పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు (Sr Journalist Vinayaka Rao) మాట్లాడుతూ.. ‘‘నేను రాసిన 12వ పుస్తకం ఇది. జర్నలిస్టులుగా మన చరిత్రను మనం ఎందుకు చెప్పుకోకూడదు అన్న ఆలోచన నుంచి పుట్టిన పుస్తకం ఇది. టాకీ కాలం మొదలైనప్పట్నుంచి.. నాటి సినీ జర్నలిస్టుల మొదలుకుని, నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని ఇందులో అందించాను. బి.కె. ఈశ్వర్, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు వంటి వారు నాకు ఎంతో సహకారాన్ని అందించారు. ఈ పుస్తకాన్ని తీసుకుని రావడానికి నాలుగేళ్లు పట్టింది. సమాచార సేకరణ కోసం ఊళ్లు పట్టుకుని తిరిగి, కుటుంబానికి సమయం వెచ్చించలేక ఎంత కష్టపడ్డా, తగిన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఇక నుంచి పుస్తకాలు రాయకూడదని నిర్ణయించుకున్నాను" అని అన్నారు.
దీనిపై వెంటనే చిరంజీవి (Chiranjeevi) స్పందిస్తూ.. ‘‘మీ లాంటి వాళ్లు పుస్తకాలు రాయడం ఆపకూడదు. నిరాశ పడవద్దు. తప్పకుండా ఆర్థిక భారం పడకుండా స్పాన్సర్స్ దొరుకుతారు. మీ మాటను వెనక్కి తీసుకోవాలి’’ అని చిరంజీవితో పాటు అక్కడ ఉన్న జర్నలిస్టులు పట్టుబట్టడంతో వినాయకరావు తన మాటను వెనక్కి తీసుకుని మరో కొత్త పుస్తకానికి పూనుకుంటానని అన్నారు. చిరంజీవి ఇంటి ప్రాంగణంలో ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!
*************************************
*Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల
**********************************
*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.
*************************************
*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!
**********************************************
*Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్
********************************************************