C Kalyan: వారిని TFPC నుంచి సస్పెండ్ చేశాం
ABN, First Publish Date - 2023-01-18T17:28:14+05:30
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్ (C Kalyan) బుధవారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్ (C Kalyan) బుధవారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై ఎటువంటి వివాదం నడుస్తుందో తెలియంది కాదు. కొందరు నిర్మాతలు ఛాంబర్ దగ్గర టెంట్ వేసి సమస్యలపై పోరాడుతున్నామని చెబుతూ.. నిర్మాతల మండలిలో కొందరు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారనేలా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నిర్మాతలమండలికి ఎలక్షన్లు జరపడంలేదంటూ వారు మీడియాకి తెలియజేశారు. వీటన్నింటిపై నిర్మాతల మండలి సమావేశం అయిందని తెలుపుతూ.. ఏకగ్రీవ నిర్ణయంగా ఈరోజు నిర్ణయాలు ప్రకటిస్తున్నాం అని సి. కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
సి. కళ్యాణ్ వెల్లడించిన ఏకగ్రీవ నిర్ణయాలు ఇవే:
మండలిలో రెగ్యులర్ సభ్యులు 1200మంది వున్నారు. అలాంటి సంస్థపై కొందరు చేసిన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు. ఆర్గనైజేషన్‌కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోము. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ప్రొడ్యూసర్ కె సురేష్ బాబుని మూడేళ్లు సస్పెండ్ చేశాము. ఆయన యధావిధిగా సినిమాలు చేసుకోవచ్చు. అలాగే యలమంచి రవికుమార్ ని ఈరోజు నుంచి మా సంస్థ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. ఇకమీద తెలుగు చలనచిత్ర మండలికి, ఆయనకి శాశ్వతంగా ఎలాంటి సంబంధం ఉండదు. 40 ఏళ్ల ఈ సంస్థలో వీళ్ళలాగా ఎవరు బిహేవ్ చేయలేదు. ఈ సంస్థ ఒక్కటే.. దీనిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకోవచ్చు. అదే విధంగా ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. వాటన్నింటికి సమాధానమే ఈరోజు మేము పెట్టుకున్న మీటింగ్. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు. అందుకే ఎలక్షన్ తేదీని ప్రకటిస్తున్నాం. నేను ఎన్నికలలో పోటీ చేయదలచుకోలేదు. నేను ఒకసారి ఒక పదవిలో ఉంటే మళ్ళీ ఆ పదవికి పోటీ చేయను. (Telugu Film Producers Council Elections)
- ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి (Telugu Film Producers Council) ఎన్నికలు.
- ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది.
- ఒకరు ఒక పోస్ట్‌కి మాత్రమే పోటీ చెయ్యాలి.
- 13వ తేదీ వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
- కె దుర్గా ప్రసాద్ (K Durga Prasad) ఎన్నికల అధికారిగా కొనసాగబోతున్నారు.
- అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్ జరుగుతుంది
ఇక కౌన్సిల్ ఫండ్ గురించి వివరిస్తూ.. మా కౌన్సిల్‌లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉంది. ఇంత అమౌంట్ పోగవ్వడానికి కారణం దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) గారే. మాకు తిరుపతిలో ఒక బిల్డింగ్ ఉంది. మూవీ టవర్స్ లో రెండు కోట్ల 40 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది 10 కోట్లకు చేరింది. డిసెంబర్ 31వ తేదీ వరకు అకౌంట్స్ అన్ని ఈసీలో పాస్ అయినవే అని అన్నారు.
సినిమా పరిశ్రమపై ప్రభుత్వాల తీరు గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాకి సినిమా పరిశ్రమ వెళ్తుంది అని నేను అనుకోవట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఒరిగేదేమీ లేదు. గతంలో అందాల్సిన సబ్సిడీలే ఇంకా రాలేదు. పైగా గతంలో ఇచ్చిన నంది (Nandi Award), ఇక్కడ సింహ అవార్డుల (Simha Award) గురించి ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి.. మా సినిమారంగంపై రాజకీయరంగు పులమకండి అని ప్రాధేయపడతామని తెలిపారు.
అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్న సౌత్ ఇండియా ఫిలింఛాంబర్.. దానికి అనుబంధంగా తెలుగు చలన చిత్ర మండలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉన్నాయి. అంతే తప్ప ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఆంధ్ర ఫిల్మ్ ఫెడరేషన్ వంటి సంస్థలకు, మాకు సంబంధం లేదు. పదవుల కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారు. అవి ఏవీ కూడా TFPC, TFCC, SIFCC, FFIలో భాగం కాదు.