Oppenheimer Review: అణుశాస్త్రవేత్త కథ అలరించిందా లేదా ?
ABN, First Publish Date - 2023-07-21T20:02:35+05:30
క్రిస్టోఫర్ నోలన్ ఈసారి ఒక బయో పిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమెరికాకు చెందిన అణు శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ కథ ఆధారంగా అతని పేరే 'ఓపెన్ హైమర్' అనే టైటిల్ పెట్టి విడుదల చేసాడు. ఇందులో సిల్లియన్ మర్ఫీ ప్రధాన పాత్ర అయిన ఓపెన్ హైమర్ గా చేసాడు. అలాగే రాబర్ట్ డౌనీ జూనియర్, మేట్ డెమన్ కూడా ఇందులో వున్నారు.
సినిమా: ఓపెన్ హైమర్
నటీనటులు: సిలియన్ మర్ఫీ (Cillian Murphy), ఎమిలీ బ్లంట్ (Emily Blunt), మేట్ డెమన్ (MattDamon), రాబర్ట్ డౌనీ జూనియర్ (RobertDowneyJr), ఫ్లోరెన్స్ FlorencePugh), జోష్ హార్ట్ నెట్ (JoshHartnett), కేసీ ఎఫ్లెక్ (Casey Affleck) తదితరులు
ఛాయాగ్రహణం: Hoyte van Hoytema
సంగీతం: Ludwig Göransson
దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్ (ChristopherNolan)
నిర్మాతలు: ఎమ్మా థామస్ (Emma Thomas), చార్లెస్ రోవెన్ (CharlesRoven), క్రిస్టోఫర్ నోలన్ (ChristopherNolan)
-- సురేష్ కవిరాయని
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని సినిమా విడుదల అవుతోందంటే ఇతర దేశాలలో వున్న ప్రేక్షకులతో పాటు ఇండియాలో కూడా చాలామంది అతని సినిమా కోసాం ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే అతని తీసిన సినిమాలు అంతలా ప్రభావం చూపిస్తాయి. అతని సినిమాలు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాయి. అతని సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ఓపెన్ హైమర్' #OppenheimerReview ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారత దేశంలో ఈ సినిమాకి ఒక వారం ముందు నుంచే మల్టీ ప్లెక్స్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసారు అంటే ఇతని సినిమాకి ఎంత క్రేజ్ వుందో అర్థం చేసుకోవాలి. #OppenheimerReview ఇది ఒక బయో పిక్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు క్రిస్టోఫర్ నోలన్. అతన్ని అణుబాంబు పితామహుడు (father of the atomic bomb) అని కూడా పిలుస్తారు. ఇక ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Oppenheimer story కథ:
అమెరికా దేశం న్యూక్లియర్ ఆయుధాలు తయారు చెయ్యడం కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టి 'మాన్‌హాటన్ ప్రాజెక్టు' (ManhattanProject) అని మొదలు పెట్టి దానికి అణు శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ (సిలియాన్ మర్ఫీ) నాయకుడిగా నియమిస్తుంది. అతనికి సహాయంగా లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్), అలాగే మిలిటరీ అధికారిగా లెస్లీ గ్రోవ్స్ (మేట్ డెమన్) ని కూడా నియమిస్తుంది అమెరికా ప్రభుత్వం. ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1945లో జరిగిన కథ. శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి టెస్ట్ చేయాలనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. ఓపెన్ హైమర్ భార్య కెథెరిన్ లేదా కిట్టి (ఎమిలీ బ్లంట్) ఎటువంటి సహాయ సహకారాలు అందించింది, అలాగే న్యూక్లియర్ బాంబు తయారీలో ఓపెన్ హైమర్ కి ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ.
విశ్లేషణ :
క్రిస్టఫర్ నోలెన్ చిత్రాలు ఇంతకు ముందు తీసిన 'టెనెట్', 'ఇన్సెప్షన్', 'ఇంటర్ స్టెల్లార్', 'ఇన్సోమనియా', 'బ్యాట్మన్ బిగిన్స్', 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్' లాంటి సినిమాలు అన్నీ చెప్పుకోదగ్గవే. అయితే ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు మామూలు ప్రేక్షకులకి అంత తొందరగా అర్థం కావు అని కూడా అంటూ వుంటారు. ఎందుకంటే అతని స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళం గా ఉంటుంది, అది అర్థం చేసుకోవటం సామాన్య ప్రేక్షకుడికి అంత తొందరగా అవదు, అందుకని అతని సినిమాలు కేవలం మేధావులకు మాత్రం అర్థం అవుతాయి, వాళ్ళ కోసమే అనే అర్థం వస్తూ ఉంటుంది. #OppenheimerReview
ఇప్పుడు ఈ సినిమా 'ఓపెన్ హైమర్' కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఎందుకంటే సినిమా ప్రారంభం అయిన దగ్గర నుండి, ప్రేజంట్, పాస్ట్ ఇలా నడుస్తూ ఉంటుంది కథనం. అయితే అదేదో కొన్ని నిముషాలు కాకుండా, చాలా సేపు సాగటం వలన, సగటు ప్రేక్షకుడు అర్థం చేసుకోవటానికి కాస్త టైము పడుతుంది. అలాగే ఈ సినిమా కేవలం ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త వ్యక్తిగత జీవితం, అతను అణుబాంబు తయారీ, తరువాత అప్పటి రాజకీయాలు ఇవన్నీ బాగా చూపించాడు నోలన్. అయితే సినిమాలో అణుబాంబు విస్పోటం సన్నివేశం కొంచెం నిరాశ పరిచిందనే చెప్పాలి. ఎందుకంటే అది పేలే సమయానికి శబ్దం లేకుండా సైలెంట్ గా చూపించడం వలన అణుబాంబు అంటే ఎంత పెద్ద వినాశనం చేస్తుందో దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రేక్షకుడికి అర్థం కాదు. కేవలం సంభాషణల మీదే సినిమా ఎక్కువగా నడుస్తుంది. ఆ సంభాషణలు అర్థం చేసుకుంటే ఈ సినిమా కొందరికి నచ్చుతుందేమో. #OppenheimerReview
ఇదిలా ఉంటే, ఈ సినిమా ఒక అమెరికన్ శాస్త్రవేత్త అయిన ఓపెన్ హైమర్ కథ. కరెక్ట్ కానీ, సినిమా చూసే ముందు అతని గురించి గూగుల్ తల్లిని అడిగి, అతను ఎవరు, ఏమి చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎందుకు అంత ప్రాముఖ్యం వహించాడు ఇవన్నీ చేయలేము కదా. సినిమా అంటే భావోద్వేగాలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్, లేదా ఇంకోటి, వేరేదో ఇలా ఎన్నో ఉంటాయి. ఇది కేవలం ఆ శాస్త్రవేత్త వ్యక్తిగత జీవితం వరకే పరిమితం అయిపోయాడు. అందుకనే కొంతమందికి ఇది అంతగా నచ్చకపోవచ్చు, నోలన్ అభిమానులకి ఇది బాగుంటుందేమో మరి. నాకయితే అంతగా ఎక్కలేదు, ఎందుకంటే ఇదేమి భారత దేశ శాస్త్రవేత్త గురించి కాదు, అలాగే ఇందులో భారత దేశం గురించి ఏమీ ఉండదు, ఒక్క సన్నివేశంలో మాత్రం మన 'భగవద్గీత' గురించి మాత్రం మాట్లాడుతారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రభోదించే భగవద్గీతను చదువుతూ ఓదార్పు పొందేవారు శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్. గీతలో కృష్ణుడు చెప్పిన మాట సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే అనేదే అతను అణుబాంబు తయారీకి ప్రేరణ అయ్యిందని చెప్పేవాడు. ఇదొక్కటే మన భారతదేశానికి సంబంధించి ఉంటుంది. #OppenheimerReview
అప్పుడెప్పుడో 'గాంధీ' అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది, అది హాలీవుడ్ వాళ్ళే తీశారు, కానీ అది మన జాతిపిత కథ, మనకి తెలిసిన కథ, అందుకని విరగబడి చూసాం. కానీ ఇప్పుడు ఈ ఓపెన్ హైమర్ అమెరికన్ శాస్త్రవేత్త, అందరికీ తెలియాలి అనీ ఏమీ లేదు కదా. అదే ఏ అబ్దుల్ కలాం, లేదా ఇంకో భారత శాస్త్రవేత్త ఉంటే చూస్తాం. అయితే అణుబాంబు తయారు చేసిన తరువాత అది ప్రయోగించాక కలిగిన విధ్వంసం ఆ శాస్త్రవేత్తని ఎలాంటి మానసిక వేదనకి గురి చేసింది అన్న సన్నివేశాలు బాగా చూపించాడు నోలన్. 'I became death, I am the destroyer of the world' అని అంటాడు 'నేను ప్రపంచ వినాసకుడిని అయ్యాను' ఈ బాంబ్ తయారు చేసి అని చెప్పటం ఆ సంభాషణలు బాగున్నాయి. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్, ఓపెన్ హైమర్ మధ్య నడిచే సంభాషణలు, సన్నివేశాలు, భావోద్వేగాలు బాగుంటాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, కానీ మొత్తం మూడు గంటలు కూర్చొని సినిమా చూడాలంటే కష్టమే.
ఇక నటీనటుల విషయానికి వస్తే సిల్లియన్ మర్ఫీ ప్రధాన పాత అయిన ఓపెన్ హైమర్ గా అద్భుతంగా నటించాడు. అతని హావభావాలు, అణుబాంబు తాయారు చేసాక అతని ఎంత మానసికంగా కృంగిపోయాడు అనేవి అతను చూపించిన విధానం, అతని ప్రతిభకి నిదర్శనం.
అలాగే 'ఐరెన్ మ్యాన్' ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ సినిమాలో ఒక ప్రాధాన్యం వున్న పాత్రలో నటించాడు. అతను మాత్రం హైలైట్ అనే చెప్పాలి. చాలా అద్భుతంగా నటించాడు. అటామిక్ ఎనేర్జి కమిషన్ చైర్మన్ లూయీస్ ట్రోస్ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి. ఇగో తో ఎలా అతను ఓపెన్ హైమర్ ని పడగొట్టాలి అనుకున్నాడో బాగా చేసాడు. అలాగే ఇంకో బాగా తెలిసిన నటుడు మాట్ డామన్ మిలిటరీ అధికారి పాత్రలో బాగా రాణించాడు. ఎమిలీ బ్లంట్ ఓపెన్ భార్యగా పరవాలేదు అనిపించింది. చాలామంది నటీనటులు వున్నారు, అందరూ బాగా సపోర్ట్ చేశారు అనే చెప్పాలి.
ఇక చివరగా, ఈ 'ఓపెన్ హైమర్' సినిమా కొంతమందికి మాత్రమే నచ్చే సినిమా, ముఖ్యంగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అభిమానులకి. సామాన్య ప్రేక్షకుడికి అయితే మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇది ఎక్కువగా సంభాషణల మీద నడిచే సినిమా. అప్పటి రాజకీయాలు, ఆ శాస్త్రవేత్త మానసిక క్షోభ ఇవన్నీ అక్కడక్కడా బాగుంటాయి, కానీ మూడు గంటలు కూర్చొని ఇంత పెద్ద సినిమా చూడాలంటే, ముఖ్యంగా సినిమా ద్వారా ఎంటర్ టైన్ మెంట్ కావాలనుకునే వాళ్ళకి కష్టమే.