Shaitan web series: వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి, ఎందుకంటే...
ABN, First Publish Date - 2023-06-12T15:23:15+05:30
'సైతాన్' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అవగానే వైసీపీ కార్యకర్తలు కొంచెం ఆందోళన చెందిన మాట వాస్తవం. అసలు వైసీపీ కి, ఈ 'సైతాన్' వెబ్ సిరీస్ కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా, అదేంటో మీరే చూడండి
'సేవ్ ది టైగెర్స్' (SaveTheTigers) అనే కామెడీ వెబ్ సిరీస్ కి బ్యాక్ బోన్ లా వున్న దర్శకుడు మహి వి రాఘవ (MahiVRaghava) 'సైతాన్' (Shaitan) అనే ఇంకో వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు, నిర్మించాడు కూడా. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో విడుదల అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదల అయింది. ట్రైలర్ లోనే పచ్చి బూతులు, తలలు తెగడాలు, వినడానికి, రాయడానికి చెప్పనలవికాని బూతులు కొన్ని పాత్రల ద్వారా చెప్పించాడు మహి వి రాఘవ.
అయితే ఈ 'సైతాన్' వెబ్ సిరీస్ పట్ల వైసీపీ శ్రేణులు ఎందుకు అసంతృప్తి చెందుతున్నారు అనే ఆలోచన మీకు వస్తోంది కదా. దానికే వస్తున్నాం. ఈ బూతు వెబ్ సిరీస్ చేసిన మహి వి రాఘవ (MahiVRaghava) ఇంతకు ముందు 'యాత్ర' #Yatra అనే సినిమా దర్శకత్వం చేసాడు. అది దివంగత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి (YSJaganmohanReddy) తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి (YSRajasekharReddy) బయోపిక్. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రావటం, అక్కడ ఎదగటం, ఆ తరువాత పాదయాత్ర చేసి ఎలా ముఖ్యమంత్రి అయ్యారు, అతను చనిపోయేవరకు ఆ సినిమాలో ఉంటుంది. అది ఇంతకు ముందు జనరల్ ఎలెక్షన్స్ అప్పుడు తీసిన సినిమా, తరువాత వైస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
అంతవరకు బాగానే వుంది, కానీ ఇప్పుడు అదే దర్శకుడు 'యాత్ర 2' #Yatra2 సినిమా తీస్తాను అంటున్నాడు. ఇందులో వైస్ జగన్మోహన్ రెడ్డి గురించి, అతని పాద యాత్ర గురించి ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు 'సైతాన్' #Shaitan లాంటి బూతు పదాలతో కూడిన ఒక వెబ్ సిరీస్ తీసి, తరువాత 'యాత్ర 2' తీస్తే ప్రజలు హర్షిస్తారా అని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వస్తోంది. ఈ 'సైతాన్' వెబ్ సిరీస్ ప్రభావం ఇప్పటికే చాలామంది ప్రేక్షకుల మీద పడింది, పబ్లిక్ లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు కూడా మన తెలుగు వెబ్ సిరీస్ లు ఏంటి ఇలా తయారయ్యాయి అని.
ఇంతవరకు మంచి కంటెంట్ తో వచ్చిన దర్శకుడు రాఘవ, ఇప్పుడు ఎందుకు ఇలాంటి బూతు పదజాలంతో వెబ్ సిరీస్ తీయటం, దీని ప్రభావం సినిమా మీదా కూడా ఉంటుంది అని అంటున్నారు. పరిశ్రమలో కూడా చాలా నెగటివ్ టాక్ వుంది, ఆ ట్రైలర్ చూసాక. ఇలాంటి దర్శకుడితోనా మనం పని చేసాం అని కూడా కొంతమంది వేరే వాళ్ళతో అన్నారు అని కూడా తెలిసింది ఇది చూసాక. ఇదే ప్రభావం ఇప్పుడు వైసీపీ పార్టీ మీద కూడా పడుతుంది అని వైసీపీ శ్రేణులు భయపడుతున్నారు అని తెలిసింది. మరి ఇప్పుడు ఆ ఒత్తిడితో మహి రాఘవ 'యాత్ర 2' తీస్తాడా, లేదా ఆపేస్తాడో చూడాలి మరి.