Salaar: ప్రభాస్ సినిమా విడుదలతో గందరగోళం అయిన మిగతా సినిమాల విడుదల తేదీలు
ABN, First Publish Date - 2023-09-26T18:04:47+05:30
సెప్టెంబర్ 28 'సలార్' విడుదల కావటం లేదని తెలిసిన వెంటనే, చాలా సినిమాలు తమ విడుదల తేదీల్ని వెనక్కి, ముందుకు జరిపాయి. ఇప్పుడు మళ్ళీ 'సలార్' డిసెంబర్ 22 న విడుదల అనగానే, ఇంకోసారి చాలా సినిమాలు విడుదల తేదీలు మార్చుకోవాల్సి వస్తోంది. ఈ ప్రభావం సినిమా రెవిన్యూ మీద పడే అవకాశం వుంది అని అంటున్నారు.
ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' #Salaar విడుదల తేదీ సెప్టెంబర్ 28 అని ముందుగా ప్రకటించినప్పుడు ఆ తేదీకి అనుగుణంగా నిర్మాతలు తమ రాబోయే సినిమాలు విడుదల తేదీలు ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడయితే 'సాలార్' విడుదల వాయిదా పడింది అని అన్నారో, చాలా సినిమాల విడుదల తేదీలు తారుమారు అయ్యాయి, ముందుకు వెనక్కి జరిగాయి. ఇది కొంతమందికి నష్టం, కొంతమంది లాభం. గత రెండు వారాల్లో థియేటర్స్ వాళ్ళకి సినిమాలు లేక చాలాచోట్ల షోస్ క్యాన్సల్ చేసారు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
సరే, 'సలార్' విడుదల వాయిదా పడింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త తేదీని ప్రకటించారు, అది డిసెంబర్ 22 అని. అయితే అధికారికంగా ఆ ప్రొడక్షన్ సంస్థ నుండి ఈ వార్త రాలేదు, కానీ వస్తుంది అని అంటున్నారు. ఒకవేళ 'సలార్' డిసెంబర్ 22న విడుదలైతే, ఇప్పుడు ఇంకొన్ని సినిమాల విడుదల తేదీలు మార్చాల్సి వస్తుంది. ఈ సినిమా నిర్మాతలు వేరే తేదీ కోసం వెతుక్కోవాలి. ఎన్నాళ్ల నుండో క్రిస్మస్ సెలవుల్లో విడుదల చెయ్యాలని చాలా సినిమాలు తమ విడుదల తేదీని డిసెంబర్ 21, 22, 23 తేదీలకోసం పెట్టుకున్నాయి. మరి ఇప్పుడు 'సలార్' సడన్ గా విడుదల తేదీ ప్రకటిస్తే వాటి పరిస్థితి ఏంటి అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.
నాని (Nani), మృణాల్ ఠాకూర్ (MrunalThakur) నటించిన 'హాయ్ నాన్న' #Hi!Nanna డిసెంబర్ 21న, వెంకటేష్ (VenkateshDaggubati), దర్శకుడు శైలేష్ కొలను (SaileshKolanu) తో చేస్తున్న 'సైంథవ్' #Saindhav కూడా డిసెంబర్ 22న విడుదలకి పెట్టుకున్నారు. నితిన్ (NIthiin), వక్కంతం వంశీ (VakkanthamVamsi) చేస్తున్న ''ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' #Extraordinary Man డిసెంబర్ 23న విడుదల అనుకుంటున్నారు. అలాగే ఇంకో సినిమా 'హరోం హర' #HaromHara సినిమా కూడా ఇదే తేదీల్లో విడుదల అనుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఆ విడుదల తేదీలు మార్చుకోవాలి, లేదా అనుకున్న తేదీకి కొన్ని సినిమాలు వచ్చేయాలి.
'సలార్' ఈ తేదీకైనా విడుదల అవుతుంది అని చెప్పగలరా, లేదా ఆ తేదీకి వస్తున్నాం అని చెప్పి ఒక వారము ముందు వాయిదా వేస్తున్నాం అని అంటే పరిస్థితి ఏంటి అని చర్చ నడుస్తోంది. ఇలా ఒక పెద్ద సినిమా విడుదల వలన ఎన్నో సినిమాల విడుదల తేదీలు ముడిపడివున్నాయి, మరి నిర్మాతలు అందరూ మాట్లాడుకొని ఏమి చేస్తారో చూడాలి అని పరిశ్రమలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసింది.