Exclusive News: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆగిపోయింది, హరీష్ శంకర్ వేరే సినిమా మొదలెట్టేసాడు
ABN, First Publish Date - 2023-11-16T10:57:20+05:30
పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంచెం నిరాశే అని చెప్పాలి. దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఆగిపోయింది. ఆంధ్రాలో ఎన్నికలు అయ్యాక ఆ సినిమా షూటింగ్ చేద్దామని చెప్పడంతో ఇప్పుడు హరీష్ శంకర్ వేరే సినిమా చేస్తున్నాడు, అది ఎవరితో అంటే...
పవన్ కళ్యాణ్ (PawanKalyan), హరీష్ శంకర్ (HarishShankar) కాంబినేషన్ లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' #UstaadBhagathSingh షూటింగ్ కొంత జరిగిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఎక్కువ సమయం కేటాయిస్తూ, ఇటు సినిమాలకి కూడా మధ్య మధ్యలో కొన్ని రోజులు ఇచ్చి షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' #OG ఈ రెండు సినిమాలు పూర్తి చెయ్యాలని అనుకొని ఈ రెండిటికి కొన్ని రోజులు కేటాయించి షూటింగ్ మొదలెట్టారు. 'ఓజి' సినిమా పూర్తయింది అని సమాచారం. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఆగిపోయింది, ఇప్పట్లో జరిగేది లేదు అని దర్శకుడుకి, నిర్మాతలకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలిసింది. (Ustaad Bhagat Singh is after elections, director Harish Shankar shifted to another film). ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) నిర్మాతలు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకే తన సమయం కేటాయించాలని నిర్ణయించుకోవడంతో, దర్శకుడు హరీష్ శంకర్ ని పిలిచి వేరే సినిమా చేసుకోమన్నట్టుగా కూడా తెలిసింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు అయ్యాక సినిమా షూటింగ్ మళ్ళీ మొదలెట్టొచ్చు అని కూడా చెప్పినట్టు తెలిసింది. అంటే సుమారు ఒక ఎనిమిది (8) నెలల పాటు షూటింగ్ కి అంతరాయం ఉంటుంది అని చెప్పినట్టు భోగట్టా.
దీనితో హరీష్ శంకర్ ఇప్పుడు తన తదుపరి సినిమా రవితేజ తో మొదలెట్టినట్టుగా కూడా తెలిసింది. ఈరోజు హరీష్ శంకర్, రవితేజ కలిసి చెయ్యబోయే సినిమా లుక్ టెస్ట్ ఒక ప్రైవేట్ స్టూడియో లో చేస్తున్నట్టుగా కూడా వార్త వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 20 నుండి ఉంటుందని, ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని సమాచారం అందింది. అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అయితే ఇప్పట్లో లేనట్టే అని అర్థం అవుతోంది. ఎన్నికలు అయ్యాక పరిస్థితులను చూసుకొని అప్పుడు తిరిగి షూటింగ్ చెయ్యాలా వద్దా అనే విషయం మీద నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది.