Ashwini Dutt: చిరంజీవి, వసిష్ఠ సినిమా ఉద్దేశించి ఇచ్చిందేనా ఆ ప్రకటన....
ABN, First Publish Date - 2023-10-12T13:13:35+05:30
నిర్మాత అశ్విని దత్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా సర్వ హక్కులు తమ దగ్గరే ఉన్నాయని, ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి సీక్వెల్స్, ప్రీక్వల్స్, లేదా ఇంకెటువంటి సమాచారం కూడా వాడకూడదు అని ఈ ప్రకటనలో చెప్పారు. చిరంజీవి రాబోయే సినిమా ఫాంటసీ సినిమా అవటం వలన ఆ సినిమాని ఉద్దేశించి ఈ ప్రకటన ఇచ్చారు అని ఒక చర్చ నడుస్తోంది.
నిన్న ప్రముఖ నిర్మాత అశ్విని దత్ (AshwinDutt) ఒక పబ్లిక్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో తమ సంస్థ వైజయంతి మూవీస్ (VyjyanthiMovies) నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' #JagadekaVeeruduAthilokaSundari సినిమా సర్వ హక్కులు తమవే అని, ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి పాత్ర పేరు కానీ, సంగీతం, కథ, కథనం ఎటువంటిదైనా ఆ సినిమా నుండి ఎవరైనా ఎక్కడైనా వాడితే వాళ్ళకి కాపీ రైట్ చట్టం కింద నోటీసులు ఇస్తామని, అలా వాడటం చట్ట విరుద్ధం అని ఆ ప్రకటనలో చెప్పారు. 1990లో విడుదలైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా మీద సర్వ హక్కులు తమవే అని, ఎవరికి ఇవ్వలేదని, తమకి చెప్పకుండా, తెలియకుండా ఎవరూ అందులో ఒక్క బిట్ కూడా వాడకూడదు అని ఆ సారాంశం.
అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఈ ప్రకటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడు, శ్రీదేవి (Sridevi) కథానాయిక, రాఘవేంద్ర రావు (KRaghavendraRao) దర్శకుడు. అయితే మరి ఇప్పుడు ఈ సినిమాకోసం ఎందుకు నిర్మాత అశ్విని దత్ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది అనే చర్చ పరిశ్రమలో నడుస్తోంది.
చిరంజీవి, దర్శకుడు మల్లిడి వసిష్ఠతో (MallidiVasishta) ఒక ఫాంటసీ సినిమా చేస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పని కూడా మొదలయ్యింది. ఈ సినిమా టైటిల్ కూడా 'భూలోకవీరుడు' #Bhoolokaveerudu ఉండొచ్చు అని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇంతవరకు బాగానే వుంది, కానీ ఈ సినిమాలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాకి సంబంధించి ఒక బిట్ ఉండొచ్చు అనీ ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే ఆ సినిమా కథకి, ఈ 'భూలోకవీరుడు' సినిమా కథకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం రెండూ ఫాంటసీ సినిమా కథలు మాత్రమే అని అంటున్నారు.
దర్శకుడు వసిష్ఠ, పాత సినిమా నుండి కొన్ని సన్నివేశాలు ఈ 'భూలోకవీరుడు' లో పెడుతున్నాడేమో అని సందేహం కొందరి వెలిబుచ్చటంతో ఈ ప్రకటన బయటకి వచ్చింది అని కొందరు పరిశ్రమలో అంటున్నారు. ఒకవేళ ఏదైనా రిఫరెన్సులా తీసుకున్నా, ఆ రెండు సినిమాల్లో చిరంజీవే కథానాయకుడు, అతనికి నిర్మాత అశ్విని దత్ మంచి స్నేహితులు అని చెపుతూ వుంటారు కదా, మరి ఇద్దరూ మాట్లాడుకోవచ్చు కదా, ఇలా ప్రకటన ఇచ్చే బదులు అని కూడా ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే పేపర్ లో ప్రకటన ఇవ్వడమే కాకుండా, ఆ ప్రకటనని మీడియా గ్రూపుల్లో సర్క్యూలేట్ కూడా చేయించారు. చిరంజీవి రాబోయే సినిమాని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇలా ప్రటకన ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. అదీ కాకుండా ఒక్క 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా కోసమే ఆ ప్రకటన ఇచ్చారు కాబట్టి అందులో సన్నివేశాలు ఏమైనా 'భూలోకవీరుడు' లో పెడతారేమో అనే అనుమానం వుండి ఇచ్చారు అని కూడా అంటున్నారు. అందుకని ఇది కేవలం చిరంజీవి రాబోయే సినిమాని ఉద్దేశించి ఇచ్చిన ప్రకటన అని అంటున్నారు.
అయితే ఈ సినిమా గురించి అటు చిరంజీవి గానీ, నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ కానీ, దర్శకుడు వసిష్ఠ గానీ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. ఇది కేవలం ఫాంటసీ సినిమా మాత్రమే అన్న వార్త బయటకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది అని తెలిసింది. ఇందులో రానా దగ్గుబాటి (RanaDaggubati) విలన్ గా కనపడతాడు అని తెలిసింది.