Ravi Teja: ఆ సినిమా రద్దు, ఇప్పుడు జాతి రత్నాలు దర్శకుడితో
ABN, First Publish Date - 2023-12-01T16:25:21+05:30
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని తో చెయ్యాల్సిన సినిమా రద్దయినట్టుగా వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సినిమాకి బదులు 'జాతి రత్నాలు' దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నట్టుగా వార్త. ఇదిలా ఉండగా ఇంకో సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో డిసెంబర్ 20 నుండి షూటింగ్ మొదలవ్వచ్చని కూడా అంటున్నారు.
ఇప్పుడున్న నటులలో రవితేజ రెండు మూడు సినిమాలతో బిజీగా వుంటున్నారు. అతని సినిమా 'ఈగిల్' #Eagle సంక్రాంతి బరిలో ఉండగా, ఇంకో రెండు సినిమాలకి రవి తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో చెయ్యాల్సిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఆంధ్రాలో ఎన్నికలయ్యాక చేద్దాం అని పక్కన పెట్టేసారు. ఇంకా చేసేది లేక హరీష్ ఇప్పుడు రవితేజతో సినిమా చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా డిసెంబర్ 20 నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం వుంది.
ఇదిలా ఉండగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవి తేజ చెయ్యాల్సిన సినిమా రద్దయినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ రద్దుకు రవి తేజ పారితోషికం ఎక్కువ అడగటం వలన అని కూడా వార్త హల్ చల్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించాల్సి ఉండగా, ఇది రద్దయింది.
ఇప్పుడు రవి తేజ , గోపీచంద్ ప్లేస్ లో 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కెవి తో చేస్తున్నట్టుగా వార్త వస్తోంది. అనుదీప్ ఒక స్క్రిప్ట్ రాసుకొని రవితేజని కలిసాడని, దానికి రవితేజ తనకి అనుకూలంగా కొన్ని మార్పులు చేసుకున్నాడని కూడా తెలుస్తోంది. ఈ సినిమా ఒక ప్రముఖ నిర్మాత నిర్మించనున్నాడని కూడా తెలుస్తోంది. అయితే రవితేజ ఈ కథ ఒక ఎంటర్ టైనమెంట్ గా వుండేటట్టు చూసుకున్నాడని కూడా తెలుస్తోంది.