కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

N vs N: వినోదం వెర్సస్ సెంటిమెంట్

ABN, First Publish Date - 2023-11-27T14:21:20+05:30

నాని, నితిన్ సినిమాలు వచ్చేవారం ఒకరోజు తేడాతో రెండూ విడుదలవుతున్నాయి. నాని సినిమా సెంటిమెంట్ అయితే నితిన్ సినిమా వినోదం, అందుకని వచ్చేవారం నాని, నితిన్ సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా వుండబోతోంది అని టాక్ నడుస్తోంది...

Nani's Hi Nanna and Nithiin's Extra Ordinary Man releasing next week

వచ్చేవారం తెలుగు సినిమాల మధ్య పోటీ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇద్దరు నటులు నాని (Nani), నితిన్ (Nithiin) సినిమాలు డిసెంబర్ 7, 8 తేదీల్లో వరసగా విడుదలవుతున్నాయి. చెప్పాలంటే ఈ రెండూ క్రిస్మస్ సెలవులకి విడుదలవ్వాలి, కానీ ప్రభాస్ (Prabhas) సినిమా 'సలార్' #Salaar డిసెంబర్ 22 న విడుదలవడంతో ఈ రెండు సినిమాలు తమ విడుదల తేదీని ముందుకు జరుపుకున్నాయి. రెండో ఒకరోజు తేడాతో విడుదలవుతున్నాయి.

ఇక నాని సినిమా 'హాయ్ నాన్న' #HiNanna లో నాన్న సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్ ఉంటుంది అని ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ సినిమా ప్రచారాలు నాని తన భుజాలమీద వేసుకొని చేస్తున్నాడు. తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా విడుదలవుతోంది ఈ సినిమా కాబట్టి, ఆయా ప్రాంతాలకు వెళ్లి తన సినిమా గురించి చెపుతున్నాడు. ఈ సినిమాలో సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందని కూడా తెలుస్తోంది. ఇది నానికి 30వ చిత్రం, కాగా ఈ సినిమాకి దర్శకుడు శౌర్యువ్, అతనిది మొదటి సినిమా. మృణాల్ ఠాకూర్ (MrunalThakur) ఇందులో కథానాయికగా నటిస్తోంది, ఆమె ఎందుకో ప్రచారాలకు దూరంగా వుంది అని ఒక వార్త నడుస్తోంది. ఇక ఇందులో శృతి హాసన్ (ShrutiHaasan), అంగద్ బేడీ (AngadiBedi), జయరాం (Jayaram) మున్నగు నటీనటులు కూడా వున్నారు.

ఇక నితిన్ సినిమా ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ #ExtraordinaryMan లో వినోదం పాలు ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా టీజర్ లో కూడా ఆ విషయం చెప్పకనే చెప్పారు. దీనికి వక్కంతం వంశీ (VakkanthamVamsi) దర్శకుడు, అతను రచయిత కూడాను. ఈ సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తెలుగు అమ్మాయి శ్రీలీల (Sreeleela) కథానాయకురాలు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా. ఇక ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇందులో నితిన్, రావు రమేష్ (RaoRamesh) మధ్య వచ్చే సన్నివేశాలు కచ్చితంగా ఈలలు, చప్పట్లతో హాలు మారుమోగుతుందని ఈ సినిమా రషెస్ చూసినవాళ్లు, డైలాగ్స్ విన్నవాళ్ళు చెపుతున్న మాట. రావు రమేష్ కి 'ప్రతిరోజు పండగ' సినిమాతో ఎంత పేరు వచ్చిందో, ఈ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్' లో చేసిన పాత్రకి దానికన్నా వందరెట్లు ఎక్కువ పేరు వస్తుందని చిత్ర నిర్వాహకులు చాలా నమ్మకంగా వున్నారు. ఈ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతోంది, అప్పుడు ఈ సినిమా గురించి ఇంకా చాలా విశేషాలు తెలిసిపోతాయి. పోలీసు ఆఫీసర్ పాత్రకు మారుపేరుగా వున్న రాజశేఖర్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

ఇంకో ఆసక్తికరం అంశం ఏంటంటే ఈ రెండు సినిమాలు నాన్న సెంటిమెంట్ మీదే అని తెలుస్తోంది. అయితే 'హాయ్ నాన్న' కొంచెం సీరియస్ గా వుండే నాన్న సబ్జెక్టు లా కనపడుతోంది, 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్' లో సరదాగా వుండే నాన్న లా కనపడుతోంది. మరి ఇప్పుడు సెంటిమెంట్ కి వినోదకి మధ్య పోటీ ఉంటుంది అన్నట్టుగా వుంది. దీనితో వచ్చేవారం నాని వెర్సస్ నితిన్ సినిమాలు, సెంటిమెంట్ వెర్సస్ వినోదం అని కూడా ఒక టాక్ నడుస్తోంది. ఈ రెండిటిలో ప్రేక్షకులు ఏది కోరుకుంటారో చూడాలి, రెండూ విజయం సాధిస్తే ఇంకా మంచిది, పరిశ్రమకి మంచి జరుగుతుంది. నితిన్ ఇంతకు ముందు 'భీష్మ' లాంటి సినిమాలో మంచి కామెడీ టైమింగ్ చూపించి విజయం సాధించాడు, ఇందులో కూడా అతని పాత్ర చాలా 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ' గా ఉంటుంది అని అంటున్నారు.

Updated Date - 2023-11-27T14:21:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!