సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Writer Padmabhushan Review: విషయం లేని పుస్తకం

ABN, First Publish Date - 2023-02-03T17:06:40+05:30

నటుడు సుహాస్ (Suhas) ఇంతకు ముందు 'కలర్ ఫోటో' (Color Photo) అనే సినిమాలో లీడ్ యాక్టర్ గా చేసాడు, ఆ సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. సుహాస్ కమెడియన్ గా, ఇంకా క్యారెక్టర్ పాత్రలు చేస్తూనే ఇలా అవకాశం వచ్చినప్పుడు లీడ్ యాక్టర్ గా కూడా చేస్తున్నాడు. ఆలా చేసిందే ఈ సినిమా 'రైటర్ పద్మభూషణ్' (Writer Padmabhushan).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా: రైటర్ పద్మభూషణ్

నటీనటులు : సుహాస్, టీనా శిల్ప రాజ్, రోహిణి మొల్లేటి, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, గౌరి ప్రియ తదితరులు

సంగీతం: కళ్యాణ్ నాయక్

ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్ శాకమూరి

రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్

నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్

--- సురేష్ కవిరాయని

నటుడు సుహాస్ (Suhas) ఇంతకు ముందు 'కలర్ ఫోటో' (Color Photo) అనే సినిమాలో లీడ్ యాక్టర్ గా చేసాడు, ఆ సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. సుహాస్ కమెడియన్ గా, ఇంకా క్యారెక్టర్ పాత్రలు చేస్తూనే ఇలా అవకాశం వచ్చినప్పుడు లీడ్ యాక్టర్ గా కూడా చేస్తున్నాడు. ఆలా చేసిందే ఈ సినిమా 'రైటర్ పద్మభూషణ్' (Writer Padmabhushan). షణ్ముఖ ప్రశాంత్ (Shanumukha Prashanth) అనే అయన దర్శకుడు దీనికి, ఇందులో రోహిణి (Rohini Molleti), ఆశిష్ విద్యార్థి (Ashish Vidhyarthi) కూడా ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమా కి ప్రచారాలు చాల ఎక్కువ చేశారు, విడుదలకి ముందే సినిమా చాలామందికి వేసి చాల బాగుంది అన్న హైప్ తెచ్చారు. అసలు సినిమా ఎలా వుందో చూద్దాం.

Writer Padmabhushan story కథ:

పద్మభూషణ్ (సుహాస్) అనే ఒక యువకుడు విజయవాడ లైబ్రరీలో పని చేస్తూ ఉంటాడు. అతనికి రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనేది చిన్నప్పటి నుండి కోరిక, అందుకని పుస్తకం రాసి, అచ్చు కూడా వేసుకొని అందరికి ఫ్రీ గా ఇస్తూ ఉంటాడు చదవమని. అయితే ఇతను పుస్తకం రాసినట్టు, అది అచ్చు వెయ్యడానికి నాలుగు లక్షలు అప్పు చేసినట్టు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడు. పేరు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పాలని చూస్తాడు. కానీ అతను అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి లా ఆ పుస్తకం ఎవరూ చదవరు, కొనరు కూడా. తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టాలి, పుస్తకం ఎవరు కొనరు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయం లో అతని పేరు మీద ఇంకో పుస్తకం బయటకి వస్తుంది. ఈ రెండో పుస్తకం పెద్ద విజయం సాధిస్తుంది, వెంటనే తన మేనమామ ఒక ఫంక్షన్ లో తన కూతురిని పద్మభూషణ్ కి ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అప్పుడే మరదలు సారిక (టీనా శిల్పరాజ్) కూడా పద్మభూషణ్ ని చూడటం తరువాత ఇద్దరూ తరుచూ కలుసుకోవటం ఇలా ఒకరి మనసు ఇంకొకరు తీసుకోవటం జరుగుతుంది. అలాగే పద్మభూషణ్ పేరుతో ఒక బ్లాగ్ కూడా వస్తుంది. అన్నీ సంతోషంగా వున్న సమయంలో బ్లాగ్ లో తరువాత ఎపిసోడ్స్ ఆగిపోతాయి, పద్మభూషణ్ పుస్తకం రాయలేదన్న నిజం బయట పడుతుంది. మేనమామ కూడా ఇంకో పుస్తకం ప్రింట్ అయినా తరువాతే పెళ్లి అంటాడు. ఇంతకీ పద్మభూషణ్ పేరు మీద ఎవరు పుస్తకం రాశారు ? బ్లాగ్ లో వున్న ఫోన్ నెంబర్ ఎవరిదీ? అతని పెళ్లి మరదలితో అయిందా లేదా? చివరికి ఏమైంది అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ 'రైటర్ పద్మభూషణ్' సినిమా ఒక సందేశం కూడా వుండే విధంగా తీయాలని అనుకున్నట్టుగా కనపడుతోంది. అయితే అది కేవలం చివరి 15 నిముషాల పతాక సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేసాడు. ఆ పదిహేను నిముషాల కోసం ముందు సినిమా లో చాలా సన్నివేశాలు సాగ దీసాడు దర్శకుడు. విజయవాడలో ఓ కుర్రాడు రచయిత కావాలని, పెద్ద పెద్ద రచయితల ఫోటోలతో తన ఫోటో కూడా ఉండాలని కలలు కంటాడు. అందుకోసం అతను పడే తాపత్రయం, అచ్చు వేసిన పుస్తకాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వడానికి చేసే విధానం, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎలా ఇచ్చేస్తారో ఇవన్నీ కొంచెం బాగున్నాయి. కానీ సన్నివేశాలు చాలా మట్టుకు కృత్రిమంగా అనిపించాయి. నాలుగు లక్షలు అప్పు తెచ్చి మరీ ఓ కుర్రాడు తన కథని ప్రింట్ చేయించటం ఎంతవరకు సబబు అదీ తల్లిదండ్రులకి తెలియకుండా. మళ్ళీ ఆ పుస్తకం అతను అన్ని పుస్తకాల షాప్స్ లోనూ అమ్మకానికి పెడతాడు, అందరికీ తెలుస్తుంది, కానీ తల్లిదండ్రులకి తెలియదు. పుస్తకం అచ్చు వెయ్యగానే మేనమామ వచ్చి పిల్లనిస్తాను అనటం కూడా నమ్మశక్యంగా లేదు.

అలాగే కొన్ని సన్నివేశాల్లో ముఖ్యంగా సినిమా థియేటర్ లో హాస్యం బాగా పండింది. ఇంతకీ పద్మభూషణ్ పేరు మీద ఎవరు రాస్తున్నారు అన్నది కొంచెం ఆసక్తికరంగా వున్నా, అది ప్రేక్షకుడికి వెంటనే అర్థం అయిపోతుంది ఎవరు అన్నదీ. కథానాయకుడు, అతని తల్లిదండ్రులు అంత మధ్యతరగతి కుటుంబం లా చూపించినా సినిమా మొత్తం మీద భావోద్వేగాలు, వాళ్ళ మధ్య వుండే ఆ గాఢ అనుబంధాలు చూపించటంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు.

అలాగే చివర 15 నిముషాలు సందేశం, ఆలోచించే పరంగా తీసాం అని దర్శకుడు అనుకున్నా, అందులో పస లేదు, భావోద్వేగాలు (Emotions) అస్సలు లేవు . అవి లేనప్పుడు ఈ సినిమానే కాదు, ఏ సినిమా కూడా వర్క్ అవుట్ కాదు. అసలు కథలో, కథనం లో చాలా లోపాలు వున్నాయి. అంత ఖర్చు పెట్టి ఒక పుస్తకం అచ్చు వెయ్యటం అంత సులువా? ఒక రచయిత పేరుతో ఇంకో రచయిత పుస్తకం అచ్చు వేస్తె ఊరుకుంటారా? ఇలా చాలా సన్నివేశాలు వున్నాయి ఈ కథలో.

ఇక నటీనటుల విషయానికి వస్తే సుహాస్ రైటర్ పద్మభూషణ్ గా బాగా చేసాడు. కొన్ని సన్నివేశాల్లో హాస్యం బాగా పండించాడు. కానీ కథ సరిగ్గా లేనప్పుడు అతను మాత్రం ఏమి చేస్తాడు. ఇంకా భూషణ్ తల్లిదండ్రులుగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి బాగా ఒదిగిపోయారు. ముఖ్యంగా రోహిణి, ఆమెకి ఈ అమ్మ పాత్రలు ఏమి కొత్త కాదు. అందుకని చాలా ఈజీ గా చేసేసారు ఆమె. కథానాయిక టీనా శిల్పరాజ్ పరవాలేదు అనిపించింది. ఇంకో అమ్మాయి శ్రీ గౌరీ చూడటానికి బాగుంది, చలాకీగా వుంది. గోపరాజు రమణ తన పాత్ర పరిధి మేరకు బాగా నటించాడు. ఇంకా మిగతా పాత్రలో చాలామంది నటులు కనిపిస్తూ వుంటారు. సాంకేతికంగా సినిమా ఛాయాగ్రహణం బాగుంది. విజయవాడ వూరుని బాగా చూపించారు. సంగీతం ఒకే, మాటలు కూడా పరవాలేదు.

చివరగా, 'రైటర్ పద్మభూషణ్' సినిమాలో కథ చాలామట్టుకు కృత్రిమంగా అనిపిస్తుంది, చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా వున్నాయి. చివరి 15 నిముషాలు ఎదో సందేశం ఉంటుంది, కానీ అదొక్కటే కాదు కదా సినిమా విజయం సాధించాలి అంటే. కథ, కథనం లో కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.

Updated Date - 2023-02-03T17:06:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!