Ustaad film review: ఆ జాబితాలో ఈ 'ఉస్తాద్' మరో సినిమా !
ABN, First Publish Date - 2023-08-12T16:23:36+05:30
శ్రీసింహ కోడూరి పెద్ద ఫిలిం కుటుంబం నుండి వచ్చిన మరో కథానాయకుడు. ఇంతకుముందు 'మత్తు వదలరా' అనే సినిమాతో ఆరంగేట్రం చేసి తరువాత నాలుగైదు సినిమాలు చేసాడు, కానీ ఏవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేదు. ఇప్పుడు 'ఉస్తాద్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఫణిదీప్ దర్శకుడు, కావ్య కళ్యాణ్ రామ్ కథానాయకురాలు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: ఉస్తాద్
నటులు: శ్రీ సింహా, కావ్య కళ్యాణ్ రామ్, అను హాసన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రవి శివతేజ, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా తదితరులు
ఛాయాగ్రహణం: పవన్ కుమార్ పప్పుల
సంగీతం: అకీవా బి
రచన, దర్శకత్వం: ఫణిదీప్
నిర్మాతలు: రజిని కొర్రపాటి, రాకేష్ రెడ్డి గెడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
-- సురేష్ కవిరాయని
శ్రీ సింహ కోడూరి (SriSimhaKoduri), ఆస్కార్ అవార్డు (OscarAward) గ్రహీత, అగ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MMKeeravani) రెండో కుమారుడు, 'మత్తు వదలరా' #MathuVadalara సినిమాతో కథానాయకుడిగా ఆరంగేట్రం చేసాడు. ఆ సినిమా బాగానే నడిచింది, మంచి పేరు కూడా తీసుకువచ్చింది. కానీ ఆ సినిమా తరువాత చేసిన సినిమాలు మాత్రం శ్రీ సింహ కోడూరి ని బాగా నిరుత్సాహ పరిచాయి అనే చెప్పాలి. అయినా శ్రీ సింహ వివైద్యమైన కథలతో వస్తూనే వున్నాడు. ఇప్పుడు 'ఉస్తాద్' #UstaadFilmReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీసింహ బాబాయి మరియు అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SSRajamouli), నటుడు నాని (Nani) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చి ఈ సినిమా ప్రచారాల్లో పాల్గొన్నారు. అందుకని ఈ సినిమా మీద కొంచెం ఆసక్తికరం ఏర్పడింది. దీనికి ఫణిదీప్ (Phanideep) దర్శకుడు కాగా, కావ్య కళ్యాణ్ రామ్ (KavyaKalyanRam) కథానాయకురాలు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GautamVasudevMenon) ఇందులో ఒక ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Ustaad story కథ:
చిన్నప్పుడే తండ్రి పోవటంతో సూర్య (శ్రీసింహ) తల్లి (అను హాసన్) సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతనికి ఒక లక్ష్యం అంటూ ఏమీ ఉండదు, కోపం ఎక్కువ, ఎటువంటి భావోద్వేగం వున్నా టక్కున అనేస్తాడు, లేదా ఆ వస్తువును నేలకేసి కొడతాడు. ఎతైన ప్రదేశాలు అంటే సూర్యకి చాలా భయం. కాలేజీలో చదువుతున్నప్పుడు బైక్ నడపటం రాదనీ సీనియర్స్ గేలి చేసినప్పుడు, ఒక పాత బైక్ కొని దానికి 'ఉస్తాద్' అని పేరు పెట్టి తన జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగినా ఆ బైక్ తో చెప్పుకుంటూ ఉంటాడు. ఉస్తాద్ వల్లే తనకి మేఘన (కావ్య కళ్యాణ్ రామ్) పరిచయం అయిందని, అక్కడ నుండి తన జీవితం మారిపోయిందని అనుకుంటూ ఉంటాడు. ఇద్దరి పరిచయం, ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీస్తుంది. #UstaadReview కానీ మేఘన తండ్రి ఎటువంటి లక్ష్యం లేని సూర్యకి తన కూతురును ఇవ్వను అంటాడు. ఈలోపు సూర్య పైలట్ కావాలని అనుకుంటాడు. ఎతైన ప్రదేశాలు అంటేనే భయపడే సూర్య పైలట్ అవ్వాలన్న తన కలను ఎలా నెరవేర్చుకుంటాడు? బైక్ మెకానిక్ బ్రహ్మం (రవీంద్ర విజయ్) సూర్యకి ఎటువంటి అనుబంధం వుంది? #UstaadFilmReview సీనియర్ పైలట్ డిసౌజా పాత్ర ఏంటి? తనకున్న కోపమే తన ప్రియురాలిని దూరం చేసింది అనుకున్న సూర్య ఆమెని తిరిగి పొందగలిగాడా? ఉస్తాద్ అనే బైక్ సూర్య జీవితాన్ని ఎటు మార్చింది? ఇవన్నీ తెలియాలంటే 'ఉస్తాద్' సినిమా చూడాల్సిందే! (Ustaad film reivew)
విశ్లేషణ:
ఈ కథ పదేళ్ల క్రితం అంటే రెండు రాష్ట్రాలు విడిపోక ముందు జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సూర్య అనే యువకుడు తన తల్లితో హైదరాబాదుకు దగ్గర్లో వున్న ఒక పల్లెటూర్లో ఉంటూ ఉంటాడు. అతని జీవితంలో మూడు దశలు, కుర్రాడిగా, కాలేజీలో చేరాక ప్రేమాయణం, అలాగే ఎతైన ప్రదేశాలు అంటేనే భయపడే యువకుడు పైలట్ గా ఎలా అయ్యాడు అనే ప్రధాన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రం. #UstaadFilmReview ఒక రకంగా చెప్పాలంటే ఇది సూర్య అనే ఒక యువకుడి ప్రయాణం. తల్లి సంరక్షణలో ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరుగుతున్న సూర్య అనే యువకుడు చివరికి ఎలా ప్రయోజకుడిగా తయారయ్యాడు, అతని ప్రయాణంలో ఉస్తాద్ అనే బైక్, తల్లి, ప్రియురాలు, స్నేహితుడు, మెకానిక్, సీనియర్ పైలట్ ఇలా అందరూ అతడిని ఏ విధంగా ప్రభావితం చేశారు అన్నదే చాలా సింపుల్ కథ. పేపర్ మీద రాస్తే చదవటానికి చాలా బాగుంటుంది, కానీ తెర మీద చూపించినప్పుడే చిక్కంతా.
కథ ఆసక్తికరంగా వుంది, కానీ దర్శకుడు ఫణిదీప్ అది తెర మీద చూపించినప్పుడు బాగా సాగదీసేసాడు. కొన్ని అర్థం కావు కూడా. సినిమా కొన్ని నిముషాలు సాగినప్పుడే కథానాయకుడు పైలట్ గా కనపడతాడు కాబట్టి ప్రేక్షకులకి అర్థం అయిపోతుంది, అతను తన ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్నాడు అని. ఆలా చెప్పినప్పుడే దర్శకుడు కాసేపు ప్రస్తుత కథ, మళ్ళీ పాత కథ ఇలా మార్చి మార్చి చూపించటం ప్రేక్షకులుకి కొంచెం అసహగానే ఉంటుంది అనిపిస్తుంది. #UstaadFilmReview అలాగే ప్రథమార్ధం అంతా ఆ కాలేజీ, బైక్ సన్నివేశాలు చాలా సాగదీసాడు. ఎప్పుడైతే అతని ప్రియురాలు కథలోకి వస్తుందో కథ మళ్ళీ ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే తల్లి పాత్ర చాలా బలంగా చూపించాడు, తల్లితో వున్న సన్నివేశాలు బాగుంటాయి. #UstaadFilmReview అలాగే కథానాయకుడి ప్రయాణంలో ఒక బైక్ ఎలా ముఖ్య పాత్ర పోషించింది అన్నది ఆసక్తికరం అంశం, కానీ దర్శకుడు మరీ సాగదీసేసాడు. అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాలు కూడా సాగదీసేసాడు దర్శకుడు. మెకానిక్ బ్రహ్మం పాత్ర ఎందుకో అంత సహజంగా ఉన్నట్టు అనిపించదు. అలాగే రెండో సగంలో సూర్య, మేఘన మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా కొంచెం అసహజంగా అనిపిస్తాయి. ఇంటి మేడ మీద సూర్య, తల్లి మధ్య జరిగిన సన్నివేశం హైలైట్. అలాగే క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే, శ్రీసింహ కోడూరి తను చేసిన ముందు సినిమాల కన్నా ఈ సినిమాలో కొంచెం పరిణితి చూపించాడు, పరవాలేదు అనిపించాడు. కథానాయిక కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఆమె చక్కని నటన ప్రదర్శించడమే కాదు, అతి సునాయాసంగా చేసింది కూడా. అలాగే ఆమె అభినయం చాలా సహజంగా చక్కగా వుంది. ఆమె తన కళ్ళుతో అలాగే పేస్ తో మంచి భావాలని పలికించగల నటి. ప్రేమ సన్నివేశాల్లో చాలా బాగా చెయ్యడమే కాకుండా, అందులో ఒక ఈజ్ చూపించింది. ఆమె పాత్రని దర్శకుడు బాగా రాసాడు, ముందు ముందు మంచి పాత్రలు ఎంచుకొని ఆమె ఒక మంచి నటి (హీరోయిన్ వేరు, నటి వేరు) అయ్యే సూచనలు వున్నాయి, మంచి భవిష్యత్తు వుంది. ఈమె లాగే ఈమధ్య తెలుగు అమ్మాయిలు బాగా కనపడుతున్నారు, బాగా చేస్తున్నారు, ఇది పరిశ్రమకి ఒక మంచి శుభ పరిణామం. ఇక అను హాసన్ (AnuHaasan) తల్లిగా బాగా చేసింది. ఆమె పాత్ర కూడా దర్శకుడు చాలా బలంగా రాసాడు. ప్రతి దానికే డీలా పడేలా కాకుండా, కొడుకుని కూర్చోపెట్టి మాట్లాడే విధానం, అలాగే ఆమె చెప్పే విధానం, అభినయం చాలా సహజంగా వుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GautamVausdevMenon) తన పాత్రకి తగ్గట్టుగా సీనియర్ పైలట్ గా నటించాడు. రవి శివ తేజ, శ్రీ సింహ స్నేహితుడిగా నవ్వులు తెప్పిస్తాడు. మాటలు పరవాలేదు, సంగెతం అంతంతమాత్రమే, ఛాయాగ్రహణం బాగుంది.
చివరగా, దర్శకుడు ఫణిదీప్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్టుగా కనపడుతోంది. రాసేటప్పుడు పేపర్ మీద ఈ కథ ఆసక్తికరంగా ఉండొచ్చు, కానీ దర్శకుడు తెర మీద అంత ఆసక్తికరంగా చూపించలేకపోయారు, ముఖ్యంగా రెండో సగం, క్లైమాక్స్ లలో. #UstaadFilmReview కావ్య, అను హాసన్ నటన ఆకట్టుకుంటుంది. ఈమధ్య వచ్చిన ఆలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాలలో 'ఉస్తాద్' కూడా వుండే ఛాన్స్ ఎక్కువ వుంది.