కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Animal movie review: రణబీర్ అసమాన నటన, కానీ తండ్రి కొడుకుల అనుబంధం హింసాత్మకం

ABN, First Publish Date - 2023-12-01T11:58:03+05:30

రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ వంగతో చేసిన 'యానిమల్' సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి, ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అందరూ ఎదురు చూసారు. మరి సినిమా ఎలా వుందో చదవండి.

Animal Movie Review

సినిమా: యానిమల్

నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, పృథ్విరాజ్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబరాయ్, త్రిపాఠి దిమిత్రి తదితరులు

ఛాయాగ్రహణం: అమిత్ రాయ్

నేపధ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar)

నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా

(Bhushan Kumar, Krishan Kumar, Murad Khetani, Pranay Reddy Vanga)

దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)

విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023

నిడివి: 201 నిముషాలు

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

ఈమధ్యకాలంలో దక్షిణాదికి చెందిన దర్శకులు హిందీ చిత్రసీమలో ఒక వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిన విషయమే. కొన్ని వారాల ముందు తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో తీసిన 'జవాన్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తో 'యానిమల్' సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మునుపెన్నడూ లేనంత విధంగా ఈ సినిమాని తెలుగులో చాలా ఎక్కువగా ప్రచారం చేశారు. అందుకే ఈ సినిమాకి అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. ఒక హిందీ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో ఇంత క్రేజ్ ఉండటం ఇదే మొదటిసారి. రష్మిక మందన్న ఇందులో కథానాయకురాలు, అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు, ఎందుకంటే ఇందులో చాలా హింస ఉందని, అలాగే కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని. ఈ చిత్ర దర్శకుడు సందీప్ వంగా, లీడ్ పెయిర్ అయిన రణబీర్, రష్మికలు బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' షోకి వచ్చారు. అలాగే ఈ చిత్రం యొక్క ప్రచార వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చింది అని చెప్పడంతో ఈ సినిమా ట్రైలర్ ఎంతగా వైరల్ అయిందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా నిడివి కూడా సుమారు మూడు గంటల 23 నిముషాలు ఉంటుందని ముందుగానే చెప్పారు. అలాగే ట్రైలర్ కూడా మూడు నిముషాలకి పైగా వుంది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. (Animal movie review)

Animal story కథ:

రన్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కి తండ్రి బలబీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తండ్రి పుట్టినరోజు నాడు తండ్రికి శుభాకాంక్షలు చెప్పడానికి స్కూల్ నుండి ఇంటికి వచ్చి తండ్రి కోసం ఇల్లు, ఫ్యాక్టరీ అంతా తిరుగుతాడు కానీ, తండ్రి వ్యాపారవేత్త కావటంతో కుమారుడికి సమయం కేటాయించాలకేపోత్తాడు. అక్కడ నుండి విజయ్ జీవితం మొదలవుతుంది, ఇక కుటుంబంని తనే చూసుకోవాలని అనుకుంటాడు. అందుకే కాలేజీలో తన సిస్టర్ ని ఎవడో చెయ్యి పట్టుకున్నాడు అని తెలిసి కాలేజీకి గన్ పట్టుకెళ్లి బెదిరించి వాళ్ళందరినీ కొడతాడు. కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆపద వచ్చినా, విజయ్ ఎంతటి దూరం అయినా వెళతాడు. తండ్రి కొడుకు ప్రవర్తన చూసి వాడు పెద్ద క్రిమినల్ అని, ఎలా తయారవుతాడో అని ఇంటి నుండి వెళ్లిపొమ్మంటాడు. గీతాంజలి (రష్మిక మందన్న) అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో అమెరికాలో ఉన్న విజయ్ తండ్రి మీద ఎవరో మర్డర్ చెయ్యడానికి ప్రయత్నించారని ఇండియా వచ్చాడు? అప్పుడు విజయ్ ఏమి చేసాడు, ఎలా తండ్రిని కాపాడుకున్నాడు? బాబీ డియోల్ కి విజయ్ కి ఏంటి వైరం? తండ్రి బలబీర్ మీద ఎవరు దాడి చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘యానిమాల్’ చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు సందీప్ రెడ్డి ఇంతకు ముందు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘అర్జున్ రెడ్డి’ చేసాడు. అదే సినిమాని హిందీలో రీమేక్ చేసాడు. రెండూ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఈ ‘యానిమల్’ మూడో సినిమా, చెప్పాలంటే రెండో సినిమా, ఎందుకంటే రెండో సినిమా రీమేక్. సందీప్ తనదైన శైలి ఎంచుకున్నాడు కథలు చెప్పడానికి, అందులో హింస ఉంటుంది, కర్స్ పదాలు ఉంటాయి, అవి కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కానీ అతను ఏమి చెప్పాలనుకున్నాడో అది మొహమాటం లేకుండా చెపుతున్నాడు. అందుకే అతని సినిమాలు కుటుంబంతో చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 'యానిమల్' సినిమాలో రెండో సగంలో రష్మీక, రణబీర్ మధ్య వచ్చే సన్నివేశాలు అలాంటివి. కానీ ప్రతి పాత్రలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది సందీప్ సినిమాల్లో.

కథ తండ్రిని చంపడానికి కొందరు ప్రయత్నిస్తారు, తండ్రిని కాపాడుకోవడానికి ఎంతంనుందిని అయినా చంపడానికి, లేదా చనిపోవడానికి సిద్ధం అవుతాడు కొడుకు. సొంత బావ అని కూడా చూడడు, అతన్ని వదలడు. తండ్రి కోసం ఏదైనా చేస్తాడు. కథ అంత సింపుల్. ప్రతి సన్నివేశంలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, భయానక దృశ్యాలు ఉంటాయి, అలాగే చాలా ఆసక్తి ఉంటుంది. అది కొందరికి నచ్చదేమో, కానీ సందీప్ అలానే చెప్పాలనుకున్నాడు. క్లైమాక్స్ లో బాబీ డియోల్ ని చంపే దృశ్యం చూసి ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా మొహం పక్కకి తిప్పుకున్నారు, ఎందుకంటే అంత హింస చూడలేక. దీనికి సీక్వెల్ వుంది అని చెప్పే సన్నివేశం కూడా హింసాత్మకమే. అలాగే రణబీర్, అనిల్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా భావోద్వేగాలతో ఉంటాయి. కుటుంబం, తల్లి పడే బాధ, ఇవన్నీ బాగానే చూపిస్తాడు కానీ, హింస, శృంగారం పాళ్ళు మరీ ఎక్కువయిపోయాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే రణబీర్ మొదటి నుండి చివరి వరకు తన ప్రతిభతో మెప్పిస్తారు. చెప్పాలంటే ఇది అతని సినిమా. అతని పాత్రలో చాలా వైవిధ్యాలు ఉంటాయి, అతను అన్నిటినీ చాలా చక్కగా చేసి చూపించాడు. రణబీర్ అంటే ఒక చాకలేట్ బాయ్ అనుకున్నవాళ్లను అందరూ ఈ సినిమా చూసి ఏంటి ఇతను ఇంత వైలెంట్ గా ఉంటాడా అని కూడా అనుకుంటారు. ఇక అనిల్ కపూర్ పాత్ర కూడా చాలా బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. అతను అనుభవం గల నటుడు కాబట్టి గొప్ప నటన ప్రదర్శించారు. రష్మిక మందన్న గీతాంజలి పాత్రలో ఒదిగిపోయింది. చాలా బాగా చేసింది, రెండో సగంలో రణబీర్ వేరే అమ్మాయితో వున్నాడు అని చెప్పినప్పుడు వచ్చే సన్నివేశంలో చాలా అభినయం చూపించింది. ఆమెకి ఇది ఒక మంచి పాత్ర అని చెప్పొచ్చు. ఇక బాబీ డియోల్ రెండో సగంలో వస్తాడు, అతను బాగున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో పోరాట సన్నివేశం అదిరింది. త్రిప్తి దిమిరి రెండో సగంలో వస్తుంది, చాలా క్యూట్ గా వుంది, గ్లామర్ గా వుంది. సీనియర్ నటులు శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ వారి పాత్రల పరిధి మేరకి చేశారు. ఇంకా చాలామంది నటులు కనిపిస్తారు, అందరూ బాగా సపోర్ట్ చేశారు.

చివరగా, 'యానిమల్' సినిమా తండ్రి కొడుకుల మధ్య వున్న అనుబంధం, భావోద్వేగాల మధ్య నడుమ సాగె ఒక కథ. కానీ దర్శకుడు సందీప్ ఈ కథని చాలా హింసాత్మకంగా, కర్స్ పదాలతో కొంచెం సాగదీసినట్టుగా చెప్పాడు. రణబీర్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచాడు అలాగే రష్మిక మందన్న కూడా. రణబీర్ అభిమానులకి ఈ సినిమా నచ్చే అవకాశం వుంది, కుటుంబంతో చూడటంలో కొంచెం ఇబ్బంది పడతారు.

Updated Date - 2023-12-01T11:58:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!