కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Peddha Kapu 1 film review: శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా ఫెయిల్, నటుడిగా సూపర్

ABN, First Publish Date - 2023-09-29T13:05:01+05:30

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి జానర్ మార్చాడు, యాక్షన్ డ్రామా 'పెదకాపు 1' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ద్వారా విరాట్ కర్ణ అనే కొత్త అబ్బాయిని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు, అలాగే చాలామంది కొత్త కళాకారులను కూడా చూపిస్తున్నాడు. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Peddha Kapu 1 film review

సినిమా: పెద కాపు -1

నటీనటులు: విరాట్ కర్ణ (ViratKarrna), ప్రగతి శ్రీవాత్సవ (PragathiSrivastava), బ్రిగిడ (Brigida), రావు రమేష్ (RaoRamesh), తనికెళ్ళ భరణి, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, నాగబాబు, ఆదుకలం నరేన్ (Aadukalam Naren), అనసూయ తదితరులు

సంగీతం: మిక్కీ జె మేయర్

ఛాయాగ్రహణం: చోటా కె నాయుడు (Chota K Naidu)

నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy)

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే అతను ఇంతకు ముందు తీసిన సినిమాలు, అతని రచన చాలా బలంగా ఉండటమే కాకుండా, చాలా సన్నివేశాలు, పాత్రలు నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి. అందుకనే అతని సినిమాల కథలు మన చుట్టుపక్కల అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈసారి అతను 'పెదకాపు-1' #PeddhaKapu1Review అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు అతను తీసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఈసారి శ్రీకాంత్ ఒక యాక్షన్ డ్రామాతో వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా వుండి, ఈ సినిమా మీద అంచనాలు పెంచింది. #PeddhaKapu1FilmReview మిర్యాల రవీందర్ రెడ్డి దీనికి నిర్మాత, అతని బావమరిది విరాట్ కర్ణ (ViratKarrna) ఈ సినిమాతో కథానాయకుడిగా, అలాగే చాలామంది కొత్త నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాత్సవ (PragatiSrivastava) కథానాయకురాలి కాగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

Peddha Kapu -1 కథ:

సినిమా మొదలవడం 1962 సంవత్సరంలో గోదావరి ప్రాంతంలో వున్న ఒక గ్రామంలో గొడవల వలన అందరూ వలస వెళ్ళిపోతారు. 20 ఏళ్ల తరువాత అంటే 1982 ప్రాంతంలో కూడా ఆ గ్రామంలో మార్పు రాదు, భూస్వాములదే పైచేయి అవుతుంది, కుల రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సత్య రంగయ్య (రావు రమేష్) ఆ వూరికి ఒక మోతుబరి, ఎదురులేకుండా చాలామంది ఊరి ప్రజలని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అతనికి వ్యతిరేకంగా బయ్యన్న (ఆదుకలం నరేన్) అతని దగ్గర కొంతమంది వుండి, ఈ ఇద్దరూ ఆ ఊరి ప్రజలను తమ రాజకీయ, పలుకుబడి కోసం వాడుకుంటూ వుంటారు. #PeddhaKapu1Review అదే వూరిలో వున్నయువకుడు పెదకాపు (విరాట్ కర్ణ) తాము ఊరి చివర ఉంటే తక్కువ వాళ్ళం కాదని, తమకు అన్నిటిలో హక్కులు ఉన్నాయని, ఈ ఇద్దరికీ ఎదురు తిరుగుతాడు. అదే సమయంలో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి యువకులకు, సామాన్యులకు ప్రోత్సహించాలని అనుకుంటారు. ఇటువంటి సమయంలో సామాన్యుడు అయిన పెదకాపు ఆ ఇద్దరి భూస్వాములను ఎదిరించి ఆ ఊరి ప్రజల మన్ననలు ఎలా పొందగలిగాడు? అక్కమ్మ ఎవరు? ఆమె ఎందుకు సత్య రంగయ్య ఇంట్లో వుంది? ఇవన్నీ తెలియాలంటే 'పెదకాపు -1' సినిమా చూడాల్సిందే. (Peddha Kapu -1 film review)

విశ్లేషణ:

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి ఒక మంచి పేరుంది, అతను ఏ సినిమా చేసిన అందులో ఒక సామజిక భాద్యత ఉంటుంది అని, అలాగే క్లీన్ సినిమాలు తీస్తాడని. అలాగే అతని సినిమాలో సహజత్వం కూడా ఉంటుంది. అతను తన జానర్ మార్చి ఇప్పుడు యాక్షన్ డ్రామాతో ఈ 'పెదకాపు 1' సినిమా చేసాడు. ఇందులో అతను ఏమి చెప్పాలని అనుకున్నాడో అది ప్రేక్షకులకి చెప్పలేకపోయాడు. శ్రీకాంత్ 1982లో గోదావరి ప్రాంతంలో జరిగిన ఓ కథని తీసుకున్నాడు, అంతవరకు బాగానే వుంది. సమాజంలో రాజాకీయాలు కులం, మతం, పరపతి వీటి ఆధిపత్యం ఎక్కువ, ఇది ఇప్పటిమాట కాదు, ఎప్పటి నుండో వుంది. అది చెప్పాలని అనుకున్నాడు శ్రీకాంత్, కానీ అది సరిగ్గా చూపించడానికి అతనికి కొన్ని అడ్డంకులు వచ్చాయేమో. ఎందుకంటే సినిమాలో 'మీరు', 'మేము' అంటూ వుంటారు, అంటే ఎవరు, వాళ్ళు అగ్ర కులస్థులా? మీరు అంటే వీరు తక్కువ కులం వారా? ఇవి క్లారిటీగా చెప్పలేకపోయాడు. #PeddhaKapu1Review

పెదకాపు అని గ్రామంలో ఎవరిని అంటారు అంటే, ప్రజలు సహాయం కోసం, సమస్య పరిష్కారం కోసం, తగవులు పడినప్పుడు తీర్పు కోసం, గ్రామంలో మంచి చెడు ఏదైనా ఉంటే ఎవరిని సంప్రదిస్తారో అతన్ని పెదకాపు అని అంటారు. ఆ విషయం దర్శకుడు శ్రీకాంత్ చాలా సార్లు ఉటంకించాడు కూడా తన ప్రచారాల్లో. కానీ సినిమాలో ఆ యువకుడిని మొదటినుండి పెదకాపు అని పిలుస్తూ వుంటారు. అది ఎవరికీ అర్థం కాదు, ఎందుకు ఆలా పిలిచారో. సత్య రంగయ్య గా వేసిన రావు రమేష్ పెదకాపు అవ్వాలి, అతన్ని ఎదిరించి పోరాడి చివరికి అతనిమీద విజయం సాధించిన ఆ యువకుడు చివరికి పెదకాపు అవ్వాలి. కానీ శ్రీకాంత్ ఏమి ఆలోచించాడో మరి, అది కూడా సరిగ్గా చూపించలేకపోయాడు, ఎందుకు అతన్ని మొదటి నుండీ పెదకాపు అని పిలుస్తున్నారు అన్న విషయం చెప్పాలి. చివర్లో అయినా అతనే పెదకాపు అని చెప్పితే కొంత స్పష్టత ఉండేది.

సత్య రంగయ్య, బయ్యన్న మనుషులు మధ్య చిన్న గొడవలు, వూర్లో ప్రజలు గుమికూడటం, పెదకాపు ఎదిరించటం, సినిమా ఎంతసేపు వీటిచుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాగబాబు పాత్ర కూడా క్లియర్ గా లేదు. అతను ఎవరికీ మంచి చెయ్యాలనుకున్నాడు, రామారావు పార్టీ పెడితే అతని తరపున నాగబాబు వచ్చాడా, అసలు అతను ఎవరు. మధ్యలో రామారావు గారు మాట్లాడతారు అని అతని తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు చూపించిన శ్రీకాంత్, అదే నాగబాబు రావు రమేష్ ని, ఆదుకలం నరేన్ ని ఇద్దరినీ కలవమంటాడు. మరి ఇద్దరూ ఆ వారి ప్రజలకి మంచి చెయ్యని వాళ్ళు కదా, వాళ్ళతో ఎలా కలుస్తాడు, ఇంకో పక్క యువకుడైన పెదకాపు ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇవన్నీ నాగబాబు ఎందుకు చేస్తున్నాడు, అతని ఎవరి తరపున వచ్చాడు, మాట్లాడుతున్నాడు అన్న విషయం శ్రీకాంత్ అడ్డాల చెప్పలేకపోయాడు. అసలు ఈ సినిమా ద్వారా ఏమి చెప్పాలని అనుకున్నాడో అది ఒక్క పిసరు కూడా ప్రేక్షకులకు అర్థం కాదు. రెండు అగ్ర సామజిక వర్గాల మధ్య కాపు సామజిక వర్గం పైకి రాలేకపోయింది అని చెప్పాలని అనుకున్నాడా, అంటే అదీ తెలియదు. ఎందుకంటే ఎంతసేపు మీరు, మేము అంటూ వుంటారు కానీ ఒక వర్గము పేరో, కులం పేరో ఏమీ చెప్పలేదు.

పైగా ఇటువంటి సినిమాలు ఇప్పుడు కాదు 80లో కూడా చాలా వచ్చాయి. 'మనవూరి పాండవులు' కూడా ఇదే తరహాలో ఉంటుంది, దాన్నే కొంచెం అటుఇటు మార్చి ఉంటాడేమో అనిపిస్తుంది. అంతెందుకు 'రంగస్థలం' సినిమా కూడా ఇలానే ఉంటుంది ఇంచుమించు, పాత దర్శకుడు టి కృష్ణ సినిమాలు అన్నీ కూడా కొంచెం ఇదే తరహాలో ఉంటాయి, అయితే ఆ సినిమాలన్నిటిలో ఒక క్లారిటీ వుంది, ఎవరు ఏమిటి, ఎవరిని ఎవరు అణగతొక్కుతున్నారు అనే విషయం. కానీ శ్రీకాంత్ అడ్డాల తన సినిమాతో ఏమి చెప్పాలని అనుకున్నాడో, అతని మైండ్ లో ఏముందో, అవన్నీ తెరమీద చూపించలేకపోయాడు అనిపిస్తుంది. తనికెళ్ళ భరణి పాత్ర కూడా అంత క్లియర్ గా లేదు. అన్ని పాత్రలని ఆలా ఒకసారి ఫోకస్ పెట్టి వదిలేసాడు శ్రీకాంత్, కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఏంటి అన్నది చూపించలేకపోయాడు.

అసలు సినిమా ఇంటర్వెల్ కి అయిపొయింది. ఎప్పుడైతే పెదకాపు, రావు రమేష్ తల నరికేస్తాడో అప్పుడే సినిమా అయిపోయినట్టే. ఎందుకంటే ఆ ఊరి భూస్వామి, పవర్ ఫుల్ సత్య రంగయ్య ఎప్పుడైతే పోయాడో ఇక కథ ఏముంటుంది. అంతవరకు కుర్చీలో కేవలం కూర్చొని మాత్రమే వుండి, తల కూడా తిప్పలేని సత్య రంగయ్య కొడుకు (శ్రీకాంత్ అడ్డాల) ఆలా ఎలా సడెన్ గా మారిపోయి, మాట్లాడుతూ, మనుషులని సైతం చంపేస్తాడు (కుర్చీలో కూర్చొనే). ఆత్మ గౌరవం అనే పదం ఎన్టీఆర్ తెలుగువాళ్ళకు ఇచ్చింది, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనేది అప్పటి నుండి మొదలయింది. మరి ఇందులో ఆత్మగౌరవం అంటే ఎవరికి? అది సరిగ్గా చెప్పలేకపోయాడు. అక్కమ్మ పాత్ర కథ సాగదీతకి మాత్రమే ఉపయోగించాడు శ్రీకాంత్. అది కూడా మొదట్లో చూపించేస్తే, ఇంటర్వెల్ కి సినిమా అయిపోయినట్టే. దీనికి ఇంకా రెండో పార్టు కూడానా? అందులో అయినా చెప్పాలని అనుకున్నది చెప్పగలడా శ్రీకాంత్? వేచి చూడాలి మరి. ఒక్కటి మాత్రం బాగుంది, సినిమాలో ఏంటంటే గ్రామా వాతావరణం సహజత్వంగా వుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం క్రెడిట్ విరాట్ కర్ణ అనే చెప్పాలి. అతను కొత్తవాడు, కానీ అత్యద్భుతంగా చేసాడు. సినిమా మొదటి నుండి చివరి వరకు తన అభినయంలోకాని, భాషలోకాని, అహభావాలు కానీ, ఎక్కడా కొత్తవాడు అని కాకుండా ఎన్నో సినిమాలు చేసిన అనుభవశాలిగా చాలా బాగా చేసాడు. చెప్పాలంటే ఈ సినిమా అతనికోసమే తీసినట్టుగా అంత బాగా అభినయించాడు. నటుడిగా ముందు ముందు ఎంతో ఎదుగుతాడు అనిపిస్తోంది. మొదటి సినిమాలో ఇంత అద్భుత నటన కనపరిచిన నటుడు ఈమధ్యకాలంలో ఒక్క విరాట్ అనిపిస్తుంది. అంత బాగా చేసాడు. ఇక ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయకురాలిగా బాగుంది కానీ, ఆమె పాత్ర ఇంకా బలంగా ఉంటే బాగుండేది. అక్కమ్మ తన తల్లి అని తెలిసాక, మామూలుగా ఉంటుంది ఆమె, ఎటువంటి భావాలు లేకుండా. దర్శకుడు ఆ సన్నివేశాలు ఇంకా బలంగా రాసి ఉంటే బాగుండేది.

ఇక రావు రమేష్ అద్భుతమైన నటుడు, వైవిధ్ద్యం చూపించగల ఒక గొప్ప నటుడు, అలాంటి నటుడికి డైలాగ్స్ లేకపోవటం ఏంటి? ఇది చాలా పెద్ద తప్పిదం అని అనుకుంటాను. ఎందుకంటే రావు రమేష్ సినిమాలో వున్నాడు అంటే అతని డైలాగ్స్ వినటానికి ప్రేక్షకులు వెళతారు, ఆస్వాదిస్తారు, అలాంటిది అతనికి ఒక్క డైలాగ్ కూడా పెట్టకపోవడం, సినిమాకి పెద్ద మైనస్. ఈరోజుకి అతని డైలాగ్స్ మాత్రమే ఎక్కువగా మీమ్స్ లో వాడతారు, అటువంటిది అతన్ని డమ్మి చేసేసాడు శ్రీకాంత్. ఇక అనసూయ (Anasuya) పాత్ర రెండో సగంలో వస్తుంది, కేవలం సినిమా కథని సాగదీయడానికి ఆమెని రెండో సగంలో పెట్టాడు అనిపిస్తుంది. బ్రిగడ (BrigidaSaga) అనే అమ్మాయి బాగా చేసింది, ఆమె పాత్రకి సూట్ అయింది. ఇక చాలామంది కొత్తవాళ్లు, వస్తూ వుంటారు, డైలాగ్స్ చెపుతూ వుంటారు, వెళ్ళిపోతూ వుంటారు. ప్రవీణ్ పాత్ర పెద్దగా ఉంటుంది, అతను బాగున్నాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల (SrikanthAddala) కూడా నటుడిగా బాగా రాణించాడు, బాగా చేసాడు. ఆదుకలం నరేన్ (AadukulamNaren) బయ్యన్నగా చేసాడు. తనికెళ్ళ భరణి పాత్ర బలంగా లేదు, అలాగే నాగబాబు పాత్ర కూడా. మిక్కీ జె మేయర్ నేపధ్య సంగీతం బాగుంది, చోటా కె నాయుడు ఛాయాగ్రహణం సినిమాకి హైలైట్. అలాగే సన్నివేశాల్లో సహజత్వం కనపడుతూ ఉంటుంది.

చివరగా, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు 1' సినిమాతో ఏమి చెప్పాలనుకున్నాడో అది చెప్పలేకపోయాడు. అన్నీ సగం సగం చెప్పి వదిలేస్తారు అంటారు, అలాగే ఈ సినిమాలో అన్ని పాత్రలను అలాగే చూపించాడు. సినిమా చూసాక ప్రేక్షకుడు గందరగోళంలో పడిపోతాడు, ఏమి చెప్పాడు ఈ సినిమాతో అని. దర్శకుడిగా శ్రీకాంత్ ఫెయిల్ అయ్యాడు, కానీ నటుడిగా రాణించాడు.

Updated Date - 2023-09-29T13:05:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!