కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Skanda film review: బోయపాటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటారో ఇది కూడా అలానే ఉంటుంది

ABN, First Publish Date - 2023-09-28T13:37:29+05:30

బోయపాటి సినిమా 'స్కంద' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, సయీ మంజ్రేకర్ కూడా వున్నారు, థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Skanda film review

సినిమా: స్కంద

నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, అజయ్ పుర్కర్, శరత్ లోహితాశ్వ (Sharath Lohitashwa), ప్రిన్స్, కాలకేయ ప్రభాకర్ తదితరులు

ఛాయాగ్రహణం: సంతోష్ డిటాకే

సంగీతం: ఎస్ థమన్

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి (SrinivasaaChitturi)

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను (BoyapatiSreenu)

-- సురేష్ కవిరాయని

బోయపాటి శ్రీను సినిమా అనగానే అందరికీ ఒకవిధమైన ఆలోచన ఉంటుంది, ఎందుకంటే అతని సినిమాలు ఎక్కువగా యాక్షన్ డ్రామాలుగా తెరకెక్కుతాయి. ఇంతకు ముందు 'అఖండ' సినిమాతో పెద్ద విజయం సాధించి, ఇప్పుడు రామ్ పోతినేనితో (RamPothineni) చేతులు కలిపి 'స్కంద' #SkandaMovieReview సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బోయపాటి. ఇందులో శ్రీలీల (Sreeleela), సయీ (SaieeManjrekar) మంజ్రేకర్ ఇద్దరి కథానాయికలు వున్నారు, థమన్ (SSThaman) సంగీతం అందించాడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Skanda story కథ:

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కర్) తన కూతురు వివాహం ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తాడు, దేశంలో వున్న చాలామంది రాజకీయనాయకులు, గవర్నర్, ఇతర సెలబ్రిటీస్ హాజరువుతూ వుంటారు. పెళ్లి ముహూర్తం ఇంకా కొంచెం సమయం వుంది అనగా తెలంగాణ ముఖ్యమంత్రి (శరత్ లోహితాశ్వ) కుమారుడు, పెళ్లికూతురిని తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్లి ఆగిన విషయం బయటకి తెలిస్తే,అవమానంలా భావించిన ఆంధ్ర ముఖ్యమంత్రి తన మేనమామని చంపేసి, గుండెపోటుతో మరణించాడు అందుకని పెళ్లి ఆగిపోయింది, అందరూ వెళ్లిపోవాల్సిందిగా చెప్తాడు. #SkandaFilmReview అప్పటి నుండి ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తన కుమారుడి నిశ్చితార్ధం చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తాడు. అది చూసిన ఆంధ్ర ముఖ్యమంత్రి తన కూతురిని మళ్ళీ తన ఇంటికి తీసుకు రావాలని ఒక కుర్రాడుని (రామ్ పోతినేని) నియమిస్తాడు. ఆ కుర్రాడు ఆ నిశ్చితార్ధం ఫంక్షన్ కి వెళ్లి ఇద్దరి ముఖ్యమంత్రుల కుమార్తెలను తాను తీసుకుపోతున్నాను అని ఇద్దరినీ తనతో పాటు రుద్రరాజపురం అనే వూరికి తీసుకుపోతాడు. ఇంతకీ రామ్ ఎవరు? అతను ఎందుకు ఆ ఇద్దరినీ తీసుకుపోయాడు? ఇద్దరు ముఖ్యుమంత్రులకి, రామ్ కి వున్న సంబంధం ఏంటి? జైలు లో వున్న రామకృష్ణ రాజు (శ్రీకాంత్) కి ఉరిశిక్ష ఎందుకు పడింది? అతనికి ఈ మొత్తం కథకి ఎటువంటి సంబంధం వుంది అన్నదే మిగతా కథ. (Skanda movie review)

విశ్లేషణ:

దర్శకుడు బోయపాటి శ్రీను వ్యాపార విలువలతో కూడిన సినిమాలు బాగా చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. మధ్యలో అక్కడక్కడా కొన్ని కుటుంబానికి సంబందించిన సన్నివేశాలు ఉన్నప్పటికీ, అతను తన సినిమాలన్నీ మాస్ తరహాలో తీస్తాడు. అంటే ముందు కుర్చీలలో కూర్చున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి అతని సినిమాలు. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే అతను ఎక్కడా కూడా హింస చూపించటంలో మాత్రం తగ్గడు. #SkandaFilmReview ప్రతి సినిమాకి అది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ 'స్కంద' లో కూడా అటువంటి హింసతో కూడిన పోరాట సన్నివేశాలను చూడవచ్చు. అయితే ఆ పోరాట సన్నివేశాలకు కూడా ఒక ఆది, అంతం ఉండదు, ఒకసారి మొదలైతే కథానాయకుడు కొట్టుకుంటూ వెళుతూనే ఉంటాడు.

ఈ సినిమాలో అయితే రామ్ పోతినేని ఒక్కడే సుమారు కొన్ని వందల మందిని కొట్టి ఉంటాడు. అలాగే బోయపాటి సినిమాల్లో వుండే విధంగా ఈ సినిమాలో కూడా చాలామంది నటులు కనపడతారు. వాళ్లకి డబ్బింగ్ కూడా చాలా లౌడ్ గా ఉంటుంది. అరుచుకున్నట్టుగా మాట్లాడుతూ వుంటారు, ఇలాంటివి మనం బోయపాటి సినిమాల్లోనే చూస్తాం. ఇక ఈ సినిమాలో బోయపాటికి, సంగీత దర్శకుడు థమన్ బాగా కుదిరాడు. ఎందుకంటే ఆ హింసాత్మక పోరాట సన్నివేశాలకి థమన్ నేపధ్యం బాగా సరిపోతుంది. ఇక ఒకటే కొట్టుడు సినిమా అంతా. రెండో సగంలో కొంచెం కుటుంబం, తల్లిదండ్రులని వదిలి పిల్లలు విదేశాలకి వెళ్ళిపోవటం గొప్పగా చెప్పుకుంటే, తల్లిదండ్రుల కోసం తాను స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో మొదటి తరగతిలో పాసయినా, ఫెయిల్ అయ్యాను అని చెప్పి రామ్ తన వూరిలో తల్లిదండ్రుల కోసం ఉండిపోవటం బాగుంది. మిగతాది అంతా కూడా సినిమాటిక్ సన్నివేశాలే.

ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి పోలీసు, మిలిటరీ, కమాండోస్, ఇంటెలిజెన్స్ ఒకటేంటి వందల సెక్యూరిటీ వాళ్ళను నరుక్కుంటూ, చంపుకుంటూ, తన్నుకుంటూ ఒంటిమీద ఎటువంటి గాయం తగలకుండా రామ్ పోరాడి ముఖ్యమంత్రి కూతురిని ఎత్తుకుపోతాడు. ఇలాంటివి కూడా బోయపాటి సినిమాలో చూస్తాం. ఇక రామ్ ని ఒక మాస్ నటుడిగా బోయపాటి ఈ సినిమాతో బాగా చూపించాడు. ఇన్ని చెప్పాక సినిమా బాగుందా, బాగోలేదా అని మాత్రం అడగొద్దు. #SkandaFilmReview ఎందుకంటే ఇది ఒక మాస్ సినిమా, అందుకని మాస్, యాక్షన్ నచ్చే ప్రేక్షకులను మాత్రమే ఇది అని చెప్పొచ్చు. పాటలు మామూలుగా వున్నాయి, ఒక్కోసారి నేపధ్య సంగీతం చాలా లౌడ్ గా ఉంటుంది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది అని చివర్లో చెప్పారు. అంటే 'స్కంద 2' ఉంటుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే, 'ఇస్మార్ట్ శంకర్' #iSmartShankar తరువాత రామ్ ఒక మాస్ యాక్టర్ గా ఇందులో కూడా కనపడతాడు. అయితే అందులో కన్నా ఇంకా ఎక్కువ ఈ 'స్కంద' లో చూడొచ్చు. రామ్ అంటేనే ఒక ఎనర్జీ, ఇందులో చాలా లైవ్ లీ గా ఉంటాడు. చాలా బరువు కూడా పెరిగాడు ఈ పాత్ర కోసం. అతను చాలా సేపు యాక్షన్ సన్నివేశాల్లోనే ఉంటాడు. డాన్సులు, పోరాట సన్నివేశాలు బాగా చేసాడు, చూపించారు కూడా. ఇక శ్రీలీల, సాయి మంజ్రేకర్ లు ఇద్దరూ కేవలం కొన్ని సన్నివేశాల కోసం మాత్రమే కనపడతారు, శ్రీలీల కి పాటలు వున్నాయి, అంతే. దగ్గుబాటి రాజా చాలా కాలం తరువాత కనపడతాడు బాగున్నాడు. అలాగే గౌతమి, ఇంద్రజ, శ్రీకాంత్ వీళ్ళందరూ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ఇక ముఖ్యమంత్రులుగా అజయ్ పుర్కర్, శరత్ లోహితాశ్వ లు చేశారు, వాళ్ళ మొహాలు తప్పితే వాటిలో ఎటువంటి భావోద్వేగాలు వుండవు. డబ్బింగ్ ఎవరో వెనకాల గట్టిగా లౌడ్ స్పీకర్ లో అరిచినట్టుగా చెప్తారు. కాలకేయ ప్రభాకర్, ప్రిన్స్, పృథ్వి కూడా వున్నారు.

చివరగా, 'స్కంద' దర్శకుడు బోయపాటి శ్రీను మార్కు సినిమా, ఎక్కువ భాగం యాక్షన్, కొట్టుకోవటం, నరుక్కోవటం తోటే సరిపోతుంది. చాలామంది నటీనటులు కనిపిస్తూ వుంటారు. ఇదొక మాస్ సినిమా, అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది. 'బి' 'సి' సెంటర్ ప్రేక్షకులకి నచ్చే అంశాలు వున్నాయి.

Updated Date - 2023-09-28T13:37:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!