Puli Meka web series Review: ఆసక్తికరంగా వున్న పులి మేక ఆట
ABN, First Publish Date - 2023-02-28T15:23:58+05:30
పాపులర్ ఫిల్మ్ రచయిత కోన వెంకట్ (#KonaVenkat) ఈసారి ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దానిపేరు 'పులి మేక', (#PuliMekaReview) ఇది జీ5 (#Zee5) ఓ.టి.టి. లో విడుదల అయింది.
Puli Meka web series Review: ఆసక్తికరంగా వున్న పులి మేక ఆట
వెబ్ సిరీస్: పులి మేక
నటీనటులు: లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్, సిరి హన్మంత్, రాజా, సాయి శ్రీనివాస్, గోపరాజు రమణ తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణం: రామ్ కె మహేష్
రచన, కాన్సెప్ట్: కోన వెంకట్
దర్శకత్వం: చక్రవర్తి రెడ్డి
నిర్మాతలు: కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5
విడుదల: జీ 5
--- సురేష్ కవిరాయని
పాపులర్ ఫిల్మ్ రచయిత కోన వెంకట్ (#KonaVenkat) ఈసారి ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దానిపేరు 'పులి మేక', (#PuliMekaReview) ఇది జీ5 (#Zee5) ఓ.టి.టి. లో విడుదల అయింది. అయితే ఈ వెబ్ సిరీస్ కి కోన వెంకట్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు వెండి తెర మీద కనిపించే నటీనటులు వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, అది చాలా మంచి పరిణామం. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి (#LavanyaTripathi), ఆది సాయి కుమార్ (#AadiSaikumar) ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించగా, సీనియర్ నటుడు సుమన్ (#Suman) ఇంకొక ముఖ్యమయిన పాత్ర పోషించారు. అలాగే రాజా, సిరి హన్మంతు (#SiriHanmanthu) కూడా ఇందులో వున్నారు. ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇంతకీ ఈ సిరీస్ ఎలా వుందో చూద్దాం.
Puli Meka story కథ:
హైదరాబాద్ నగరం లో పోలీస్ ఆఫీసర్స్ ఒకరు తరువాత ఒకరు వరసగా హత్య చెయ్యబడుతూ వుంటారు. జంతువులా కనపడే ఒక సీరియల్ కిల్లర్ వీళ్లందరినీ చంపుతూ ఉంటాడు అని ప్రజలకు అర్థం అవుతూ ఉంటుంది. పోలీస్ కమిషనర్ (సుమన్) ఈ సీరియల్ కిల్లర్ గురించి మీడియా లో వార్తలు రాకముందే పట్టుకోవాలన్న తలంపుతో వెంటనే వేరే దగ్గర పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) ని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసి ఈ కిల్లర్ ని పట్టుకోమని ఆదేశిస్తాడు. ఆమెని ఒక టీంని తయారుచేసుకోమని కూడా చెప్తాడు. ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రభాకర్ శర్మ (ఆది సాయి కుమార్) ఈ వరస హత్యలు ఎక్కడ జరుగుతున్నయో ఆ ప్లేస్, అలాగే ఆ చనిపోయిన శవం నుంచి విలువయిన సమాచారం సేకరించి ఈ పోలీస్ టీమ్ కి సాయపడుతూ ఉంటాడు. ప్రభాకర్ శర్మ నాన్నగారు జ్యోతిష్యం చెపుతూ చాలామంది పెద్దవాళ్లకు పరిచయం ఉంటాడు. ఇంతకీ కిరణ్ ప్రభ కిల్లర్ ని పట్టుకుందా? ఎలా పట్టుకుంది? ఎందుకు ఆ సీరియల్ కిల్లర్ పోలీస్ వల్లనే టార్గెట్ చేసాడు? పల్లవి (సిరి) అనే ఆమె ఎవరు, ఎందుకు చచ్చిపోయింది? కరుణాకర్ శర్మ (రాజా) ఎవరు, అతని పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
కోన వెంకట్ సినిమా పరిశ్రమలో మంచి పేరున్న రచయిత, ఎన్నో సినిమాలకి కథలు, మాటలు రాసాడు. అయితే ఇప్పుడు 'పులి మేక' అనే వెబ్ సిరీస్ తో ఓ.టి.టి. లో కూడా తన ప్రావీణ్యం చూపించాలి అనుకున్నాడు. సినిమా అంటే కేవలం రెండున్నర గంటలు అలాగే అందులో కొన్ని పరిమితులు కూడా ఉంటాయి, కానీ వెబ్ సిరీస్ కి అన్ని పరిమితులు అవసరం లేదు. అందుకే ఇందులో తనకు నచ్చినట్టుగా, కొంచెం లోతుగా ఏదైనా చూపించవచ్చు. 'పులి మేక' అనేది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్. సినిమాలో అంటే ప్రేక్షకులను రెండున్నర గంటలు మంత్రముగ్దులను చెయ్యాలి, కానీ వెబ్ సిరీస్ ఆలా కాదు. ప్రతి ఎపిసోడ్ కి ఒక చిన్న సస్పెన్స్ ఉండాలి, ట్విస్ట్ కావాలి, చూసే ప్రేక్షకుడు టీవీ ముందు నుండి వెళ్లిపోకుండా ఉండాలనే అందులో కొంచెం మసాలా పెట్టాలి. కోన వెంకట్ ఇవన్నీ ఇందులో బాగానే పెట్టి ఆసక్తికరంగా చూపాడనే చెప్పాలి.
ఇది మొదలవడం కూడా హైదరాబాద్ నగరం లో పోలీస్ అధికారులు హత్యలతో మొదలెట్టాడు, అలాగే కిరణ్ ప్రభ ఎంత ప్రతిభ కల ఆఫీసర్ అని చెప్పడానికి ఆమెవి ఒక రెండు పోరాట సన్నివేశాలు చూపించాడు, అది కూడా బాగుంది. అవి లావణ్య త్రిపాఠి కి కూడా పనికొచ్చేట్టుగా వున్నాయి. కానీ ప్రభాకర్ శర్మ కుటుంబం, కిరణ్ ప్రభ కుటుంబ సన్నివేశాలే కొంచెం బోర్ గా వున్నాయనిపించింది. మొత్తం మీద కోన వెంకట్ చాలా సఫలీకృతుడు అయినట్టే అని చెప్పాలి, ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ లో చాలా ట్విస్ట్స్ వున్నాయి, టర్నింగ్ పాయింట్స్ వున్నాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను ముందే ఊహించినా కూడా, ఆద్యంతం వెబ్ సిరీస్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఒక మంచి పాయింట్ తీసుకొని దాని చుట్టూ కథ కోన బాగా అల్లాడు, అలాగే దర్శకుడు చక్రవర్తి కూడా ప్రతి ఎపిసోడ్ చివర్లో చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ ని బాగా ఇచ్చుకుంటూ చివరి ఎపిసోడ్ చూసే వరకు చేయించాడు. (#PuliMekaReview)
మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ కొంచెం స్లోగా వెళుతూ ఉంటాయి. కిరణ్ ప్రభ హైదరాబాద్ బదిలీ అయి ఈ హత్యల కేసు తీసుకోగానే కథ కొంచెం వేగం పుంజుకుంటుంది అనుకుంటాం కానీ, మధ్యలో ఈ జ్యోతిష్యం, జాతకాలు, కుటుంబ సన్నివేశాలు కొంచెం సాగదీతలా కనిపిస్తాయి, అందులో లాజిక్ కూడా కనిపించదు. ఒక సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ చెప్పాలి అనుకున్నప్పుడు మధ్యలో కామెడీ అనుకొని పెట్టిన ఈ సన్నివేశాలే చికాకుగా ఉంటాయి. ఎందుకంటే దర్శకుడు అది కామెడీ అనుకొని పెట్టాడేమో కానీ, దానివల్ల చూసే ప్రేక్షకుడికి నవ్వు రాదు కానీ చికాకు వస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్స్ లో ఇలా సాగదీత సన్నివేశాలుంటే, చివరి నాలుగు ఎపిసోడ్స్ లో ప్రేక్షకుడికి కావలసిన ఆసక్తికరమయిన సన్నివేశాలు వున్నాయి. ఇక్కడే కోన, అతని టీమ్ విజయం సాధించారనే చెప్పాలి. వెబ్ సిరీస్ అనగానే దీనికి పరిమితులు లేవని ముందే అనుకున్నాం కదా, ఆలా అని కోన వెంకట్ అతని టీమ్ అందరూ చూసే విధంగానే ఈ వెబ్ సిరీస్ తీర్చి దిద్దారు, ఇందులో అసభ్యకర సన్నివేశాలు లేవు. అలాగే లావణ్య త్రిపాఠి ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యమయిన పాత్ర, ఆమె పేరు కూడా ముందు వెయ్యటం కూడా బాగుంది. (#PuliMekaWebSeries)
ఇంకా నటీనటుల విషయానికి వస్తే, ఈ వెబ్ సిరీస్ అంతా లావణ్య త్రిపాఠి దే అనే చెప్పవచ్చు. వెండి తెర మీద అందంగా కనపడే లావణ్య, ఈ వెబ్ సిరీస్ లో తాను పోరాట సన్నివేశాలను కూడా బాగా చెయ్యగలను అని నిరూపించింది. అదొక్కటే కాకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా కనపడటానికి లావణ్య బాగానే హోమ్ వర్క్ చేసిందని కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆమె వెండితెర మీదే కాదు, ఈ బుల్లి తెర మీద కూడా అందంగానే కనపడింది. ఆది సాయికుమార్ ఫోరెన్సిక్ హెడ్ ప్రభాకర్ శర్మ గా బాగా చేసాడు. సినిమాల పాత్రలతో పోలిస్తే ఇది కొంచెం వైవిధ్యంగా ఉంటుంది ఆదికి. లావణ్య పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం వున్నా కూడా ఆది ఇది చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటే ఇది అభినందనీయం అనే చెప్పాలి. వీరిని స్ఫూర్తిగా తీసుకొని అలాగే ఇంకా ఎక్కువ నటీనటులు ఇలా వెబ్ సిరీస్ లో కనపడుతూ ఉంటే బాగుటుంది. (#PuliMekaReview)
'బిగ్ బాస్' ఫేమ్ సిరి హన్మంతు ఒక ముఖ్యమయిన పాత్రలో కనపడుతుంది. ఆమె వున్న సన్నివేశాల్లో ఇంకా కొంచెం భావోద్వేగాలు ఉంటే బాగుండేది. అలాగే సుమన్ మరోసారి తన అనుభవం తో పోలీస్ కమిషనర్ పాత్ర ని అవలీలగా చేసాడు. గోపరాజు రమణ, రాజా కూడా తమ పాత్రలకు తగినట్టు న్యాయం చేశారు. ఇంకా మిగతా నటీనటులు అంతా బాగా సపోర్ట్ చేశారు. (#PuliMekaWebSeries)
సాంకేతికంగా చెప్పాలంటే, ఛాయాగ్రహణం బాగుంది, బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ఒకే. అయితే వెబ్ సిరీస్ కాబట్టి, దీనికి అంత హంగామా వద్దు అనుకున్నారేమో అందుకని కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకునేలా తీయలేకపోయారు. దానర్థం బడ్జెట్ అంత పెట్టకపోవటమే అనిపిస్తోంది. అందుకే మన తెలుగు వెబ్ సిరీస్ లలో అంతగా క్వాలిటీ ఉండటం లేదు. వెబ్ సిరీస్ అనగానే, చాల తక్కువ బడ్జెట్ పెట్టి, ఎక్కువ లాభం పొందాలి అనే అనుకునేవాళ్లు ఎక్కువ. సినిమా కి ఎంత పెడుతున్నారో, అలాగే వెబ్ సిరీస్ కి అంతే బడ్జెట్ పెట్టి, క్వాలిటీ తో తీస్తే ఇంకా బాగా వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు అన్నీ సినిమాకి పెట్టిన దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు. (#PuliMekaWebSeries)
చివరగా, 'పులి మేక' వెబ్ సిరీస్ లో అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు వున్నా, లాజిక్ లో లేకపోయినా, ఆసక్తికరంగా ఉంటుంది. చూడొచ్చు. కోన వెంకట్, దర్శకుడు చక్రవర్తి ప్రేక్షకుడిని టీవీ ముందు కూర్చోపెట్టగలిగే కథ ఇచ్చారు అనటంలో సందేహం లేదు. లావణ్య త్రిపాఠి బాగా చేసింది. అలాగే చివరలో ట్విస్ట్ పెట్టి, రెండో సీజన్ కోసం ఎదురు చూసేటట్టు చేశారు. ఆ సాగదీత సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే, ఈ వెబ్ సిరీస్ ఇంకా బాగుండేది అనిపిస్తుంది.