Extra Ordinary Man movie review: సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు...
ABN, First Publish Date - 2023-12-08T14:23:03+05:30
వక్కంతం వంశి దర్శకుడిగా తన రెండో సినిమా నితిన్ తో 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికిత రెడ్డి నిర్మాతలు. ఇందులో సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజశేఖర్, రావు రమేష్, రోహిణి, సుదేవ్ నాయర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, సంపత్ రాజ్, హైపర్ ఆది తదితరులు
సంగీతం: హారిస్ జయరాజ్
ఛాయాగ్రహణం: ఆర్థర్ ఏ విల్సన్, యువరాజ్ జె, సాయి శ్రీరామ్ (Arthur A Wilson ISC, Yuvraj J and Sai Sriram)
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి
దర్శకత్వం: వక్కంతం వంశి (Vakkantham Vamsi)
విడుదల: డిసెంబర్ 8, 2023
రేటింగ్: 2.5
-- సురేష్ కవిరాయని
రచయితగా వక్కంతం వంశీ అందరికీ సుపరిచితం. అతను రచయితగా చాలా సినిమాలకి పని చేసారు, అందులో 'రేస్ గుర్రం', 'కిక్', 'టెంపర్' లాంటి సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి. తరువాత అతను 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే చిత్రంతో దర్శకుడిగా కూడా ఆరంగేట్రం చేసారు, అందులో అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా 2018లో విడుదలైంది కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఐదేళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు దర్శకుడిగా, రచయితగా నితిన్ (Nithiin) కథానాయకుడిగా 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' #ExtraOrdinaryManReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వక్కంతం. ఇందులో శ్రీలీల (Sreeleela) కథానాయిక, కాగా ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ (Rajasekhar) ఒక ప్రత్యేక పాత్రలో కనపడతారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (ExtraOrdinaryMan movie review)
Extra Ordinary Man story కథ:
అభినయ్ (నితిన్) ఒక జూనియర్ ఆర్టిస్టు, ప్రతి సన్నివేశంలో వెనకాలే ఉంటూ ఉంటాడు, హీరో అవ్వాలని అనుకుంటూ ఉంటాడు, కానీ అవలేకపోతాడు. అభినయ్ తండ్రి సోమశేఖరం (రావు రమేష్) కొడుకుకి సరైన జాబ్ లేకపోవటంతో ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. అభినయ్ ఒకరోజు సంపన్నురాలు అయిన లిఖిత (శ్రీలీల) అనే అమ్మాయిని కలుస్తాడు, తరువాత అది ప్రేమగా మారుతుంది, తన కంపెనీలో అభినయ్ కి సీఈఓ పోస్ట్ ఇస్తుంది లిఖిత. ఇంతలోనే ఒక దర్శకుడు అభినయ్ ని హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని వస్తాడు, కథ నిజంగా జరిగిందని, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల దగ్గర వున్న ఒక గ్రామంలో ప్రజలను నీరో (సుదేవ్ నాయర్) అనేవాడు ఎలా పీడిస్తున్నాడు అనే విషయాన్ని వివరిస్తాడు ఆకథలో. అందులో అభినయ్ పోలీసు ఆఫీసరు పాత్ర అని చెప్తాడు, అందుకోసం అభినయ్ సీఈఓ వుద్యోగం మానేసి ఈ సినిమా కోసం కసరత్తులు కూడా చేస్తాడు. తీరా అన్నీ పూర్తయ్యాక ఆ దర్శకుడు అభినయ్ ని కాకుండా వేరే అతన్ని హీరోగా పెట్టుకొని సినిమా తీస్తా అని చెప్తాడు. అటు వుద్యోగం, ఇటు సినిమా రెండూ పోయి ఎటూ పాలుపోని అభినయ్ ఒక బార్ లో మందుకొడుతూ ఉంటే అక్కడకి విలన్ అయిన నీరో తమ్ముడు వస్తాడు, అతనితో పోట్లాట పెట్టుకుంటాడు. అభినయ్ కి దర్శకుడు కథ చెప్పినట్టుగా సన్నివేశాలు కనిపిస్తూ ఉండటంతో ఎస్సై సాయినాధ్ గా ఆ గ్రామంలో అడుగుపెడతాడు. అక్కడ ఏమి జరిగింది, నీరోని అభినయ్ ఎలా ఎదుర్కొన్నాడు, ఇందులో ఐజీ (రాజశేఖర్) పాత్ర ఏంటి? ఇక్కడ నుండి కథ ఎటువైపు మలుపులు తిరిగింది అనే విషయం మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! #ExtraOrdinaryManReview
దర్శకుడు, రచయిత వక్కంతం వంశీ ఇంతకు ముందు అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా కొంచెం సీరియస్ కథతో చేశారు, ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా పూర్తిగా వినోదాత్మకంగా ఉండాలని ఈ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' కథ రాసుకున్నారు. అతని నితిన్ పాత్రని కొత్తగా చూపించడంలో మంచి విజయం సాధించాడు, అయితే ఇక్కడ వచ్చిన లోపం ఏంటంటే, ఈ సినిమాలో కథ అంటూ ఏమీ ఉండదు, పూర్తిగా వినోదాత్మక సన్నివేశాలు తీయడంలోనే వక్కంతం ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే సినిమాలో నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే అన్నపూర్ణతో వచ్చే మొత్తం బాలకృష్ణ ఎపిసోడ్ ఇంకా చాలా సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. దిల్ రాజు వైరల్ అయిన డైలాగు 'ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు' ని ఇందులో బాగా వాడేశారు వక్కంతం. మొదటి సగం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటే, రెండో సగం పూర్తిగా రొటీన్ గా ఉంటుంది. రెండో సగంలో నితిన్, బ్రహ్మాజీ, హైపర్ ఆదిల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. కథ పెద్దగా లేకుండా, కేవలం ప్రేక్షకులను నవ్వించడానికి మాత్రమే తీసినట్టుగా కనపడుతుంది ఈ సినిమా. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీసాడు, అలాగే కొన్ని సన్నివేశాలు బోర్ కొడతాయి కూడా.
ఇక నటీనటుల విషయానికి వస్తే నితిన్ ఈ సినిమాలో కొత్తగా కనపడతాడు, చాలా హుషారుగా చేసాడు కూడా. మొదటి సగంలో ఒకలా, రెండో సగంలో ఇంకోలా రెండు వైవిధ్యమైన ఛాయలు అతని పాత్రలో కనపడతాయి. నితిన్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది, అలాగే అతని పంచ్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా అన్నపూర్ణ, పవిత్ర లోకేష్ లతో వున్న మొత్తం ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక రాజశేఖర్ ప్రత్యేక పాత్రలో బాగున్నారు, అదీ పోలీసు అధికారిగా ఇంకా బాగున్నారు. ఇక రావు రమేష్ కామెడీ టైమింగ్ అదిరింది. ఇంతకు ముందు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన రావు రమేష్, ఈసారి కామెడీ పాత్రలో కూడా మెప్పించారు. అతని డైలాగ్స్, పంచ్ లు, ముఖ్యంగా నితిన్ తో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇలాంటి నటులను ఇక్కడ పెట్టుకొని, ఎందుకనో మన దర్శకులు పరభాషా నటులకోసం వెంపర్లాడతారు. బ్రహ్మజీ తనదైన శైలిలో నవ్వించారు, రెండో సగంలో అతను కూడా హైలైట్. అలాగే హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, శివన్నారాయణ, హర్షవర్ధన్, రవి వర్మ, అజయ్ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. సుదేవ్ నాయర్ విలన్ గా అంతగా ఆకట్టుకోలేకపోయాడు అనే చెప్పాలి. శ్రీలీలని చివరగా ఎందుకు చెపుతున్నాను అంటే, ఆమె కేవలం పాటలకి, ఇంకో రెండు మూడు సన్నివేశాలకు మాత్రమే అన్నట్టుగా ఈ సినిమాలో వుంది. సంగీతం పరవాలేదు, ఛాయాగ్రహణం ముగ్గురు చేశారు.
చివరగా, 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' పూర్తి వినోదాత్మక చిత్రం అని చెప్పొచ్చు. లాజిక్, కథ ఇవేమీ లేకుండా, కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమాని చూడొచ్చు. అలాగే నితిన్ నటన సినిమాలో హైలైట్. పూర్తిగా వ్యాపారాత్మకంగా తీసిన సినిమా అని చెప్పొచ్చు, భారీ అంచనాలు పెట్టుకొని చూడొద్దు, జస్ట్ ఫర్ ఫన్ చూడండి!