సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Malli Pelli Film Review: కృష్ణ, విజయనిర్మల బతికి పోయారు

ABN, First Publish Date - 2023-05-26T13:51:10+05:30

నరేష్, పవిత్ర లోకేష్ నటించిన 'మళ్ళీ పెళ్లి' సినిమా ఈరోజు విడుదల అయింది. ఎంఎస్ రాజు దీనికి దర్శకుడు. నరేష్ నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించినట్టుగా అర్థం అవుతుంది. ఈ సినిమా ఎలా వుంది, నరేష్ పెళ్లిళ్ల విషయంలో ఎవరిదీ తప్పు, నరేష్ తప్పు అసలు ఏమీ లేదాయే ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి.

Still from Malli Pelli
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా: మళ్ళీ పెళ్లి

నటీనటులు: నరేష్ విజయ్ కృష్ణ, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనిత విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, ప్రవీణ్, రవివర్మ, అన్నపూర్ణ తదితరులు

సంగీతం: సురేష్ బొబ్బిలి

నిర్మాత: నరేష్ వి కె

రచన, దర్శకత్వం: ఎం ఎస్ రాజు

-- సురేష్ కవిరాయని

నిజ జీవితంలో నరేష్ (VKNaresh), పవిత్రల (PavitraLokesh) మీద చాలా వార్తలు వచ్చాయి. అలాగే నరేష్ పెళ్లిళ్ల మీద ఎన్నో వివాదాలు కూడా వార్తల్లో వచ్చాయి. ముఖ్యంగా మూడో భార్య రమ్య రఘుపతి (RamyaRaghupathi), నరేష్ మధ్యలో నడిచిన ఆరోపణలు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటానికి ప్రయత్నించటం లాంటి వార్తలు కూడా మీడియాలో వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే నరేష్, పవిత్రతో ఉంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కొన్నేళ్ల క్రితం జరిగిన (#MalliPelliFilmReview) మా (MAA) ఎలక్షన్స్, అప్పుడు నరేష్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యిన దగ్గరనుండీ పబ్లిక్ గా పవిత్రని నరేష్ పక్కన చూస్తున్నారు అందరూ, అలాగే ఇద్దరూ కలిసి ఉంటున్న సంగతి కూడా పబ్లిక్ కి తెలుసు. ఇటువంటి సమయంలో నరేష్ ఈ 'మళ్ళీ పెళ్లి' #MalliPelliReview అనే సినిమాలో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దీనికి ఎంఎస్ రాజు (MSRaju) దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాలు అన్నీ నరేష్ జీవితంలో జరిగిన సంఘటనలను పోలి ఉండటం ఆసక్తికరం. అయితే సినిమా ఎలా వుందీ అన్న విషయం ఇప్పుడు చూద్దాం.

Malli Pelli Film Story కథ:

నరేంద్ర (వికె నరేష్) (VK Naresh) ఒక పేరున్న నటుడు, సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటూ ఉంటాడు. అతనికి జోడీగా ఒక సినిమాలో కన్నడ నటి పార్వతి (పవిత్ర లోకేష్) (PavitraLokesh) నటిస్తుంది. వాళ్లిద్దరూ షూటింగ్ గ్యాప్ లో మాట్లాడుకుంటారు, అలాగే మనసులు కూడా కలుస్తాయి. ప్రేమలో పడతారు. అప్పటికే నరేంద్ర రెండు పెళ్లిళ్లు అయి, వాళ్ళతో విడిపోతాడు, కానీ మూడో భార్య సౌమ్య సేనాపతి (వనిత విజయకుమార్) (VanithaVijaykumar) తో ఇంట్లో ఉంటాడు, కానీ ఆమెతో ఎప్పుడూ కొట్లాటలు రావటంతో, పార్వతితో ప్రేమలో పడతాడు. పార్వతి, బెంగుళూరులో భర్త ఫనీంద్ర (రవి వర్మ)తో సంతోషంగా కాపురం చేస్తోంది అని అనుకుంటాడు నరేంద్ర, కానీ ఆమె జీవితంలో ఒక విషాద కథ ఉందని తెలుస్తుంది. అలాగే నరేంద్ర మూడో భార్య కూడా ఒక పక్క నరేంద్రని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నరేంద్ర, పార్వతి ఇద్దరూ కలిసి వుంటున్నారన్న విషయం బయటకి ఇంకా తెలియదు. కానీ ఒక ప్రత్యేక టీవీ ఛానల్ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి ఉండగా చూపిద్దాం అని ప్రయత్నాలు చేస్తూ వుంటారు. ఈలోగా బెంగుళూరు హోటల్ లో నరేంద్ర, పార్వతి ఇద్దరూ ఒకే రూమ్ లో కలిసి వున్నారని ఆ టీవీ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మూడో భార్య సౌమ్య సేనాపతి కి కూడా తెలిసి, మొత్తం మీడియా వాళ్ళని వేసుకొని రూమ్ దగ్గరకి వస్తుంది. నరేంద్ర, పార్వతి అప్పుడు ఏమి చేశారు, పార్వతి జీవితంలో విషాద కథ ఏంటి, నరేంద్రకి మూడో భార్య అసలు ఎలా పరిచయం అయింది, చివరికి ఏమైంది అని తెలుసుకోవాలనుంటే, అందరికీ తెలిసిన కథే అయినా సినిమా చూడండి.

విశ్లేషణ:

దర్శకుడు ఎంఎస్ రాజు (MSRaju) ఒకప్పుడు మంచి నిర్మాత. కానీ దర్శకుడిగా మారిన తరువాత ఎందుకో అయన పంథా మారింది. ఒకప్పుడు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు తీసే ఎంఎస్ రాజు, దర్శకుడిగా మారాక ఒక సెట్ అఫ్ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ 'మళ్ళీ పెళ్లి' సినిమా కూడా అతను దర్శకత్వం లో వచ్చినదే. నిజానికి ఇది ఎంఎస్ రాజు కథ అన్నారు కానీ, ఇది నరేష్ కి నిజ జీవితంలో జరిగిన కథే. #MalliPelliReview అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నరేష్ కి పవిత్ర పరిచయం ఆయిన దగ్గరనుండీ బయట ప్రపంచానికి తెలిసాక దాన్ని ఎలా సమర్ధించుకోవాలి అనే విషయాన్ని ఇలా ఒక చీప్ సినిమాగా తీసి కాష్ చేసుకోవాలని అనుకున్నాడు నరేష్, అందుకే 'మళ్ళీపెళ్లి' అని పేరు పెట్టి విడుదల చేశారు.

ఇందులో నరేంద్ర ఒక సీనియర్ నటుడు, పార్వతి ఒక కన్నడ నటి, విమలమ్మ నరేంద్ర అమ్మగారు, సూపర్ స్టార్, సౌమ్య సేనాపతి, ఇలా పేర్లు అన్నీ నరేష్ నిజ జీవితంలో ఉండేవే. నరేంద్ర - నరేష్, పార్వతి - పవిత్ర, విమలమ్మ - విజయనిర్మల, సౌమ్య సేనాపతి -రమ్య రఘుపతి, సూపర్ స్టార్ -కృష్ణ, ఇలా అన్ని పాత్రలను తెర మీద చూపించాడు. నరేష్ జీవితంలోకి పవిత్ర వచ్చాక, నరేష్ ఇమేజ్ పబ్లిక్ లో ఎలా వుంది, నరేష్ మూడో వివాహంలో అతనిది తప్పా, లేదా భార్య రమ్య రఘుపతిది తప్పా, ఇలాంటి విషయం నరేష్ చెప్పాలనుకున్నాడు, అతని దగ్గర డబ్బులున్నాయి, సినిమా తీసి చూపించాడు. #MalliPelliFilmReview

సినిమా విడుదలకి ముందు ఇది ఎవరి మీద రివెంజ్ కాదు అని చెప్పారు, కానీ ఇది కేవలం నరేష్ తన మూడో భార్య తన జీవితంలో ఒక విలన్ అని ప్రూవ్ చెయ్యడానికి తీసిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా, నరేష్ తాను చాలా మంచివాడిగా (తన డబ్బులతో తన గురించి సినిమా తీసాడు కదా) మూడో భార్యని ఒక శాడిస్ట్ గా చిత్రీకరించాడు. అందులో ఎంత నిజం ఉందో, అబద్ధం ఉందో వాళ్ళకే తెలియాలి. ఇక పవిత్ర లోకేష్ వెనకాల కూడా ఒక విషాధ కథ ఉందని చెప్పాడు. సినిమాలో నరేష్, పవిత్ర వాళ్ళ నిజ జీవితంలో జరిగినవి అన్నీ సక్రమంగా, మంచికే జరిగాయని సమర్ధించుకోవడానికి ఈ సినిమా తీసినట్టుగా కనపడుతోంది.

దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ సినిమాని అయిదు చాప్టర్ లుగా చూపించాడు. ఒక్కో చాఫ్టర్ లో ఒక్కొక్కరి గురించి చెపుతూ చివరికి ఏమైంది అనే విషయం చెప్పాడు. అయితే ఇందులో కృష్ణ (SuperStarKrishna) అభిమానులు కొంచెం నిరుత్సాహపడే విధంగా మాత్రం వున్నాయి. ఎందుకంటే కృష్ణ గారు విజయ నిర్మలని (Vijayanirmala) రెండో పెళ్లి చేసుకొని, విజయనిర్మల కొడుకు అయిన నరేష్ ని ఆదరించారు నిజ జీవితంలో. నరేష్ కూడా నిజ జీవితం లో కృష్ణ గారిలా పెళ్లి చేసుకొని తాను పెళ్లిచేసుకున్న భార్యకి ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళని ఆదరించటం, ఇలాంటివి నేను కూడా కృష్ణ గారి మార్గంలోనే వెళ్ళాను, అంటే నా తప్పు ఏమీ లేదు అన్నట్టుగా చూపించారు.

అలాగే నరేష్ తన తల్లి విజయనిర్మల పాత్రలో జయసుధని (Jayasudha) చూపించి ఆమెచేత కూడా నాలుగో పెళ్లి మంచిదే అన్నట్టుగా చూపించాడు. కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ఈ లోకంలో లేరు, బతికి పోయారు, ఎందుకంటే ఈ సినిమా చూడలేరు కాబట్టి. ఒకవేళ వారు బతికి ఉంటే మాత్రం ఇలాంటి సినిమాకి వొప్పుకునేవారు కాదేమో అని అనిపిస్తుంది. అసలు ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా వార్త వచ్చినా, రాసినా ఆ సదరు వ్యక్తి చాలా బాధపడిపోతారు, అలాంటిది తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు పబ్లిక్ కి చూపించటం ఎంతవరకు సబబు. అదీ పెళ్లిళ్ల గురించి, సంబంధాలు గురించి. నిజంగా మూడో భార్య తప్పు ఉండివచ్చు, అంత మాత్రం చేత ఆమెని ఒక పెద్ద బ్రహ్మరాక్షసి లా చిత్రీకరించి, ఆమెకి ఎవరితోనే సంబంధాలు ఉన్నాయని అంటగట్టడం, అవి తెర మీద చూపించటం ఎంతవరకు సబబు. ఆమె కూడా ఒక స్త్రీ నే కదా, మరి సాటి స్త్రీ అని చూడకుండా ఆమెదే మొత్తం తప్పు నాదేమీ లేదు అని చెప్పటమే సబబా? ఏమైనా ఇంట్లో జరిగిన విషయాలు, బయటకి పొక్కకుండా సెటిల్ చేసుకొని ఉంటే బాగుండేదేమో, ఇలా బయట పబ్లిక్ కి చూపించటం, రచ్చ చేసుకోవటం, అది సినిమాగా తీసి ఎదో కాష్ చేసుకుందాం అనుకోవటం ఇలాంటివి ప్రేక్షకులకి నచ్చుతాయా? దర్శకుడి ఎంఎస్ రాజు కొన్ని సన్నివేశాలను బాగా తీసాడు. అలాగే నరేష్ వయసు మీద, పెళ్లిళ్ల మీద వేసిన సెటైర్లు బాగున్నాయి. నేపధ్య సంగీతం బాగుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే, రోజూ టీవిలో చూస్తున్నాం నరేష్, పవిత్రలని, ఇప్పుడు అదే జంటని పెద్ద తెర మీద చూస్తాం. ఇద్దరూ కలిసే వుంటున్నారు కాబట్టి, ఇంట బయటా ఎలా వ్యవహరిస్తున్నారో, సినిమాలో కూడా అంతే సహజంగా నటించారు. జయసుధ హుందాగా చేశారు. శరత్ బాబు (SarathBabu) అచ్చం కృష్ణగారి లానే కనపడతారు. ఇది అతని చివరి సినిమా అవటం విషాదం. అనన్య నాగెళ్ల చాలా గ్లామర్ గా కనిపించింది, ఆమె సన్నివేశాలు బాగున్నాయి. వనిత విజయకుమార్ ఈ సినిమాలో ఒక ఆశ్చర్యకరమైన పాత్రలో కనపడుతుంది, చాలా బాగా చేసింది. ఆమె సినిమాకి హైలైట్.

చివరగా, 'మళ్ళీ పెళ్లి' #MalliPelliFilmReview అనే సినిమా వికె నరేష్ తనకి నిజ జీవితంలో జరిగిన మూడో పెళ్లి గురించి, తరువాత పవిత్ర పరిచయం, ఆమెతో కలిసివుండటం ఇవన్నీ తాను సక్రమంగానే చేసాను అని సమర్ధించుకోవడానికి తీసినట్టుగా అనిపించింది. అలాగే మూడో భార్యని ఒక విలన్ గా చిత్రీకరించాడు, ఆమె వలన తనకి శాంతి లేకుండా పోయిందని, అందుకే పవిత్ర దగ్గరకి చేరుకున్నాను అని చెప్పడానికి కూడా తీసాడు. ఒక విధంగా ఈ సినిమా నరేష్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం గా అనిపిస్తుంది. కృష్ణ గారు, విజయనిర్మల గారు బతికి ఉంటే ఇలాంటి సినిమాలు తీయనివ్వరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో కృష్ణ, విజయనిర్మలకి ఎంత మంచి పేరు ఉందొ వాళ్ళు స్థాపించిన 'విజయకృష్ణ మూవీస్' బ్యానర్ కి ఎంత పెద్ద పేరుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి బ్యానర్ మీద ఇలాంటి చీప్ సినిమా తీయటం వాళ్లిద్దరూ బతికుంటే చూసి....

Updated Date - 2023-05-26T14:33:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!