MAD film review: కాలేజీ కుర్రాళ్ళ నేపథ్యంలో వచ్చిన వినోదభరితమైన సినిమా
ABN, First Publish Date - 2023-10-06T14:20:15+05:30
కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాలేజీ కుర్రవాళ్ళు నేపథ్యంలో 'మ్యాడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక నిర్మాతగా అడుగుపెట్టింది. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: మ్యాడ్
నటీనటులు: సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా, అనంతిక, గోపిక ఉడయన్, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు
ఛాయాగ్రహణం: దినేష్ కృష్ణన్, సైనుద్దీన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
రేటింగ్: 3 (మూడు)
-- సురేష్ కవిరాయని
తెలుగులో కాలేజీ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగానే వచ్చాయి. అయితే అందులో చిన్న చిన్న జోకులు, సరదా సన్నివేశాలు జాగ్రత్తగా పెట్టి తీస్తే అలాంటివి యువతకు ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన కాలేజీ నేపధ్యం సినిమాలు బాగానే ఆడాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ (SitharaEntertainment) ఇలాంటి కాలేజీ నేపథ్యంలో 'మ్యాడ్' #MADReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) భార్య సౌజన్య (SaiSoujanya) నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాతో కొంతమంది కొత్త టాలెంట్ ని పరిచయం చేశారు, అలాగే దర్శకుడు కళ్యాణ్ శంకర్ (KalyanShankar) కూడా ఈ సినిమాతో ఆరంగేట్రం చేసాడు. ఎన్టీఆర్ (NTR) బావమరిది నార్నె నితిన్ (NarneNithin), సంతోష్ శోభన్ (SantoshSobhan)సోదరుడు సంగీత్ శోభన్ (SangeethSobhan) ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. #MADFilmReview
MAD story కథ:
ఈ సినిమా కథ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ఈ ముగ్గురూ మూడు ప్రాంతాలకు చెందిన వారు, ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ వుంటారు. భగవాన్ కాంటీన్ విషయంలో వేరే కాలేజీ వాళ్ళతో బాస్కెట్ బాల్ ఆది గెలుపొందే సమయంలో వీళ్ళు ముగ్గురూ మంచి స్నేహితులయిపోతారు. మనోజ్, శృతి (గౌరీ) అనే అమ్మాయిని, ప్రేమిస్తే, జెన్నీ (అనంతిక) అనే అమ్మాయి అశోక్ ని ఇష్టపడుతుంది. దామోదర్ అలియాస్ డీడీ కి గుర్తు తెలియని అమ్మాయి వెన్నెల పేరుతో ఒక ప్రేమ లేఖ రాసి, రోజూ ఫోనులో మాట్లాడుతూ ఉంటుంది. #MADReview అయితే వెన్నెల ఎవరో తెలియకుండానే, చూడకుండానే ఫోనులో మాట్లాడేస్తూ ఉంటాడు డీడీ. అలాగే నాలుగేళ్ళు గడిపేసి కాలేజీ విడిచిపెట్టే సమయంలో వెన్నెల ఎవరో తెలుసుకోవాలని నన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంతకీ వెన్నెల ఎవరు, మధ్యలో లడ్డు (విష్ణు) కథ ఏంటి, అతను ఎక్కడ నుంచి వచ్చాడు, అతను నేపధ్యం ఏంటి, ఈ ముగ్గురు స్నేహితులు చివరకు ఏమి చేశారు, ఇవన్నీ తెలియాలంటే 'మ్యాడ్' సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
కాలేజీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. 'హ్యాపీ డేస్' #HappyDays, 'కొత్త బంగారు లోకం' #KothaBangaruLokam, 'కేరింత' #Kerintha, 'పాఠశాల' #Paatashaala ఇలా అన్ని సినిమాలు మంచి అదరణనే పొందాయి. ఇప్పుడు దర్శకుడు కళ్యాణ్ శంకర్, నిర్మాత వంశీ (SuryadevaraNagaVamsi) తో కలిసి ఈ 'మ్యాడ్' #MADFilmReview అనే సినిమా కాలేజీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయితే ఇందులో చెప్పడానికి కథ పెద్దగా కనపడదు. కాలేజీ విద్యార్థులు, వారి ప్రేమ కథలు, వాళ్ళ మధ్య వచ్చే సరదా సంభాషణ, రెండర్థాలు వచ్చే మాటలు ఇలాంటి వాటి మీదే దర్శకుడు దృష్టి పెట్టి, సినిమా మొత్తం సరదాగా వుండేట్టుగా చూసుకున్నాడు.
అందుకనే సినిమా మొదటి నుండీ చివరి వరకు కొంచెం ఫన్, ఫన్నీ జోక్స్ తో సాగుతూ ఉంటుంది. దానికి తోడు నిడివి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాలేజీ నేపధ్యం అనగానే ఇందులో పేరున్న నటీనటులు కంటే కొత్తవాళ్లతో చేస్తేనే కుర్రాళ్ళ మధ్య నడిచే సన్నివేశాలు బాగా రక్తికడతాయి, అందుకని దర్శకుడు చాలామంది కొత్తవాళ్ళని తీసుకున్నాడు. వాళ్ళతో బాగా చేయించగలిగాడు. కాలేజీలో విద్యార్థుల మధ్య వుండే స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి అరమరికలు లేకుండా, అన్ని ప్రాంతాల వాళ్ళు ఎలా కలిసిమెలిసి వుంటారు అనేది సరదా సన్నివేశాలతో బాగా రక్తి కట్టించాడు దర్శకుడు.
సినిమా మొదలవడం ఇంజనీరింగ్ కాలేజీ బాగోలేదు ఇక్కడ చదవను వెళ్ళిపోతాను అని ఒక విద్యార్థి అనటంతో మొదలవుతుంది. అప్పుడు లడ్డు అనే సీనియర్ విద్యార్థి వచ్చి తాను కూడా మొదట్లో అలానే అనుకున్నాను అని అప్పుడు కాలేజీ పూర్వ విద్యార్థుల కథ చెప్పి, వెళ్ళిపోతాను అనే కుర్రవాడితో ఇదే కాలేజీలో చదువుకుంటాను అని చెప్పిస్తాడు. కాంటీన్ గురించి గొడవలు, దానికోసం బాస్కెట్ బాల్ పోటీ, ప్రేమ వ్యవహారాలు, చిలిపి సన్నివేశాలు ఇలా దర్శకుడు అన్నీ వినోదభరితంగా ప్రేక్షకులను రంజింప చేసాడు. కథగా అడిగితే పెద్దగా ఏమీ ఉండదు, కానీ ఇందులో ప్రతీ పాత్రకి ఒక కథ ఉంటుంది. వెన్నెల సన్నివేశం బాగుంది, వెన్నెలని వెతకడం కోసం పడే తపన, ఇంతకీ వెన్నెల ఉందా లేదా ఇవన్నీ రెండో సగంలో పెట్టాడు దర్శకుడు. #MADReview మొత్తం మీద ఈ కాలేజీ నేపధ్యం సినిమా చూపించండంలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ సఫలం అయ్యాడనే చెప్పాలి. కానీ నిర్మాత ఈ సినిమా విడుదలకి ముందు చెప్పినట్టుగా 'జాతి రత్నాలు' సినిమాకన్నా బాగుంటుంది అన్నాడు కానీ, ఈ 'మ్యాడ్' సినిమా ఆ సినిమాకి పోటీగా మాత్రం లేదు, కానీ వినోదభరితంగా తీయగలిగాడు. ఇందులో కూడా చాలా లోపాలు వున్నాయి. భావోద్వేగాలు అసలు లేవు, అలాగే సంగీతం మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అలాగే ఆ రెండర్థాలు మాటలు ఎక్కువయ్యాయి, అవి తగ్గించి ఉంటే బాగుండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో మూడు పాత్రలు ప్రధానం. మనోజ్, అశోక్, దామోదర్, వీళ్ళ ముగ్గురి పేర్లు ముందు అక్షరాలతో 'మ్యాడ్' అని టైటిల్ పెట్టాడు. #MADFilmReview మనోజ్ గా రామ్ నితిన్ చాలా బాగా చేసాడు, చాలా సహజంగా వున్నాడు. అతని అభినయానం ఆకట్టుకుంది. ఇక దామోదర్ గా సంగీత్ శోభన్ అదరగొట్టాడు. అతనిది చాలా ముఖ్యమైన పాత్ర, దానికి తగ్గుట్టుగానే అతను అంతే ఎనర్జీతో తన పాత్ర చక్కగా చేసి చూపించాడు. ఒక లైవ్ వైర్ లాగా అభినయించి అదరగొట్టాడు. చాలా సహజంగా చెయ్యడమే కాదు, డైలాగ్స్ లో పంచ్ లు, నటన కూడా అతి సునాయాసంగా ఉండేట్టు చేసాడు. ఇక ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మొదట్లో కొంచెం సీరియస్ గా కనిపించినా, బాస్కెట్ బాల్ గేమ్ తరువాత ఆ పాత్రలో ఒదిగిపోయాడు. లడ్డుగా విష్ణు అయితే నవ్వులే నవ్వులు. అతను వచ్చినప్పుడల్లా సన్నివేశాలు చాలా వినోదభరితగా ఉంటాయి. రఘుబాబు ప్రిన్సిపాల్ గా పరిధి మేరకి చేసాడు. అలాగే మురళీధర్ గౌడ్ ఈమధ్య ప్రతి సినిమాలో తనదైన శైలిలో నవ్విస్తూ కనపడుతున్నాడు, ఇందులో కూడా మెరుస్తాడు. ఇక అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కని నటనతో ఆకట్టుకున్నారు. అబ్బాయిలతో పోటీగా చేశారు. 'జాతిరత్నాలు' #JaathiRatnaalu దర్శకుడు అనుదీప్ (Anudeep) కూడా మధ్యలో కనపడి మెరుస్తాడు. మిగతా చాలామంది నటీనటులు అందరూ సహజంగా విద్యార్థులుగా బాగా సపోర్ట్ చేశారు. భీమ్స్ (BheemsCeciroleo) సంగీతం పరవాలేదు, ఒక పాత బాగుంది. కళ్యాణ్ శంకర్ మాటలు పంచ్ లతో ఆకట్టుకున్నాయి. ఛాయాగ్రహణం కూడా బాగుంది.
చివరగా, 'మ్యాడ్' సినిమా కథ పెద్దగా లేకపోయినా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన పంచ్ సంభాషణలతో, వినోదభరితమైన సన్నివేశాలతో సినిమా మొదటి నుంచి చివరి వరకు సరదాగా ఉండేట్టు చూపించాడు. యువతకి ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు వున్నాయి. సుమారు అర డజను సినిమాలు ఈరోజు విడుదలైతే అందులో ఈ 'మ్యాడ్' సినిమా నిలుస్తుంది అని చెప్పొచ్చు.