కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Japan movie review: అంచనాలను అందుకోలేకపోయిన 'జపాన్'

ABN, First Publish Date - 2023-11-10T16:15:21+05:30

కార్తీ 25వ సినిమా 'జపాన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అను ఇమ్మాన్యుయేల్ ఇందులో కథానాయిక, రాజు మురుగన్ దర్శకుడు. సునీల్ ఒక ముఖ్య పాత్రలో కనపడతాడు. ఈ సినిమా ఎలా ఉందంటే...

Japan movie review

సినిమా: జపాన్

నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు

ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు

దర్శకత్వం: రాజు మురుగన్

రేటింగ్: 2 (రెండు)

విడుదల తేదీ: నవంబర్ 10, 2023

-- సురేష్ కవిరాయని

అటు తమిళంలోనే కాకుండా, తెలుగులోనూ కూడా ప్రాముఖ్యం చెందిన నటుడు కార్తీ (Karthi). అతని 25వ సినిమా 'జపాన్' #JapanMovieReview ప్రేక్షకుల ముందుకు వచ్చింది. #Japan దీనికి రాజు మురుగన్ (RajuMurugan) దర్శకుడు, అను ఇమ్మాన్యుయేల్ Anu Emmanuel) కథానాయిక. ఈ సినిమా తమిళం, తెలుగులోనూ ఒకేసారి విడుదలైంది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Japan Story కథ:

హైదరాబాదులో రాయల్ బంగారం షాపులో రూ.200 కోట్ల విలువలైన బంగారు నగలు, ఆభరణాలు ఎవరో దోచేస్తారు. పోలీసులు ఈ దొంగతనం జపాన్ (కార్తీ) అనే దొంగ చేశాడని అనుమానిస్తారు. ఇనస్పెక్టర్ శ్రీధర్ (సునీల్), ఇంకో పోలీస్ ఆఫీసర్ భవాని (విజయ్ మిల్టన్) ఈ ఇద్దరూ ప్రత్యేక టీములతో జపాన్ కోసం వేట మొదలు పెడతారు. జపాన్ కోసం ఒక్క హైదరాబాదు పోలీసులే కాకుండా, కేరళ, కర్ణాటక పోలీసులు కూడా పట్టుకోవాలని వెతుకుతూ వుంటారు. జపాన్ తను దోచుకున్న బంగారం, డబ్బుతో తనే కథానాయకుడిగా, అందులో సంజు (అనూ ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయిని కథానాయికగా పెట్టి సినిమాలు తీస్తూ ఉంటాడు. (Japan movie review) ఆ అమ్మాయి స్టార్ కూడా అయిపోతుంది, జపాన్ ఆమెని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. పోలీసులకి జపాన్, స్టార్ కథానాయికి సంజుని కలవటానికి వస్తున్నాడని ఒక షూటింగ్ ప్లేస్ దగ్గర కాపు కాస్తారు. కర్ణాటక, కేరళ పోలీసులు కూడా అదే సమయంలో జపాన్ పట్టుకోవడానికి అక్కడికి వస్తారు. జపాన్ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆ దొంగతనం తను చెయ్యలేదు అని చెప్తాడు జపాన్. మరి ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ నేపధ్యం ఏంటి? ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? పోలీసులు అతన్ని పట్టుకున్నారా లేదా? కొందరు పోలీసులు జపాన్ అంటే ఎందుకు భయపడతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'జపాన్' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కార్తీ తమిళ సినిమాలు అన్నీ తెలుగులో విడుదలవుతూ ఉంటాయి. అతని సినిమాల్లో కొంచెం సృజనాత్మక ఉంటుంది అని ప్రేక్షకులు అతని సినిమాలు చూస్తూ వుంటారు. ఈ 'జపాన్' సినిమా ప్రచార చిత్రాలు కొంచెం ఆసక్తికరంగానే వున్నాయి. అయితే 'జపాన్' సినిమా దర్శకుడు రాజు మురుగన్ ఆసక్తికరంగానే మొదలెట్టాడు, కానీ కొంచెం సేపు అయ్యాక, సినిమాలో విషయం లేదు అని అర్థం అయిపోతుంది. జపాన్ అనేవాడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు, ఒక పెద్ద బంగారం షాపుని దొంగలు దోచుకుంటారు, అది జపాన్ చేసాడని పోలీసులు నమ్ముతారు. కానీ అది జపాన్ చెయ్యలేదు, అది ఎవరు చేశారో అని పోలీసులు, జపాన్ ఇద్దరూ బయలుదేరుతారు. చివరికి ఎవరి చేశారో, చేయించారో అనేది ఒక ట్విస్ట్. ఇదీ కథ. #JapanMovieReview

అయితే ఈ కథలో దొంగ, పోలీసు ఆటలు ఆసక్తికరంగా చూపించవచ్చు, తీయవచ్చు, కానీ దర్శకుడు కామెడీ అనుకున్నాడో ఏమో, కార్తీని మరీ ఒక జోకర్ లా చూపించాడు. పెద్ద పెద్దగా దొంగతనాలు చేస్తున్న కార్తీ ని ఒక పక్క జోకర్ లా చూపిస్తూనే, ఇంకో పక్క రాబిన్ హుడ్ తరహాలో చూపించాడు దర్శకుడు. అసలు ఈ కథలో ఏమి చెప్పాలని అనుకున్నాడో అది సరిగ్గా చెప్పలేకపోయాడు. అదీ కాకుండా, మాట్లాడితే సినిమాలో దొంగగా వున్న జపాన్ తన డబ్బుతో చేసిన సినిమాలో బిట్స్ ని ఎక్కువ చూపించాడు దర్శకుడు. అది ప్రేక్షకులకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కథకి అడ్డంకులు, సాగదీసినట్టుగా కనపడతాయి. (Japan Movie Review)

సినిమాలో జపాన్ పాత్ర పోషించిన కార్తీ కి అదొకరకమైన యాస పెట్టాడు దర్శకుడు. అది అక్కడక్కడా వర్కవుట్ అవుతుంది, కానీ మొత్తం సినిమా అంతా అలానే మాట్లాడటం కొంచెం బోర్ గా ఫీల్ అవుతాడు ప్రేక్షకుడు. కథ ఆసక్తికరంగా వుండి, మధ్యలో కొన్ని సరదా సన్నివేశాలు వస్తే పరవాలేదు కానీ, కథని పక్కకి తప్పించి, ఏకంగా కార్తీ మీదే పూర్తిగా కామెడీ చేద్దామని దర్శకుడు అనుకున్నాడు , కానీ అది అంతగా నడవలేదు. వీటన్నిటికీ తోడు చాలా పాత్రలకి డబ్బింగ్ పెద్దగా వినపడుతూ ఉంటుంది. అవన్నీ కొంచెం అదోలా అనిపిస్తుంది తెలుగు ప్రేక్షకులకి. ఎక్కడా తెలుగు సినిమాలా కనిపించదు, అరవ సినిమాలనే ఉంటుంది. అక్కడక్కడా మాత్రం కొన్ని సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయి తప్పితే, సినిమాలో విషయం లేదు అనే చెప్పాలి.

సాంకేతికంగా చూస్తే ఛాయాగ్రహణం పరవాలేదు అనిపించారు. అలాగే జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం కూడా అంతంత మాత్రమే. చెప్పుకోదగ్గ పాటలు లేవు. నేపథ్య సంగీతం కూడా మామూలుగా వుంది. సినిమాలో ముందు ఎటువంటి సన్నివేశాలు వస్తాయో ప్రేక్షకుడికి చాలా సులువుగా అర్థం అయిపోతూ ఉంటుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తీ తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు, అందుకని అతని పాత్ర బాగుంది, కానీ దర్శకుడు బలంగా రాయలేదు అని చెప్పొచ్చు. జోకర్ లా చూపించేసాడు, అది కార్తీ తప్పు కాదు, అతను తన పాత్రని బాగానే చేసాడు. వేరే యాసలో మాటలు అన్నీ చెప్పాడు, అక్కడక్కడా బాగున్నాయి, నవ్విస్తాయి కూడా. తెలుగు నటుడు సునీల్ (Sunil) ఈమధ్య తమిళ సినిమాల్లో బాగానే కనపడుతున్నాడు, ఇందులో కూడా మంచి పాత్ర వచ్చింది, బాగా చేసాడు. సునీల్ కి కొంచెం వైవిధ్యమున్న పాత్ర ఈ సినిమాలో వచ్చింది. ఇక ఈమధ్య సినిమాలో కథానాయికగా పాత్రకి అసలు ప్రాముఖ్యం ఇవ్వడమే లేదు, ఇందులో అను ఇమ్మాన్యుయేల్ విశ్రాంతికి కొన్ని నిముషాల ముందు మాత్రం కనపడుతుంది, ఆ తరువాత ఒక నాలుగైదు సన్నివేశాల్లో అంతే. పోలీస్ ఆఫీసర్ భవాని పాత్రలో విజయ్ మిల్టన్ (VijayMilton), ఇంకొక నటుడు కెఎస్ రవికుమార్ (KSRavikumar) తమ పాత్రల పరిధి మేరకు చేశారు. మిగతా వాళ్ళు అందరూ పరవాలేదు అనిపించారు.

చివరగా, 'జపాన్' సినిమా ప్రేక్షకుడు ఆశించినంత స్థాయిలో లేదనే చెప్పాలి. దర్శకుడు రాజు మురుగన్ కథ మీద, కథనం మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కార్తీ ని జోకర్ లా చూపించే బదులు, అతను ఎలా దొంగతనాలు చేసాడు, తన మీద మోపబడిన దొంగతనం తాను చెయ్యలేదు అని ఎలా నిరూపించాడు అనేది కొంచెం సీరియస్ గా చెప్పి ఉంటే బాగుండేది. 'జపాన్' ఇంకొక డబ్బింగ్ సినిమా, వచ్చింది, వెళ్ళిపోయింది!

Updated Date - 2023-11-10T16:15:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!