సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adipurush Film Review: ఇదేమి రామాయణం, ఇదెక్కడి చోద్యం ఓం రౌత్ !

ABN, First Publish Date - 2023-06-16T13:53:48+05:30

దర్శకుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' రామాయణం ప్రాతిపదికగా తీసాను అని విడుదలకి ముందు చెప్పాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. చాలా హైప్, క్రేజ్ తో ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. మరి సినిమాల ఎలా వుందో చదవండి.

Adipurush Film Review
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా: ఆదిపురుష్

నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నగె తదితరులు

సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళణి

సంగీతం: అజయ్-అతుల్

నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా

ఎడిటింగ్: అపూర్వ మోత్వాలే సాహాయ్, అనిష్ మహత్రే

నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్

-- సురేష్ కవిరాయని

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా, దర్శకుడు ఓం రౌత్ (OmRaut) 'ఆదిపురుష్' (Adipurush) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది రామాయణం ఆధారంగా తీసిన సినిమా అని విడుదలకి ముందు చెప్పాడు. ఈ సినిమాకి ఈమధ్య కాలంలో ఏ సినిమాకి రానంత క్రేజ్ వచ్చింది. ఈ సినిమా మోషన్ కేప్చర్, యానిమేషన్, మామూలు రెగ్యులర్ సన్నివేశాలు ఇన్ని కలబోసి తీసిన సినిమా. ఈ సినిమాకి సుమారు రూ. 500 కోట్లు ఖర్చు అయిందని కూడా అంటున్నారు. #AdipurushFilmReview అలాగే ఈ సినిమా విడుదలకి ముందు ఆ చిత్ర నిర్వాహకులు స్వామి హనుమకు ఒక సీట్ ఖాళీగా వుంచుతాము అని కూడా చెప్పారు, అంటే ఈ సినిమాకి చిత్ర నిర్వాహకులు ఎంతలా ప్రమోట్ చేశారో చెప్పొచ్చు. ఈ సినిమా ప్రచార చిత్రం ముందు విడుదల చేసినప్పుడు, #AdipurushReview చాలా విమర్శలు వచ్చాయి. అందుకని విడుదల తేదీ ముందుగా అనుకున్న దానికంటే పొడిగించి ఈరోజు (జూన్ 16) విడుదల చేశారు. అయితే అలా విమర్శలు రావటంతో దర్శకుడు, నిర్మాతలు ఈ సినిమాకి సంబంధించి సాంకేతికతను ఏమైనా బాగా చేసి ఉంటారని ప్రేక్షకుడు భావిస్తాడు. మరి అలా ఉందా? ఈ ఓం రౌత్ తీసిన ‘ఆదిపురుష్’ ఎలా వుందో చూద్దాం. #AdipurushFilmReview

Adipurush story కథ:

ఇది అందరికీ తెలిసిన కథే, ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఇందులో రాముడు (ప్రభాస్) వనవాసానికి వెళ్లినప్పటి నుండి ఉంటుంది. రాముడు, శేష్ (సన్నీ సింగ్), సీత (కృతి సనన్) తో వనవాసానికి వెళ్ళినప్పుడు, సీత మాయలేడిని చూసి రాముడికి చెప్తుంది. ఆ తరువాత ఆ మాయలేడిని వెతుక్కుంటూ రాముడు వెళతాడు. #AdipurushFilmReview ఆ మాయలేడి రాముడు గొంతుతో అరవటం, సీత వెంటనే శేష్ ని కూడా రాముడికి సాయంగా వెళ్ళమంటుంది. శేష్ వెళ్లిన తరువాత రావణుడు (సైఫ్ అలీ ఖాన్) సన్యాసి వేషంలో సీత దగ్గరకి భిక్షకి రావటం, సీత బయటకి వచ్చి బిక్ష వేస్తుండగా రావణాసురుడు ఆమెను ఎత్తుకుపోతాడు. రాముడు, శేష్ అది మాయలేడి అని తెలుసుకొని తిరిగి వచ్చిన తరువాత జటాయువు రావణ అని పేరు చెప్పి మరణిస్తుంది. #AdipurushReview రాముడు అప్పుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకొని వానర సైన్యం సహాయం కోరతాడు. అక్కడే హనుమ (దేవదత్త నగె) కూడా కలుస్తాడు. వానర సైన్యంతో రావణుడు మీద యుద్దానికి వెళ్లి రావణుడు ఎత్తుకుపోయిన సీతను తిరిగి రాముడు పొందుతాడు. ఇది టూకీగా కథ.

విశ్లేషణ:

దర్శకుడు ఓం రౌత్ ఈ 'ఆదిపురుష్' #Adipurush సినిమా చేసినప్పుడు దానిమీద అసలు రీసెర్చ్ చెయ్యలేదని అర్థం అవుతోంది. ఎందుకంటే మొదటి సన్నివేశం నుండి చివరి వరకు తనకు నచ్చినట్టుగా తన ఊహకు అందినట్టుగా సన్నివేశాలను రూపొందించి తీసుకున్నాడు కానీ, వాల్మీకి రామాయణం కానీ, ఏ ఇతర రామాయణాలు ప్రాతిపదికగా కానీ చూసి తీసినట్టు సినిమాలో ఒక్క సన్నివేశం కూడా కనిపించదు. #Adipurush ఇప్పుడు చాలామంది ప్రజలకు ముఖ్యంగా తెలుగు వారికి రామాయణ, భారత, భాగవతాలు గురించి బాగా తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుండీ సాయంత్రం వరకు చాలా ఛానల్స్ లో చాగంటి, మల్లాది, సామవేదం, గరికిపాటి ఇంకా మరికొందరు ఉద్దండులైన వారి ప్రవచనాలు వింటూ, చూస్తూ వుంటారు. అందుకని ఇప్పటి యువకులకు కూడా ఈ ఇతిహాసాల మీద అవగాహన వుంది. అందుకని సినిమా కోసం కొన్ని సన్నివేశాలు రాసుకున్న మూల కథని మార్చకూడదు, వక్రీకరించకూడదు.

కానీ ఇక్కడ దర్శకుడు ఓం రౌత్ ఏమి చేశాడంటే తనకి నచ్చినట్టుగా తనో రామాయణం రాసుకున్నట్టుగా అనిపిస్తోంది. వాల్మీకి రామాయణం ఒక గొప్ప ఇతిహాసం, అందులో సీతారాముల పవిత్ర బంధం ఉంటుంది, అన్నదమ్ముల మధ్య అనుబంధం అలాగే ఎన్నో ధర్మాలు, స్నేహానికి ప్రతీక కూడా రామాయణమే. రాముడు, లక్షణుడు, భరతుడు, సుగ్రీవుడు, వానర సైన్యం, స్వామి హనుమ, మండోదరి, విభీషణుడు, ఇలా రామాయణంలో వచ్చిన ప్రాతి పాత్రకి ఒక ఔన్నత్యం ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడికి ఒక పౌరాణిక సినిమా చూసినట్టుగా, ఆ భక్తి, ఆ డివోషన్ కనపడాలి. కానీ ఓం రౌత్ అవేమీ సినిమాలో చూపించలేకపోయాడు, అందుకని ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామా లేక ఇంకో సినిమా చూస్తున్నామా అన్న భావన కలుగుతుంది కానీ.. పౌరాణిక సినిమా చూస్తున్నామన్న ధ్యాస కలగదు. భావోద్వేగం అసలు లేదు. అసలు ఏ రామాయణంలో కూడా లేని సన్నివేశాలని ఓం రౌత్ కొత్తగా సృష్టించి చరిత్రని వక్రీకరించడమే కాకుండా, తప్పుడు సంకేతాలను పంపిస్తున్నట్టుగా అనిపించింది. ప్రజల బలహీనతని క్యాష్ చేసుకుందాం అని అనుకోకూడదు. తెల్సిన కథని తెలిసినట్టుగా చెప్పాలి గానీ, మొత్తం మార్చేయకూడదు. చిన్న చిన్న సినిమాటిక్ మార్పులు అంటే పరవాలేదు కానీ మొత్తం కథనే మార్చేస్తే ఎలా.

ఇక సినిమా చూస్తున్నంత సేపూ ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టుగా అనుభూతి ఉంటుంది. 'కింగ్ ఖాన్', 'ప్లానెట్ ఆఫ్ యాప్స్' ఇంగ్లీష్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ వానర సైన్యంలో ఒక్క హనుమ తప్ప మిగతా వాళ్ళు అందరూ ఏదో వింత జంతువుల్లా చూపించాడు ఓం రౌత్. ఆఖరికి సుగ్రీవుడిని కూడా ఏదో వింత జంతువులా చూపించాడు. ఇది సరే, మరి రావణాసురుడిని అయితే మరీ హాలీవుడ్ సినిమాలో విలన్ లా చూపించాడు. ఆ జుత్తు ఏంటి, ఆ ఆకారం ఏంటి, ఆ వేషం ఏంటి, అసలు రావణాసురుడు ఎప్పుడైనా అలా ఉంటాడా? ఓం రౌత్ ఏమి రీసెర్చ్ చేసాడు. హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువయితే ఇలాంటి వికృత ఆలోచనలే వస్తాయి. లంక ఎంత అందంగా వర్ణించారు రామాయణంలో, అటువంటి లంకని హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు ఒక వికృత పట్టణం, అందులో వికృతంగా వుండే ఆ వింత మనుషులు. ఇవన్నీ కాకుండా హాలీవుడ్ సినిమా 'జురాసిక్ పార్క్' లో వున్న కొన్ని ఎగిరే వింత పక్షులు, జంతువులు లాంటివి మాట్లాడితే వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడివో తెలీదు.

ఈరోజు మూడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్న పిల్లల్ని ఇతిహాసాల్లో వున్న పాత్రల బొమ్మలు వెయ్యమంటే చాలా చక్కగా వేస్తారు. వాళ్ళకి ఎవరు నేర్పారు, ఎవరూ నేర్పలేదు. ఇంట్లో తల్లిదండ్రులు రాముడు ఇలా ఉంటాడు, లక్ష్మణుడు ఇలా ఉంటాడు, సీత, రావణుడు, విభీషణుడు, హనుమంతుడు ఇలా వారి గురించి చెప్పినప్పుడు ఊహించి చక్కగా వేస్తారు. మరి ఓం రౌత్ అలా కాకుండా ఎక్కడో హాలీవుడ్ లో కనిపిస్తున్న విలన్స్ లా ఎందుకు చిత్రీకరించాడో అతనికే తెలియాలి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రావణుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు చూస్తాడు.. చూసి పరిగెడుతూ ఉంటాడు. ఏ రామాయణంలో రాశారో మరి, రాముడు చూసినట్టు. రాముడు చూస్తే వెంటనే బాణం వేసి రావణుడిని ఆపాలి కదా. ఇది ఓం రౌత్ రామాయణంలో ఉందేమో. అలాగే హనుమ సముద్ర లంఘనం చేసి లంకకి వెళ్లి సీతమ్మవారికి కనపడేటట్టు చెట్టు మీద నుండి ఉంగరం కింద పడేస్తాడు. ఇది కూడా మళ్ళీ ఓం రౌత్ రామాయణమే. అలాగే హనుమంతుడు సీతతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది రాక్షసులు చూస్తారు. సీత ముందే హనుమంతుడు రాక్షసులకు మధ్య యుద్ధం. ఇదెక్కడి రామాయణమో. సీతమ్మ దర్శనం అయ్యాక లంకలో విశేషాలను తెలుసుకోవడానికి స్వామి హనుమ అశోక వనాన్ని కావాలనే ధ్వంసం చేస్తే, అక్కడకి రాక్షసులు వస్తారు. అది అందరికి తెలిసిన విషయం. మరి ఈ ఓం రౌత్ రామాయణంలో ఇలాంటి వికృత సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. వాలి, సుగ్రీవులు ఇద్దరూ ఒకేలా వుంటారు, అందుకని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచి ఓడిపోయి వెనక్కి వస్తే, రాముడు ఇద్దరూ ఒకేలా వున్నారు, ఆ విషయం నాకు తెలీదు, అందుకని సుగ్రీవుడి మెడలో ఒక పూల దండ వేసి యుద్ధానికి వెళ్ళమంటారు. అప్పుడు చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తాడు. ఇక్కడ ఓం రౌత్ రామాయణం వేరేలా చూపిస్తాడు.

వాల్మీకి రామాయణం ప్రాతిపదికగా చాలామంది రామాయణాలు రాసారు, వచ్చాయి కూడా, కానీ మూలంలో మార్పులు చెయ్యకుండా అక్కడక్కడా తమ కవి హృదయం, భక్తి చాటుకొని వేరేగా రాసుకున్నారు. కానీ ఇన్ని మార్పులు అయితే చేయలేదు. ఓం రౌత్ మొత్తం తనకి అనుకూలంగా మార్చేసుకున్నాడు. ప్రతి పాత్రని, ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని మార్చేశాడు. నార చీరలు ధరించారు వనవాసం అయ్యేంత వరకు, సీతారామ లక్షణులు. కానీ ఓం రౌత్ తనకి నచ్చిన చీరని సీతకి కట్టించాడు. ఇదేమి వికృతమో. మండోదరి పాత్ర మరీ విచిత్రంగా చూపించాడు. ఆమె పాత్ర యుద్ధకాండలో వస్తుంది. గొప్ప పాత్ర ఆమెది. ‘అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతకనాశినీః’ అంటారు. మండోదరి పంచకన్యల్లో ఒకరు, అటువంటి మండోదరిని ఓం రౌత్ ఇంకోలా చూపించాడు.

పురాణాలూ, ఇతిహాసాలు ఆధారంగా ఎన్నో తెలుగుసినిమాలు వచ్చాయి. అందులో చాలా కల్పితాలు కూడా వున్నాయి. కానీ ప్రేక్షకులు వాటిని ఎంతో ఆదరించారు. ఎందుకంటే కల్పితం అయినా కూడా, అందులో భక్తిని నింపారు, నిజాయితీగా తీశారు అందుకని ఆడాయి. 'మాయాబజార్' (Mayabazar) సినిమా కల్పితమే, ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం తీసిన ఆ సినిమా ఈరోజుకి ఆదరిస్తున్నారు. అందులో కృష్ణుడుగా వేసిన రామారావు (NTR) గారికి గుడి కట్టేశారు. అలాగే దర్శకుడు బాపు తీసిన 'సంపూర్ణ రామాయణం' #Sampoorna Ramayanam అప్పట్లో బళ్ళు కట్టుకొని వెళ్లి మరీ చూసారు. అందులో రాముడిగా గా వేసిన శోభన్ బాబు (SobhanBabu) కి పూజలు చేశారు. అంతటి ప్రభావాన్ని చూపించగలిగారు అంటే ఆ సినిమాలు ఎంత నిజాయితీగా తీశారో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' లో అన్నీ లోపించాయి. సాంకేతిక అయితే మరీ బాగోలేదు. యానిమేషనా, మోషన్ కేప్చరా, అసలు ఏంటి? ఏ టెక్నాలజీ కూడా సరిగ్గా వాడుకోలేదు, చూపించలేదు. ఒక్క నేపధ్య సంగీతం మాత్రం పరవాలేదు అనిపించారు, అది, అక్కడక్కడా ఒకటి రెండు సన్నివేశాలు బాగున్నాయి. #Adipurush లేకపోతే అది కూడా చూడలేము. ఇంక పాత్రల గురించి ఇక్కడ మాట్లాడటం అనవసరం. ఎందుకంటే సినిమా మొత్తం ఓం రౌత్ తనకు అనుకూలంగా తనకి నచ్చినట్టుగా తాను రాసుకున్న రామాయణం పెట్టి తీశాడు కాబట్టి, అందులో పాత్రలు ఎలా వుంటాయో ప్రేక్షకులకు అర్థం అయిపోతుంది. #AdipurushFilmReview అందుకని ఇక్కడ ప్రత్యేకంగా ఎవరెవరు ఎలా చేశారు, అసలు ఆ పాత్రలకి వాళ్ళు సూట్ అయ్యారా లేదా అన్నది అప్రస్తుతం. అందుకని చెప్పటం లేదు. తెలుగు వాళ్ళకి అయితే మాత్రం అసలు ఎక్కదు? ఎందుకంటే ఆ పేర్లు మనం ఎప్పుడూ వినలేదు. రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, హనుమంతుడు ఇలా పేర్లు పలుకుతాం, అవే తెలుగు వాళ్ళ నోళ్ళలో నానుడిగా ఉండేవి. ఈ శేష్ ఏంటబ్బా? ఎక్కడ నుండి వచ్చాడు? రాఘవ ఒకే కానీ, రామా అనే అంటాం కదా మనం.

ప్రజల బలహీనతని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా యువత ఈ సినిమా తప్పని సరిగా చూడాలని విడుదలకి ముందు అంటూ, ఇలాంటి చరిత్ర వక్రీకరించి సినిమాలు తీస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. ఆమధ్య కొందరు యువకులను అల్లూరి సీతారామరాజు గురించి తెలుసా అంటే,రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో వున్న అల్లూరి గురించి చెప్పారు. #AdipurushReview అది ఫిక్షన్ సినిమా అయినా, దృశ్య రూపంగా చూపించారు కాబట్టి అదే గుర్తుండిపోతుంది. అదే అసలు పాత్రలు అనుకొని యువత నమ్ముతున్నారు. ఇలాంటివి చేస్తే ప్రజలను తప్పుదోవ పట్టించినట్టే కదా. అదే ఇప్పుడు ఈ 'ఆదిపురుష్'తో ఓం రౌత్ చేశాడు. ఇది ఘోర తప్పిదమే!

ఈ సినిమా వేస్తున్న థియేటర్స్‌లో హనుమంతుడు కోసం ఒక కుర్చీ ఖాళీగా ఉంచుతాం అన్నారు. ఇప్పుడు సినిమా చూశాక ఏమి అనిపిస్తోందో తెలుసా.. ఒక కుర్చీ ఏమి ఖర్మ, మొత్తం వానర సైన్యం అంత వచ్చి థియేటర్‌లో కూర్చోవచ్చు. ఈ సినిమాకి ఇచ్చిన హైప్, క్రేజ్ చూసి వెళితే మాత్రం చాలా నిరాశపడతారు.

Updated Date - 2023-06-16T14:55:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!