Gandeevadhari Arjun film review: సినిమా కథ చెత్త, చతికిలబడిన అర్జునుడు
ABN, First Publish Date - 2023-08-25T13:59:07+05:30
ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ చేతులు కలిపి చేసిన 'గాండీవధారి అర్జున' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాత, సాక్షి వైద్య కథానాయకురాలి. ఇది ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా అని విడుదలకి ముందు చెప్పారు, మరి అది ఎలా వుందో, ఏమిటో చదవండి.
సినిమా: గాండీవధారి అర్జున
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, అభినవ్ గోమటం, వినయ్ రాయ్, నరేన్, రోషిణి ప్రకాష్ తదితరులు
ఛాయాగ్రహణం: ముఖేష్ జి
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
రచన, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
-- సురేష్ కవిరాయని
నటుడు వరుణ్ తేజ్ (VarunTej) 2019 లో 'గడ్డలకొండ గణేష్' #GaddalakondaGanesh సినిమా చేసాడు, అది పరవాలేదు బాగానే నడిచింది, ఆ తరువాత 'ఘని' #Ghani, 'ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రూస్ట్రేషన్' #F3:FunAndFrustration అనే సినిమాలు చేసాడు. చివరి రెండు సినిమాలు అతనికి అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. ఈ రెండు సినిమాలు గత సంవత్సరంలో విడుదలయ్యాయి. ఇప్పుడు 'గాండీవధారి అర్జున' #GandeevadhariArjunReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ప్రవీణ్ సత్తారు (PraveenSattaru) దర్శకుడు, ఇతని ముందు సినిమా 'ది ఘోస్ట్' #TheGhost అని నాగార్జునతో (NagarjunaAkkineni) చేసాడు, అది ఒక పెద్ద డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరికీ కూడా ఒక మంచి విజయం కావాలి. ఈ సినిమాలో సాక్షి వైద్య (SakshiVaidya) కథానాయకురాలు, మిక్కీ జె మేయర్ (MickeyJMeyer) సంగీతం, బివిఎస్ఎన్ ప్రసాద్ (BVSNPrasad) నిర్మాత. ఇంతకీ ఆ ఇద్దరికీ ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా, ఎలా వుందో చూద్దాం.
Gandeevadhari Arjun story కథ:
భారత దేశానికీ చెందిన కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) లండన్ లో జరుగుతున్న గ్లోబల్ సమావేశానికి హాజరవుతాడు. ఆయనతో పాటు అతని పీఏ ఐరా (సాక్షి వైద్య) కూడా ఉంటుంది. అతన్ని రహస్యంగా కలిసి ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడానికి శృతి (రోషిణి ప్రకాష్) అనే అమ్మాయి ప్రయత్నం చేస్తుంది, కానీ అప్పుడు మంత్రి మీద ఎటాక్ జరుగుతుంది. అందులో మంత్రికి సెక్యూరిటీగా వున్న వ్యక్తి గాయపడతాడు, కానీ మంత్రికి ప్రాణహాని ఉందని తెలిసి గాయపడిన అతను అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) అనే అతన్ని మంత్రికి సెక్యూరిటీ గా ఉంటే బాగుంటుంది అని చెప్తాడు. #GandeevadhariArjunReview ఆదిత్య రాజ్ పీఏ, అర్జున్ వర్మ ఒక్కప్పుడు ఇద్దరూ ప్రేమికులు, మొదట్లో ఐరా నిరాకరించినా, మంత్రి బాగోగులు గురించి అలోచించి అర్జున్ వర్మకి ఒకే చెపుతుంది. ఈలోగా లండన్ వెళ్లిన కేంద్ర మంత్రి గ్లోబల్ మీట్ లో విదేశీయ కంపెనీలు భారత దేశంలో డంప్ చేస్తున్న చెత్తని ఏ విధంగా ఆపాలి అనే ఫైల్ మీద సంతకం పెట్టకుండా రణవీర్ (వినయ్ రాయి) అడ్డుకుంటాడు? అతను ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఈ రణవీర్ కి కేంద్ర మంత్రికి వున్న సంబంధం ఏంటి? ఐరా, అర్జున్ వర్మ ఇంతకు ముందు ఎక్కడ కలిశారు, ఎందుకు విడిపోయారు? ఇలా భారతదేశంలో డంప్ చేస్తున్న చెత్త (గార్బేజ్) వలన ఏమవుతుంది? అర్జున్ వర్మకి వీటన్నిటికీ లింక్ ఏంటి? కేంద్రమంత్రిని అర్జున్ వర్మ ఎలా కాపాడాడు? వీటన్నిటికీ సమాధానాలు కావాలనే 'గాండీవధారి అర్జున' సినిమా చూసి తెలుసుకోవాలి. (Gandeevadhari Arjun film review)
విశ్లేషణ:
దర్శకుడు ప్రవీణ్ సత్తారు 2017 లో 'పిఎస్వి గరుడవేగ' #PSVGarudaVega అనే సినిమా తీసాడు. అది ఒక మంచి గూఢచారి నేపథ్యంలో వచ్చిన యాక్షన్ సినిమా. తెలుగు వాళ్ళు కూడా హాలీవుడ్ రీతిలో ఒక యాక్షన్ సినిమా చెయ్యగలరు అని చూపించగల సత్తా వున్నా సినిమా అది. ఆ సినిమా కన్నా ముందు కూడా ప్రవీణ్ కొన్ని సినిమాలు చేసాడు, అన్నీ బాగానే నడిచాయి, మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఒక అయిదు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రవీణ్ అదే గూఢచారి నేపథ్యంలో ఇంకో యాక్షన్ సినిమా 'ది ఘోస్ట్' #TheGhost అని నాగార్జునతో చేసాడు. ఇది ఒక టోటల్ ఫెయిల్యూర్. గత సంవత్సర విడుదలైంది ఇది. అతని 'గరుడ వేగ' కి ఎంత పేరు వచ్చిందో, అంత పేరు పోయింది ఈ 'ది ఘోస్ట్' సినిమాతో. #GandeevadhariArjunReview ప్రవీణ్ మళ్ళీ అదే గూఢచారి నేపథ్యంలో ఇప్పుడు వరుణ్ తేజ్ తో ఈ 'గాండీవధారి అర్జున' సినిమాతో వచ్చాడు.
అయితే ఇంతకు ముందు 'ది ఘోస్ట్' సినిమాకి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని, ఈ సినిమా కథని రాసుకొని ఉంటాడు అని అందరూ అనుకుంటారు. అలాగే నేరేట్ చెయ్యడం కూడా కొంచెం బెటర్ అవుతాడని అనుకుంటాం. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇంకో చెత్త సినిమాతో వచ్చాడు. ఇక్కడ 'చెత్త' అంటే ఈ సినిమా కథా నేపధ్యం కూడా చెత్తే. అయితే ఇదే నేపధ్యంలో ఇంతకు ముందు తమిళ నటుడు సూర్య (Suriya) చేసిన 'సింగం 3' #Singam3 లో వచ్చింది. ఆ సినిమా కథా నేపధ్యం కూడా ఈ చెత్త (గార్బేజ్) గురించే. (Garbage) అందులో జర్నలిస్ట్ ఉంటుంది, #GandeevadhariArjunReview ఈ సినిమాలో ఒక రీసెర్చ్ చేసే అమ్మాయిని పెట్టాడు. కథ అటూ ఇటూ గా ఉంటుంది. అంతే. పోనీ ప్రవీణ్ ఏమైనా మొదటి నుండి ఆసక్తికరంగా చెప్పాడా అంటే అదీ లేదు. వరుణ్ తేజ్ పాత్రని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. అతను రా ఏజెంట్ గా మొదట్లో చూపించాడు, మళ్ళీ ప్రైవేట్ వ్యక్తికీ పని చేస్తున్నట్టుగా చూపించి అతని దగ్గర నచ్చక క్విట్ అని వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇప్పుడు కేంద్రమంత్రికి సెక్యూరిటీ గా చూపించాడు. కేంద్రమంత్రి కి ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు, ప్రభుత్వం ఎందుకు అలా చేతులు ముడుచుకు కూర్చుంది మరి. అలాగే సాక్షి వైద్య, వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత బలంగా లేదు.
యాక్షన్ సినిమా అనగానే ప్రేక్షకుడిని మొదటి నుండి కథతో పాటు తీసుకుపోవాలి. కానీ ప్రవీణ్ సత్తారు తెర మీద చూపించిన కథ నేరేషన్ ప్రేక్షకుడికి ఆసక్తి లేకుండా చేసింది. చివర్లో నాజర్ (Nassar) స్పీచ్ కొంచెం బాగుంది అనిపిస్తుంది. అలాగే విలన్ ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు. అన్నీ ముక్కలు ముక్కలుగా తీసాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తీసిన కథని తీయడంలో తప్పులేదు, కానీ అది నేరేట్ చేసే విధానంలో ఉంటుంది దర్శకుడు ప్రతిభ. ప్రవీణ్ ఇంకా తాను ఇంతకు ముందు 'ది ఘోస్ట్' సినిమాకి చేసిన తప్పులు తెలుసుకున్నట్టు లేదు. #GandeevadhariArjunReview అందుకే కథలో చాలా లోపాలున్నాయి, దేనినీ సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు, బలంగా కథ రాసుకోలేకపోయాడు. దానికి తోడు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తన చాలా సినిమాలు యూకే లో తీస్తూ ఉంటాడు, ఎందుకంటే అక్కడేదో పేకేజీ లుంటాయి, అక్కడ తీసేస్తే ఆ ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది అని తెలిసింది. అందుకని అక్కడ తీసేస్తున్నారు, ఓటిటి ప్లాట్ ఫార్మ్ తో ముందే మాట్లాడుకుని అమ్మేసుకుంటున్నారు. ఈ సినిమా ఒక పెకేజీలో తీసారని అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల పెట్టిన పెట్టుబడి విడుదలకి ముందే వచ్చేస్తోంది అని టాక్, అందువలన సినిమా కథ, కథనం ఎలా వుంటే ఏంటి అనే ఆలోచన వచ్చేస్తుంది. ఈ 'గాండీవధారి అర్జున' #GandeevadhariArjunReview సినిమా కూడా అటువంటిదే. లండన్ లో తీయడం వలన ఛాయాగ్రహణం బాగుంది, అంటే విజువల్స్ చాలా బాగుంటాయి. అక్కడక్కడా పోరాట సన్నివేశాలు బాగుంటాయి. భావోద్వేగాలు లేవు. అంతే. సంగీతం కూడా అంతంత మాత్రమే. కథ సరిగ్గా కుదరనప్పుడు అనీ మైనస్ లు అవుతాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ఆరడుగుల పొడుగు మనిషి ఒక రా ఏజెంట్ కి ఉండాల్సిన లక్షణాలు వున్నాయి. బాగున్నాడు. పాత్రకి సరిపడా చేసాడు. సాక్షి వైద్య కేంద్ర మంత్రి పీఏ గా బాగుంది. విమల రామన్ (VimalaRaman), అభినవ్ గోమటం (AbhinavGomatam) వాళ్ళ పాత్రల పరిధి మేరకు చేశారు. వినయ్ రాయ్ (VinayRai) ఇంకో హిందీ విలన్ వూరికే ఆలా కనపడతాడు, మొహంలో ఎటువంటి భావోద్వేగం ఉండదు, ఎందుకు ఇలా తెలుగు రాని, తెలియని, ఆ పాత్ర మీద ఆసక్తి లేనివాళ్ళని ముఖ్యంగా విలన్స్ గా తెచ్చి పెడతారో అర్ధం కాదు. ఒక తెలుగు వాడికి అవకాశాం ఇవ్వొచ్చు కదా. రోషిణి బాగా చేసింది. చాలామంది లోకల్ ఆర్టిస్టులు ఉంటారు, అలాగే చాలామంది కనిపిస్తారు.
చివరగా, 'గాండీవధారి అర్జున' సినిమాలో అర్జునుడు చతికల బడ్డాడు, ఎందుకంటే కురుక్షేత్రంలో అర్జునుడికి సారధి సరైన దారి చూపించి దగ్గరుండి యుద్ధం చేయిపించాడు. ఇక్కడ ఈ సినిమాలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ అర్జునుడిని సరిగ్గా చూపించలేక, చతికిలబడేట్టు చేసాడు. అంతే.