Love You Ram film review: నటుడిగా దశరథ్ హిట్, సినిమా ఎలా ఉందంటే...
ABN, First Publish Date - 2023-07-01T13:56:47+05:30
ప్రముఖ దర్శకుడు దశరథ్ నిర్మాతగా, నటుడిగా మొదటిసారి 'లవ్ యు రామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కథ కూడా దశరథ్ అందించాడు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దన్ లీడ్ పెయిర్ కాగా, దశరథ్ స్నేహితుడు డివై చౌదరి దర్శకత్వం చేసాడు. ఈ సినిమా నిన్న థియేటర్స్ లో విడుదల అయింది.
సినిమా: లవ్ యు రామ్
నటీనటులు: రోహిత్ బెహల్, అపర్ణా జనార్దన్, బెనర్జీ, దశరథ్, ప్రదీప్, కార్టూనిస్ట్ మల్లిక్ తదితరులు
కథ: కె దశరథ్
ఛాయాగ్రహణం: సాయి సంతోష్
సంగీతం: కె వేదా
నిర్మాత: కె దశరథ్, డీవై చౌదరి
దర్శకత్వం: డీవై చౌదరి
-- సురేష్ కవిరాయని
'సంతోషం' #Santosham, 'మిస్టర్ పర్ఫెక్ట్' #MisterPerfect లాంటి మంచి క్లీన్ కుటుంబ చిత్రాలను అందించిన దర్శకుడు దశరథ్ (K Dasarath). అలాగే ఇంకో దర్శకుడు తేజ (DirectorTeja) తో కలిపి 'ఫామిలీ సర్కస్', 'నువ్వు నేను' లాంటి సినిమాలకి కూడా కథలు ఇచ్చాడు దశరథ్. అలంటి దశరథ్ ఇంకో రెండు కొత్త అవతారాలు ఎత్తారు, అందులో ఒకటి నిర్మాత, రెండోది నటుడిగా. ఈ రెండు కలిపి 'లవ్ యు రామ్' #LoveYouRamReview అనే సినిమాతో చేసాడు దశరధ్. అతని చిన్ననాటి స్నేహితుడు డి వై చౌదరి (DY Chaudhary) దర్శకుడిగా ఈ 'లవ్ యు రామ్' ఒక చిన్న సినిమాగా విడుదల అయింది. ఇందులో 'నాట్యం' లో నటించిన రోహిత్ బెహల్ (RohitBehal), మలయాళం నటి అపర్ణ జనార్దన్ (AparnaJanardan) లీడ్ పెయిర్ గా నటించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Love You Ram Story కథ:
రామ్ (రోహిత్ బెహల్) నార్వేలో హోటల్ వ్యాపారం చేస్తూ స్థిరపడిన భారతీయ యువకుడు. అతను ఏది ఆలోచించినా తనకు అనుకూలంగా వ్యాపారాత్మక దృష్టితో చూస్తాడు తప్పితే, అవతలి వ్యక్తుల భావోద్వేగాల్ని అసలు పట్టించుకోడు. తన వ్యాపారాలు చూసుకోవడానికి పిసి (దశరథ్) అనే వ్యక్తి ఎప్పుడూ తన దగ్గరుంటాడు. అతను ఈ వ్యాపారంలో భాగం ఇమ్మని అడుగుతూ ఉంటాడు, కానీ రామ్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తాడు. పెళ్లి చేసుకొని భార్యని తన వ్యాపారంలో భాగస్వామిని చెయ్యాలనుకొని కొంతమంది అమ్మాయిలను చూడమని పీసీ కి పురమాయిస్తాడు. #LoveYouRamFilmReview అది కూడా వ్యాపార దృక్పథం తోటే చూస్తాడు రామ్. ఆలా చూస్తున్నప్పుడు దివ్య (అపర్ణ జనార్దన్) ని కలిసి ఇండియా వచ్చి టైము లేదని తొందర తొందరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అని అంటాడు. దివ్య, రామ్ తన చిన్ననాటి స్నేహితుడు అని గ్రహిస్తుంది. మధ్యతరగతి కుటుంబం అయినా, రామ్ చిన్నప్పుడు చెప్పిన మాటలవల్ల దివ్య నలుగురికీ సాయం చేస్తూ ఉంటుంది. అయితే దివ్య తన బాల్య స్నేహితురాలు అని రామ్ గుర్తు పట్టలేకపోతాడు. అయితే ఇప్పటి రామ్ ని చూసిన దివ్యకి అతను పూర్తిగా మారిపోయాడు అని, అన్నీ తనకనుగుణంగా వ్యాపారాత్మకంగా చూస్తున్నాడు అని తెలిసి బాధపడుతుంది. అయితే మరి దివ్య పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? రామ్ కి దివ్య చిన్ననాటి స్నేహితురాలు అని తెలిసిందా? రామ్ సెక్రటరీ పీసీ పాత్ర ఎంతవరకు వుంది? ఇవన్నీ తెలియాలంటే 'లవ్ యు రామ్' సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దశరథ్ కథ అనగానే ఒక్కటి ఊహించుకోవచ్చు, అందరూ చూసేవిధంగా క్లీన్ గా ఉంటుంది అని. ఈ 'లవ్ యు రామ్' #LoveYouRamReview సినిమా కూడా అలానే ఉంటుంది. ఇది కూడా ఒక ప్రేమ కథ, కానీ చిన్న వైవిధ్యం చూపించాడు దశరథ్ కథలో. దర్శకుడు డి వై చౌదరి కి సీరియల్స్ చేసే అనుభవం ఉండటం వలన, ఈ సినిమాలో ఎక్కువమంది టీవీ ఆర్టిస్టులను చూడొచ్చు. ఇదొక చిన్న సినిమా. కథానాయకుడుకి భావోద్వేగాలు అక్కరలేదు, తన వ్యాపారం బాగుంటే చాలు, భార్య అంటే జీతం తీసుకోకుండా ఇంటిపని చేసే పనిమనిషి లేదా ఉద్యోగి అని భావిస్తాడు. చిన్నప్పుడు మంచి లక్షణాలతో వున్న అతను ఎందుకు అలా మారాల్సి వచ్చింది, అలాగే అతన్ని చిన్నప్పటి నుంచి ప్రేమించే కథానాయిక అతను చాలా మారిపోయాడు అని విని ఏమి చేసింది. ఇవన్నీ రచయిత దశరథ్, దర్శకుడు డీవై చౌదరి తెర మీద చూపించే విధానం బావుంది.
కానీ ఇందులో పెద్ద సస్పెన్స్ ఏమీ ఉండదు, ప్రేక్షకుడు ముందు ఏమి జరగబోతోందో వూహించుకుంటాడు. కానీ ఆ చెప్పే విధానంలో ముఖ్యంగా చాలా సరదాగా చెప్పడంతో ప్రేక్షకులకి ఎక్కడా బోర్ అనిపించదు. ముఖ్యంగా దశరథ్, నటుడిగా ఈ సినిమాలో పెద్ద హిట్ అని చెప్పొచ్చు. అతని టైమింగ్, కామెడీ పంచ్ డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. #LoveYouRamFilmReview నిజం చెప్పాలంటే అతనే ఈ సినిమాకి ఒక మూల స్తంభంలా నిలుచున్నాడు. అలాగే అక్కడక్కడా ఎమోషన్స్ సన్నివేశాలు కూడా బాగా ఉంటాయి. కామెడీ బాగా పండింది, అదే ఈ సినిమాకి హైలైట్. అయితే అక్కడక్కడా దర్శకుడు కొన్ని సన్నివేశాలు సాగదీసాడు అనిపించింది. ప్రవీణ్ వర్మ మాటలు బాగున్నాయి, ముఖ్యంగా దశరథ్ కి రాసిన పంచ్ డైలాగ్స్. అలాగే సాయి సంతోష్ ఛాయాగ్రహణం, వేదా సంగీతం కూడా బాగుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, రోహిత్ బెహల్ (RohitBehal) రామ్ గా బాగా సూట్ అయ్యాడు. అతని నటన నీట్ గా వుంది, ఎక్కడా ఓవర్ యాక్టింగ్ కానీ, లేదా తక్కువ చేసుకోవడం కానీ లేదు. పాత్రకి తగ్గట్టుగా చేసాడు. పల్లెటూరి అమ్మాయి దివ్యగా అపర్ణ జనార్దన్ (AparnaJanardan) ఆ పాత్రకి సరిపోయింది. భావోద్వేగ సన్నివేశాల్లో బాగుంది. అలాగే ఈ సినిమాకి హైలైట్ మాత్రం దశరథ్ నటన అని చెప్పాలి. మొదటి నుండి చివరి వరకు దశరథ్ కనపడతాడు, అతని యాక్టింగ్ లో టైమింగ్, కామెడీ ఒకటేమిటి తెగ నవ్వించాడు దశరథ్. దర్శకుడిగా అందరికి తెలిసిన దశరథ్ లో ఇంత నటుడు కూడా ఉన్నదా అనిపిస్తుంది. బెనర్జీ (Banerjee), ప్రదీప్ (Pradeep) అందరూ బాగా సపోర్ట్ చేశారు. చాలామంది టీవీ ఆర్టిస్టులు కనపడతారు. దశరథ్ కుమార్తె సరస్వతి కార్తీక ఇందులో ఒక హిందీ పాటను రాసింది.
చివరగా, అక్కడక్కడా చిన్న చిన్న తప్పులున్నా, 'లవ్ యు రామ్' #LoveYouRamFilmReview సినిమా ఒక క్లీన్ గా సరదాగా సాగే ప్రేమ కథా చిత్రం. సినిమా అంత గ్రేట్ కాదు కానీ, ఇదొక టైం పాస్ మూవీ అని మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బూతులు, రెండర్థాల మాటలు, పోరాట సన్నివేశాలు ఇలాంటివి ఏమీ వుండవు. దర్శకుడిగా అందరికీ తెలిసిన దశరథ్ మొదటిసారిగా తాను నటుడిగా కూడా అద్భుతంగా చెయ్యగలను అని చెప్పాడు. అతనే ఈ సినిమాకి హైలైట్.