Dayaa web series review: ఈమధ్య కాలంలో వచ్చిన క్వాలిటీ, ఆసక్తికరమైన తెలుగు వెబ్ సిరీస్ ఇదే
ABN, First Publish Date - 2023-08-05T14:10:34+05:30
చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన నటుడు జేడీ చక్రవర్తి మొదటి సారిగా ఓటిటి లోకి వస్తున్నాడు 'దయా' అనే వెబ్ సిరీస్ తో. పవన్ సాదినేని దీనికి దర్శకుడు, ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా వుందో చదవండి.
వెబ్ సిరీస్: దయా
నటీనటులు: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య (దివ్య స్పందన), విష్ణుప్రియ, 'జోష్' రవి, పృథ్వీరాజ్ (పెళ్లి), కమల్ కామరాజు, గాయత్రి గుప్తా తదితరులు
ఛాయాగ్రహణం: వివేక్ కాలెపు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు: శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని
రచన, దర్శకత్వం: పవన్ సాధినేని
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar)
-- సురేష్ కవిరాయని
జేడీ చక్రవర్తి (JDChakravarthy) మంచి నటుడు, అలాగే చాలా సినిమాలల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని మెప్పించాడు. అతను నటించిన 'సత్య' #Satya ఒక గుర్తిండిపోయే చిత్రం. ఇప్పుడు అదే జేడీ 'దయా' #DayaaReview అనే వెబ్ సిరీస్ #DayaWebSeriesReview తో ఓటిటిలోకి కూడా ఆరంగేట్రం చేసాడు. జేడీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు పవన్ సాధినేని (PavanSadineni) దర్శకుడు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో విడుదలైంది, తెలుగులో చిత్రీకరించిన ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రమ్య (దివ్య స్పందన) (DivyaSpandana), ఈషా రెబ్బ (EeshaRebba), విష్ణు ప్రియ (VishnuPriya) ఇతర ముఖ్య పాత్రల్లో కనపడతారు. ఈ వెబ్ సిరీస్ ఎలా వుంది, జేడీ చక్రవర్తి మొదటి సారిగా నటించిన 'దయా' #DayaaReview ఎలా ఉందొ చూద్దాం.
Dayaa story కథ:
దయాకర్ లేదా దయా (జేడీ చక్రవర్తి) కాకినాడ హార్బర్ లో ఫ్రీజర్ వేన్ అంటే చేపలు రవాణా చేసే వాహనానికి డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతని భార్య అలివేలు (ఈషా రెబ్బ) గర్భిణి, ఎప్పుడైనా డెలివరీ అవొచ్చు అని డాక్టర్లు చెపుతారు. భార్య ఫోన్ చేసి సాయంత్రం ఆసుపత్రికి వెళ్లాలి అని చెప్పినా, ఎక్కువ డబ్బులు వస్తాయని ఒక కిరాయి ఒప్పేసుకుంటాడు. అయితే అక్కడ లోడ్ ని దించే సమయంలో వేన్ లో ఒక మృతదేహం ఉండటం చూసి షాకవుతాడు. ఇంకో పక్క కవిత నాయుడు (రమ్య) తన పనికి ప్రాముఖ్యత నిచ్చే నిబద్ధతగల జర్నలిస్ట్. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి తన సహచర జర్నలిస్ట్ షబానా (విష్ణుప్రియ) తో కాకినాడ వెళుతుంది. #DayaaReview దయా వేన్ లో వున్న మృతదేహం ఎవరిది? ఎందుకు అతని వేన్ లోకి వచ్చింది? కవిత ఎందుకు కాకినాడ వెళ్ళింది, ఆమె ఎటువంటి స్టోరీ చేయబోతోంది? కవిత భర్త కౌశిక్ (కమల్ కామరాజు) ఎందుకు విడాకులు కోరుకుంటున్నాడు? స్థానిక ఎమ్మెల్యే పెనుమత్స పరశురామ రాజు ఎటువంటివాడు, అతనికి ఈ మృతదేహానికి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ 'దయా' వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ వెబ్ సిరీస్ లోని లోటుపాట్లు గురించి మాట్లాడేముందు, దర్శకుడు పవన్ సాదినేనిని అభినందించి తీరాలి. ఎందుకంటే ఈమధ్య కాలంలో ఒక తెలుగు క్వాలిటీ వెబ్ సిరీస్ తో వచ్చినందుకు. ఎందుకంటే వెబ్ సిరీస్ అంటే చిన్న చిన్న నటుల్ని పెట్టి చుట్టేస్తారు అనే ఆలోచనలో తెలుగు ప్రేక్షకులు వుంటున్నారు, ఆలా ఉండటానికి కూడా ఒక కారణం వుంది, ఎందుకంటే కొందరు అలాంటి చీప్ వెబ్ సిరీస్ లు ఈమధ్య చేశారు. అయితే పవన్ సాధినేని ఆలా కాకుండా మంచి నటీనటుల్ని ఆ పాత్రలకి సరిపడే విధంగా ఎన్నిక చేసుకొని, ఒక క్వాలిటీ వెబ్ సిరీస్ చెయ్యడంతో, ముందు ముందు రెగ్యులర్ దర్శకులు కూడా మంచి వెబ్ సిరీస్ లు తీయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక 'దయా' వెబ్ సిరీస్ లో దర్శకుడు అన్ని హంగులు పెట్టాడు, దీనిలో ఎనిమిది (8) ఎపిసోడ్స్ వున్నాయి. వెబ్ సిరీస్ అనగానే ప్రతి ఎపిసోడ్ చివర ఒక చిన్న ట్విస్ట్ లేదా ఒక ఆసక్తికరమైన అంశంతో ముగిస్తే అది తదుపరి ఎపిసోడ్ చూడటానికి ఉత్సాహం, ఊహాగానం ఇచ్చి ఆలా వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ 'దయా' వెబ్ సిరీస్ ని దర్శకుడు పవన్ అలా రూపొందించాడు. మొదట జేడీ చక్రవర్తిని ఒక మామూలు డ్రైవర్ గా చూపించినా, ముందు ముందు అతని విశ్వరూపం చాలా ఆసక్తికరంగా చూపించాడు. అలాగే జోషి రవి పాత్ర కూడా మొదట్లో సరదాగా సాగుతూ చివరికి సీరియస్ గా మారిన వైనం కూడా బాగుంది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత నిచ్చి ఈ వెబ్ సిరీస్ చాలా ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు.
ఎప్పుడైతే డెడ్ బాడీ దయా వేన్ లోకి వచ్చిందో అక్కడ నుండి కథ మలుపులు తిరుగుతూ ఉంటుంది. అలాగే దయా కుటుంబ నేపధ్యం, అతను సమస్యల వలలో చిక్కుకోవటం, ఎలా తప్పించుకున్నాడు, అలివేలు పోలీసుల నుంచి తప్పించుకోవటం, జర్నలిస్ట్ కవిత నాయుడు ఆఫీస్ లో ఆమె ఎంత నిబద్ధతో పని చేస్తుంది, ఆమె నేపధ్యం ఆసక్తికరంగా మలిచాడు. #DayaaReview అయితే మొదటి నాలుగు ఎపిసోడ్స్ కొంచెం స్లోగా సాగినా అయిదవ ఎపిసోడ్ నుంచి కథ చాలా మలుపులు తిరిగి చివరివరకు ఒక్క సన్నివేశం కూడా మిస్ అవ్వకూడదు అన్నంతగా సాగుతుంది. కొన్ని ఎపిసోడ్స్ అయ్యాక దయానే ఆ డెడ్ బాడీ తన వేన్ లో ఎక్కించుకొని, ఆలా నటిస్తున్నాడేమో అన్న అనుమానం కూడా వచ్చింది.
అయితే ఇందులో కొన్ని లోటుపాట్లు కూడా వున్నాయి. కవిత, కౌశిక్ మధ్య వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కొంచెం బోర్ కొట్టించాయి. అలాగే ఎమ్మెల్యే పరశురామ్ శృంగార చేష్టలు, ఆయనికి అమ్మాయిల మీద వుండే మోజు కాకుండా, అయన రాజకీయ నేపధ్యం చూపిస్తే ఇంకా ఆసక్తికరంగా ఉండేది. అలాగే వెబ్ సిరీస్ కదా బూతులు పెట్టాలి అని పెట్టేసేకన్నా, అవి తగ్గిస్తే బాగుండేది. అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఇంకా కొంచెం అర్థం అయ్యే రీతిలో పెడితే బాగుండేది. ఎమ్మెల్యే కి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. చివరికి వెళుతున్న కొద్దీ ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదీ, దయా ఎవరు అన్న ఆసక్తి బాగా పెరుగుతుంది. మొత్తానికి దర్శకుడు పవన్ సాదినేని ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తీసి సఫలం అయ్యాడు అని చెప్పాలి. (Daya Web Sereis Review)
ఇక నటీనటుల విషయానికి వస్తే, జేడీ చక్రవర్తి ఆల్రెడీ నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులో మరోసారి తన నటనతో మెప్పించాడు. అతను ఏ పాత్ర చేసినా చాలా సహజంగా ఉంటుంది. డ్రైవర్ గా ఒదిగిపోయాడు. అలాగే మొదటి మూడు నాలుగు ఎపిసోడ్స్ లో ఎంతో భయస్తుడిగా, వినికిడి సమస్య వున్న మంచి డ్రైవర్ గా బాగా మెప్పించాడు. తరువాత ఎపిసోడ్స్ అతను ప్రచారాల్లో భాగంగా చెప్పినట్టుగా 'సత్య' కనపడతాడు. రెండు విభిన్న కోణాల్లో బాగా చేసి చూపించాడు. ఆ పోరాట సన్నివేశంలో దయా, జేడీ అంటే ఏంటో చూపించాడు. ఇక ఈషా రెబ్బ కి చిన్న పాత్రే అయినా అన్ని ఎపిసోడ్స్ లో కనపడుతుంది, ఆమె గర్భిణి స్త్రీగా బాగా అలరించింది. బిందె ఎక్కి మీదనుండి ఎదో తీయబోతుంటే అయ్యో పడిపోతుందేమో అని చిన్న కలవరం కూడా వస్తుంది, అంటే అంత బాగా నటించి మెప్పించింది. రమ్య (దివ్య స్పందన) జర్నలిస్ట్ కవిత గా మంచి పాత్ర చేసింది. ఆమె ఆ పాత్రకి ఒక గౌరవాన్ని, హుందాతనాన్ని తెచ్చింది. జోష్ రవికి తన నటన నిరూపించుకోవడానికి ఒక మంచి పాత్ర ఇందులో దొరికింది, అతను కూడా దానికి తగ్గట్టుగా నటించి చూపించాడు. విష్ణుప్రియ, కమల్ కామరాజు, పృథ్విరాజ్ (పెళ్లి ఫేమ్), గాయత్రీ గుప్త అలాగే మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు. ఆ మూగి కిల్లర్ పాత్ర ఎవరు వేసారో కానీ భలే చేసాడు. శ్రవణ్ సంగీతం ఈ వెబ్ సిరీస్ లో సన్నివేశాలను ఎలివేట్ చెయ్యడానికి ఎంతో ఉపకరించింది. అతను ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అలాగే ఛాయాగ్రహణం కూడా, విజువల్స్ అన్నీ క్వాలిటీతో ఎంతో బాగున్నాయి.
చివరగా, దర్శకుడు పవన్ సాధినేని రెండు సినిమాలు చేసి దర్శకుడిగా అక్కడ మెప్పించాడు, ఇప్పుడు ఈ 'దయా' #DayaaReview వెబ్ సిరీస్ తీసి ఇక్కడ ఓటిటి లో కూడా మెప్పించాడు. 'సూర్యుడు అస్తమిస్తే యుద్ధం పూర్తయింది అని కాదు...' అనే డైలాగ్ తో ముగిసినా, దీనికి రెండో సీజన్ వుంది అని చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే ఈ సీజన్ లో ప్రేక్షకులకి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు వున్నాయి... అందులో ఇంతకీ ఈ దయా ఎవరు అన్నది ముఖ్యమైనది. ఇవన్నీ తెలియాలంటే రెండో సీజన్ కొరకు ఎదురుచూడాల్సిందేనేమో !