Ahimsa Film Review: ప్రేక్షకుడికి హింస, ఇదొక అరాచకం
ABN, First Publish Date - 2023-06-02T13:42:32+05:30
దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు అభిరామ్ ఆరంగేట్రం 'అహింస' అనే సినిమాతో చేసాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. సీనియర్ దర్శకుడు తేజ, అభిరామ్ గొప్ప ప్రొడక్షన్ సంస్థ వున్న సురేష్ బాబు కుమారుడు కావటంతో ఈ సినిమా కొంచెం అయినా బాగుంటుంది అని ప్రేక్షకులు అనుకుంటే మాత్రం...
సినిమా: అహింస
నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, సద, బిందు చంద్రమౌళి, కల్పలత, రజత్ బేడీ, కమల్ కామరాజు, దేవి ప్రసాద్, రవి కాలే తదితరులు
సంగీతం: ఆర్ఫీ పట్నాయక్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: కిరణ్
కథ, స్క్రీన్ ప్లే, పోరాటాలు, దర్శకత్వం: తేజ
-- సురేష్ కవిరాయని
దర్శకుడు తేజ ఎక్కువగా కొత్తవాళ్లతో సినిమాలు చేస్తూ వుంటాడు. తన మొదటి సినిమా 'చిత్రం' #Chitram నుండి అతను ఎప్పుడూ కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తూ బాగా సక్సెస్ అయ్యాడు. అందుకే తేజ (Director Teja) అంటే ఒక స్టయిల్ వుంది, తనదైన మార్కు కూడా వేసుకున్నాడు. అలాంటి తేజ, ఇప్పుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (D Suresh Babu) కుమారుడు, దివంగత రామానాయుడు (Ramanaidu) మనవడు అయిన అభిరామ్ దగ్గుబాటి (AbhiramDaggubati) ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ 'అహింస' #AhimsaFilmReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో చాలామంది కొత్తవాళ్ళని పరిచయం చేసాడు, కథానాయిక గీతకా తివారితో (GeetikaTiwari) సహా. అయితే సంగీతం మాత్రం తన పాత మిత్రుడు ఆర్ఫీ పట్నాయక్ (RPPatnaik) కి ఛాన్స్ ఇచ్చాడు. ఇంకో ప్రముఖ #AhimsaFilmReview నిర్మాత కిరణ్ ఈ సినిమాకి నిర్మాత. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Ahimsa story కథ:
రఘు (అభిరామ్ దగ్గుబాటి) చీమకు కూడా అపకారం తలపెట్టని ఒక యువకుడు. తన గ్రామంలో మరదలు అహల్య (గీతికా తివారి) తో, మిగతా గ్రామ ప్రజలతో ఆనందంగా ఉంటూ ఉంటాడు. రఘు, అహల్య ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. వాళ్లిద్దరూ ఒకరోజు నిశ్చితార్ధం చేసుకుంటారు, అది అయ్యాక అహల్య ఇంటికి వెళుతుండగా ఇద్దరు యువకులు ఆమెని దారుణంగా బలాత్కారం చేసి వెళ్ళిపోతారు. విషయం తెలిసిన రఘు తన మరదలిని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసి తనకు తెలిసిన లాయర్ లక్ష్మి (సద) తో వాళ్ళిద్దరికీ శిక్ష పడేలా చేయాలనుకుని కేసు పెడతాడు. కానీ ఆ కుర్రాళ్ళ తండ్రి బాగా డబ్బు, పరపతి వున్నవాడు కావటంతో రఘు లాయర్ ఎక్కడిక్కడ ఓడిపోతూ ఉంటుంది. ఈలోగా అవతలి వాళ్ళు, లాయర్ ని, లాయర్ భర్తని కూడా చంపేస్తారు. అయితే రఘు మరదలికి తెలివి రావటంతో ఆమె కోర్టుకు వచ్చి చెప్తే మళ్ళీ కేసు స్ట్రాంగ్ అయి వాళ్ళకి శిక్ష పడటం ఖాయమని తెలుస్తుంది. అందుకే అహల్యని కూడా చెంపేయాలని చూస్తారు అవతలి వాళ్ళు. అప్పుడు రఘు అహల్యని ఎలా కాపాడుకున్నాడు, చీమకి కూడా హాని తలపెట్టని రఘు హింసా మార్గం పట్టి ఆ ఇద్దరి కుర్రాళ్ళని ఏమి చేసాడు అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు తేజ అనగానే ఆ సినిమా మీద కొంచెం అయినా అంచనాలు ఉంటాయి. కొత్తవాళ్లతో చేసినా కూడా ఎన్నో విజయాలు అందుకున్నాడు తేజ. అందుకని అతని సినిమా అంటే కొంచెం అర్థవంతంగా ఉంటుంది అని భావిస్తారు. 'అహింస' #AhimsaReview సినిమాతో దగ్గుబాటి అభిరామ్ ని పరిచయం చేసాడు తేజ. రామానాయుడు కి మాటిచ్చాను అందుకే అతని మనవడిని నేను పరిచయం చేసాను అని సినిమా విడుదలకి ముందు చెప్పాడు తేజ. అయితే రామానాయుడు, అతని తరువాత అతని కుమారుడు సురేష్ బాబు ఎన్నో విజవంతంగా సినిమాలు ప్రొడ్యూసర్ చేశారు. రామానాయుడు మనవడి సినిమా అనగానే, అదీ తేజ దర్శకుడు కావటంతో కొంచెం అయినా సినిమా బాగుంటుంది అనుకుంటారు. కానీ తేజ ఈ సినిమాని ఏదో రామానాయుడికి మాటిచ్చాడు కాబట్టి తప్పక తీసినట్టుగా అనిపించింది.
సినిమా మొదలవ్వటమే పోలీస్ ఆఫీసర్ రవి కాలే, తప్పిపోయిన దుశ్యంతరావు అనే అతని కోసం వెతుక్కుంటూ వెళతాడు. ఆలా ఆ ఫైల్ చదువుతుంటే ఈ సినిమా కథ మొదలవుతుంది. ఇక అక్కడ నుండి ప్రేక్షకులకు కష్టాలు మొదలవుతాయి. అసలు ఈ కథ తేజ రాశాడా, లేక వేరే ఎవరితో అయినా రాయించాడా అనే అనుమానం వెంటనే వచ్చేస్తోంది. తలా, తోకా లేకుండా ఒక లాజిక్ లేకుండా, కథ అతనిష్టం వచ్చినట్టు తీసేసాడు. అది ప్రేక్షకులకు నచ్చుతుందా నచ్చదా అనే అనుమానం కూడా అతనికి కలగలేదు. అతనే అన్నాడు సినిమా విడుదలకి ముందు, ట్రైలర్ చూసి వస్తారు ప్రేక్షకులు అని. ఇప్పుడు ప్రేక్షకులు చాలా తెలివి మీరారు, అలాగే చాలా అప్డేట్ అయ్యారు కూడా.
కానీ దర్శకుడు తేజ మాత్రం ఇంకా తాను రెండు దశాబ్దాల క్రితం తీసిన 'జయం' దగ్గరే ఆగిపోయాడు. అక్కడ నుండి కొంచెం అతను ముందుకు వచ్చి ఇప్పటి ప్రేక్షకులకి ఏమి కావాలి, ఎలాంటివి కావలి అని ఆలోచిస్తే బాగుండేది. పోనీ తీసిన కథలో కొంచెం అయినా లాజిక్ ఉందా అంటే అదీ లేదు. ఆ కోర్ట్ సన్నివేశాలు అయితే మరీ బోర్. ఇందులో ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా లేదు. దర్శకుడు తేజ ఒక గొప్ప దర్శకుడు అతని కెరీర్ మొదట్లో ఎన్నో విజయవంతమైన, గొప్ప సినిమాలు తీసాడు. ఈ 'అహింస' #AhimsaFilmReview కి వచ్చేసరికి ఏమైంది తేజ టాలెంట్, అతని ప్రతిభ ఎందుకు ఇలాంటి సినిమా తీసాడు అనిపిస్తుంది. అలాగే ఎక్కువ సినిమాల్లో తేజ తన లీడ్ పెయిర్ ని అడవుల చుట్టూ తిప్పుతూ ఉంటాడు. ఇందులో కూడా అంతే. కానీ ఎందుకో అతనికే తెలియదు. కథలో లాజిక్ లేదు, విషయం లేదు, కొన్ని పాత్రలు ఎందుకు పెట్టాడో, కొన్ని సన్నివేశాలు ఎందుకు తీసాడో తేజకే తెలియాలి. దానికి తోడు చాలా సన్నివేశాలు సాగదీసాడు. ఇది 'అహింస' అని పేరు పెట్టినా, ప్రేక్షకుడికి మాత్రం హింసే.
ఇక నటీనటుల విషయానికి వస్తే, అభిరామ్ దగ్గుబాటి కి ఇది మొదటి సినిమా. #AhimsaFilmReview అతను ఇంకా చాలా హోమ్ వర్క్ చేసి ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది. మొహంలో ఒక్క అభినయమన్నా కనపడదు. అసలు దర్శకుడు అభిరామ్ మొహాన్ని ఎక్కడా చూపించకుండా జాగ్రత్త పడ్డాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే అభిరామ్ డైలాగ్స్ చెపుతుంటే, వేరే వాళ్ళని చూపిస్తూ ఉంటాడు. ఇంత కష్టపడే బదులు, అభిరామ్ నేర్చుకున్నాకే ఆరంగేట్రం చేయొచ్చు కదా. అతను ఇంకా చాలా కష్టపడాలి, నేర్చుకోవాలి. ఇక గీతికా తివారి బాగా చేసింది, అభినయయించింది. ఆమెకి మంచి భవిష్యత్తు వుంది. సద (Sada) లాయర్ గా సూట్ అయింది. అలాగే రజత్ బేడీ (RajatBedi) కూడా ఒకే. రవి కాలే (RaviKale) ఆఫీసర్ గా ఓవర్ యాక్టింగ్, అలాగే విలన్స్ గా వేసిన వాళ్ళు ఒకరిని మించి ఇంకొకరు ఓవర్ యాక్టింగ్ చేసి బోర్ కొట్టించారు. సమీర్ రెడ్డి (SameerReddy) ఛాయాగ్రహణం బాగుంది, ఆర్ఫీ పట్నాయక్ సంగీతం పరవాలేదు.
చివరగా, తేజ తీసిన ఈ 'అహింస' ప్రేక్షకుడికి చాలా హింస పెడుతుంది. సినిమా ఎంత తొందరగా అయిపోతుందా అని ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు గొప్ప దర్శకులు కూడా ఎక్కడో తప్పు చేస్తుంటారు అనే దానికి ఈ సినిమా ఉదాహరణ. తేజ లాంటి దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం, దానికి తోడు ఒక పెద్ద ప్రొడక్షన్ సంస్థ నుండి వచ్చిన కుర్రాడు ఇలాంటి తలా, తోకా లేని సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓటిటి లో కూడా చూడటానికి ఇబ్బంది పడాల్సి వస్తుందేమో.