Anger Tales Web Series Review: బిందు మాధవి, వెంకటేష్ మహా అదరగొట్టారు
ABN, First Publish Date - 2023-03-09T13:51:09+05:30
యువ దర్శకుడు నితిన్ ప్రభల తిలక్ నాలుగు కథలను తీసుకొని 'యాంగర్ టేల్స్' అనే వెబ్ సిరీస్ గా తీసాడు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయింది. ఈ నాలుగు కథలు ఒకదానికొకటి సంబంధం లేదు కానీ కోపం (యాంగర్) అన్నిటిలో ప్రధానం. మరి అవి ఎలా వున్నాయో ఏంటో చూడండి
వెబ్ సిరీస్: యాంగర్ టేల్స్ (Anger Tales)
నటీనటులు: తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian), సుహాస్, వెంకటేష్ మహా, బిందు మాధవి, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య తదితరులు
ఛాయాగ్రహణం : అమర్ దీప్, వినోద్ కె బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే ఆరోన్
సంగీతం : స్మరణ్ సాయి
దర్శకత్వం : నితిన్ ప్రభల తిలక్
నిర్మాతలు : శ్రీధర్ రెడ్డి, సుహాస్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
-- సురేష్ కవిరాయని
చాలామంది యువ దర్శకులకు ఇప్పుడు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి ఓ.టి.టి ఒక మంచి అవకాశం లా కనపడుతోంది. ఇంతకు ముందు కొన్ని వెబ్ సిరీస్, సినిమాలు చూసాం, ఇప్పుడు ఇంకో యువ దర్శకుడు నితిన్ ప్రభల తిలక్ (Nithin Prabhala Tilak) 'యాంగర్ టేల్స్' (Anger Tales) అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం చేసేడు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో విడుదల అయింది. 'కలర్ ఫోటో' (Colour Photo), 'రైటర్ పద్మభూషణ్' (Writer Padmabhushan) సినిమాలతో మంచి విజయాలు అందుకున్న నటుడు సుహాస్ (Actor Suhas) ఈసారి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాత గా మారాడు. అతను ఇంకో నిర్మాత శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), మడోన్నాసెబాస్టియన్ (Madona Sebastian), ఫణి ఆచార్య, వెంకటేష్ మహా (Venkatesh Maha), బిందు మాధవి (Bindu Madhavi), రవీంద్ర విజయ్ (Ravindra Vijay), సుహాస్ (Suhas) తదితరులు నటించారు. నాలుగు కథలతో రూపొందిన ఆంథాలజీ సిరీస్ ఇది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. (Anger Tales review)
Ranga story రంగా కథ:
రంగ (వెంకటేష్ మహా) ఒక స్టార్ హీరో అభిమాని. ఆ హీరో నటించిన 'బ్లాస్టర్' అనే సినిమా బెనిఫిట్ షో వేయడానికి రంగ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తాడు. బెనిఫిట్ షో టికెట్ రూ.70 టికెట్టును 1200 వందలకు అమ్ముతాడు. రంగ ఇంకా మిగతా అభిమానులు బ్యానెర్లు కట్టి, టపాకాయలు కొని, పెద్ద హంగామా చేసి రాత్రి ఎనిమిది గంటలకు షో అని అందరికి చెప్తాడు. కానీ ఆ షో ఆ టైం కి కాకుండా, ఆలా గంట గంట పొడిగిస్తూ వస్తూ వుంటారు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరకి, థియేటర్ మేనేజర్ ఇలా టెన్షన్ పడుతూ రంగా తన హీరో షో ఈ టైం కి అయినా పడాలి అని తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో పచ్చబొట్టు శీను (సుహాస్) ఆ షోకు వచ్చి, షో పడకపోతే గొడవ చేస్తా అంటాడు. రంగాకు, శీనుకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఆ ఆవేశంలో సినిమా ప్లాప్ అయితే, శీను ఏది చెప్తే అది చేస్తా అంటాడు రంగా. ఇంతకీ బెనిఫిట్ షో ఎన్ని గంటలకి పడింది? సినిమా ప్లాప్ అయిందా హిట్ అయిందా? సినిమా అయ్యాక రంగా ఏమి చేసాడు? ఇవన్నీ చూడాలనే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
Pooja story పూజ కథ:
పూజ (మడోన్నా సెబాస్టియన్), రాజీవ్ (తరుణ్ భాస్కర్) భార్యా భర్తలు, శాఖాహారం మాత్రమే తింటారు, శాఖాహారం తినే కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో ఉంటూ వుంటారు. ఎగ్ కూడా మాంసాహారము అని ఆ కుటుంబం లో ఏంటి, ఆ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో కూడా నిషిధ్ధం. అయితే పూజ చాలా నీరసంగా వుంది అని అందుకోసం ఎగ్స్ తినమని డాక్టర్ చెబుతుంది. ఆ విషయం ఇంట్లో చెపితే ఒప్పుకోరు అని తెలిసినా, మెల్లగా భర్త రాజీవ్ (తరుణ్ భాస్కర్)కు చెపుతుంది. అతను ఎగ్స్ తినమని ఏ డాక్టర్ చెప్పారు ఆలా కాదు అని ఆయుర్వేద వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి కాషాయం ఇప్పిస్తాడు. అప్పుడు పూజ, భర్తకి, ఆమె అత్తయ్యకి తెలియకుండా కోడిగుడ్లు తీసుకొచ్చి ఇంట్లో దాచి వాళ్ళు లేనప్పుడు కూర, ఆమ్లెట్ చేసుకొని తింటూ ఉంటుంది. అయితే ఈ విషయం ఎన్నాళ్ళు దాగుడు, అపార్ట్మెంట్స్‌లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు పంచాయితీ పెట్టారు ఎవరు తిన్నారు అని? పూజ దొరికిపోయింది? గుడ్డు తినవద్దని చెప్పిన భర్తకి, అత్తయ్యకి పూజ ఎలాంటి షాక్ ఇచ్చిందో తెలియాలంటే చూడాల్సిందే.
Radha story రాధ కథ:
రాధ (బిందు మాధవి) అతని భర్త (రవీంద్ర విజయ్) ఒక చిన్న అద్దె కొంప లో ఉంటూ కాపురం చేస్తూ వుంటారు. రాధ హౌస్ వైఫ్ కావటం తో ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి మధ్యాహ్నం పడుకోవటం అలవాటు, లేదా తలనొప్పి వస్తుంది. అయితే ఆ ఇంటి ఓనర్ పైన ఉంటుంది. ఆమె వీళ్ళని కాళీ చెయ్యమనకుండా తన బంధువులు వచ్చినప్పుడు రోజూ మెట్ల మీద కూర్చుని బాతాఖానీ పెట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు. గట్టిగా నవ్వటం వలన రాధ కి నిద్ర పట్టకపోగా, తలనొప్పి ఎక్కువ అవుతుంది. భర్త డాక్టర్ దగ్గరకు తీసుకువెళితే మైగ్రేన్ ఉందని తెలుస్తుంది. రాధ ఒకరోజు ఓనర్ కి గట్టిగా మాట్లాడుకోకుండా నెమ్మదిగా మాట్లాడండి అని చెపుతుంది. చెప్పిన తర్వాత కూడా ఓనర్స్ తీరు మారదు. భర్త కూడా రాదనే తప్పు పడతాడు. ఇంకో పక్క ఎదురింటావిడ బట్టలు రాధకి కొట్టడానికి ఇస్తుంది కానీ, డబ్బులు మాత్రం ఎగ్గొడుతూ ఉంటుంది. అది ఇంకొక కోపం రాధకి. ఇలా ఇద్దరితో పడలేని రాధ చివరికి ఏం చేసింది? ఓనర్స్ ఏమన్నారు? తెలియాలంటే చూడాలి.
Giridhar story గిరిధర్ కథ:
గిరిధర్ (ఫణి ఆచార్య) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఉద్యోగి. పెద్దమ్మతో (సుధ) ఉంటూ ఉంటాడు. ఆమె టీవీ లో వస్తున్నజాతకాలు చెప్పే అతనికి కాల్ చేసి అడుగుతూ ఉంటుంది గిరిధర్ గురించి, అతను మూడేళ్ళ వరకు అవదు అంటాడు. అయితే గిరిధర్ కి 33 ఏళ్ళు అయినా, జుట్టు పెద్దగా ఉండదు, చాలా ఊడిపోయింది. దాంతో అమ్మాయిలు నచ్చక చాల పెళ్లి సంబంధాలు మిస్ అవుతాయి. ఒక పక్కనే హెల్మెట్ లేదు అని చలానాలు కడుతూ ఉంటాడు, ఇతని బాధ చూడలేక పోలీసులు ఇతనికి ఒక హెల్మెట్ గిఫ్ట్ ఇస్తారు.హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటానంటే పెద్దమ్మ (సుధ) ఒప్పుకోదు, లక్షన్నర అవుతుంది అని. ఈలోగా ఉద్యోగం కూడా సరిగా చేయకపోవటం వలన అది కూడా పోతుంది. అదే రోజు ఒక సంబంధం వస్తుంది, కాన్సుల్ అవుతుంది. ఇంట్లో చిన్న తగాదా అవుతుంది, మర్నాడు ఉదయం లేచేసరికి పెద్దమ్మ మరణిస్తుంది. ఆమె ఇన్సూరెన్స్ డబ్బులతో గిరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటాడు. కానీ హెల్మెట్ పెట్టుకోవటం వలెనే జుట్టు సమస్య అని తెలుస్తుంది. ఆ బట్టతల వలన అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, చివరికి అతను ఏమి చేసాడో తెలిస్తే నవ్వాపుకోలేరు. గిరిధర్ ఏమి చేసాడు అన్నది చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు నితిన్ ప్రభల తిలక్ నాలుగు కథలను తీసుకున్నాడు. నాలుగు కథలూ వేరు వేరుగానే ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం లేదు. కానీ నాలుగు కథల్లో ఒకటే భావోద్వేగం ఉంటుంది. అదే కోపం (యాంగర్). ఈ నాలుగు కథల్లో కూడా కోపం వస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఏమి చెయ్యలేని పరిస్థితి, కానీ కోపం మరీ అధికమయితే మాత్రం ఎదో ఒకటి చేస్తారు. ఈ నాలుగు కథల్లో నలుగురి గురించి చెప్పి, వాళ్ళు చివరికి ఏమి చేశారు అన్నది దర్శకుడు తీసుకున్న పాయింట్.
అయితే ఇందులో రెండు కథలు మాత్రం చాలా బాగున్నాయి. రంగా, రాధ కథలు చాలా అద్భుతంగా చూపించాడు, అలాగే స్క్రీన్ మీద చూపించాడు కూడా. ఇంకా మిగతా రెండు కథల్లో పూజ కథ మాత్రం పరవాలేదు అనిపిస్తుంది. అయితే గుడ్లు తింటే నీరసం పోతుంది అని డాక్టర్ చెపితే, అది భర్తకి చెప్పడానికి సంశయించి చివరికి చెపుతుంది. కానీ ఒప్పుకోదు. అయితే ఈ ఎపిసోడ్ కొంచెం దర్శకుడు సాగదీశాడు అనిపించింది. ఎందుకంటే హోటల్ కి వెళ్లి తినాలనుకోవటం, ఇంట్లో కొంచెం చూపించింది చూపించి బోర్ కొట్టించాడు కొంచెం. అయితే బొమ్మరిల్లు సినిమాలో తండ్రిలా, ఇందులో భర్త ఉంటాడు. భార్య ఏమి తినాలి, ఏమి చెయ్యాలి, ఏమి కావాలి అన్నీ భర్తే చెపుతూ ఉంటాడు. భార్య ఏమి తినాలో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది. నిజ జీవితం లో కూడా వుంటారు ఇలా, కానీ ఈ కథలో కొంచెం అదే మిస్ అయ్యాడు. అయితే ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ బాగుంది. (Anger Tales Web Series)
అలాగే గిరిధర్ కథ కూడా అంతాగా అనిపించలేదు. అందులో కూడా చాలా సన్నివేశాలు సాగదీస్తూ పాయింట్ కి రాలేకపోయాడు దర్శకుడు. కోర్టుకు ఎందుకు వెళ్ళాడు అన్నది ముందుకు తెచ్చి, ఎందుకు వెళ్ళాడో కథ నేరేట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. భావోద్వేగాలు కూడా అంతగా లేవు ఆ కథలో. బట్ట తల మీద ఆమధ్య ఏవో రెండు సినిమాలు కూడా వచ్చాయి. దర్శకుడు ఈ కథ మీద కొంచెం హోమ్ వర్క్ చేసి తీసి ఉంటే బాగుండేది. (Anger Tales Web Series)
ఇంకా నటీనటుల విషయానికి వస్తే పూజ కథలో తరుణ్ భాస్కర్, మడోన్నాసెబాస్టియన్ బాగా నటించారు. తరుణ్ భాస్కర్ చాలా సహజంగా నటించాడు. ఇంకో కథలో గిరిధర్ గా ఫణి ఆచార్య బాగానే నటించాడు, కానీ దర్శకుడు ఆ కథని, కథనాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు.
ఇంకా రాధ కథలో రాధగా బిందు మాధవి నటన నిజంగా హైలైట్. ఈ మొత్తం నాలుగు కథల్లో ఆమె కథ మాత్రం సూపర్. బిందు మాధవి చాలా సినిమాల్లో నటించింది, అందువల్ల ఈ రాధ పాత్రని బాగా చెయ్యగలిగిందేమో అనిపించింది. ఎందుకంటే అనుభవం చాలా వున్నా నటి ఆమె ఈ మొత్తం నాలుగు కథల్లో. ఒక సగటు మధ్య తరగతి కుటుంబం గా రాధ, ఆమె భర్తగ రవీంద్ర ఇద్దరూ బాగా చేశారు. రవీంద్ర భాషలో కొంచెం తమిళం యాస బాగా కనపడుతోంది, తెలుస్తోంది. (Anger Tales Review) రాధగా బిందుమాధవి అదరగొట్టింది. ఒక మధ్య తరగతి భార్య గా ఎలా ఉండాలో అలానే ఆ పాత్రలో నటించి చూపించింది బిందు మాధవి. సినిమాల్లో ఎక్కువ ఈమధ్య కనిపించని బిందు మాధవికి ఈ రాధ పాత్ర మాత్రం తన నటన కనపరచడానికి చూపించే జీవించారుపాత్ర.
అలాగే ఇంకో కథలో హీరో అభిమానిగా వెంకటేష్ మహా మంచి నటన కనబరిచారు. దర్శకుడిగా వెంకటేష్ మహా అందరికి తెలుసు, కానీ అతని నటన గురించి మాత్రం ఈ కథ ఒక్కటి చాలు. (Anger Tales Review) ఒక స్టార్ హీరో అభిమాని ఎలా ఉంటాడో అలానే చేసి చూపించాడు వెంకటేష్. దర్శకుడు కూడా ఈ ఎపిసోడ్ బాగా స్క్రీన్ మీద చూపించాడు, నడిపించాడు కూడా. మధ్య మధ్యలో కొంచెం బూతులు మాట్లాడించినా, ఈ ఎపిసోడ్ మాత్రం ఇంకో హైలైట్ అనే చెప్పాలి. ఇంకా ఇందులోనే సుహాస్ కూడా పచ్చబొట్టు శీను గా కనిపిస్తాడు. సుహాస్ నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు, ఇందులో కూడా బాగా చేసాడు. ఈ నాలుగు కథలకి సంగీతం ముఖ్యం, అది స్మరణ్ సాయి అందించాడు. తనే ఈ ఎపిసోడ్స్ అన్నిటికీ మూల స్థంభం అని చెప్పొచ్చు. అతని నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. (Anger Tales Review)
చివరగా, 'యాంగర్ టేల్స్' (Anger Tales Review) అనే వెబ్ సిరీస్ లో రెండు కథలు మాత్రం చాలా బాగుంటాయి. రాధ, రంగ, ఈ ఇద్దరుగా బిందు మాధవి, వెంకటేష్ మహా నటన సింప్లీ సూపర్బ్. పూజ కథ కూడా పరవాలేదు, కానీ గిరిధర్ కధే బాగోలేదు. అయినా కూడా దర్శకుడు ప్రభల తిలక్ కి మంచి మార్కులే వేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి కథలు తీయడం అంత ఈజీ కాదు, కానీ బాగానే చూపించాడు. తెలుగు వెబ్ సిరీస్ లు ఈమధ్య కొంచెం క్వాలిటీ తో వస్తున్నాయి, ఇది కూడా అందులో ఒకటి, అందుకని ఇది చూడండి, బాగుంటుంది.