Vishwak remembers Trivikram : విశ్వక్‌ని చూస్తే త్రివిక్రమ్ గుర్తొచ్చారు!
ABN, First Publish Date - 2023-03-21T00:43:45+05:30
‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘అలా వైకుంఠపురములో’, ‘పాగల్’ చిత్రాలతో ఆకట్టుకొన్న కథానాయిక నివేదా పేతురాజ్. ఇప్పుడు విశ్వక్‌సేన్‌తో ‘దాస్‌కా ధమ్కీ’ కోసం జోడీ కట్టింది...
‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘అలా వైకుంఠపురములో’, ‘పాగల్’ చిత్రాలతో ఆకట్టుకొన్న కథానాయిక నివేదా పేతురాజ్. ఇప్పుడు విశ్వక్‌సేన్‌తో ‘దాస్‌కా ధమ్కీ’ కోసం జోడీ కట్టింది. ఉగాది కానుకగా బుధవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చిన ‘దాస్’ కబుర్లు ఇవీ...
‘‘విశ్వక్‌తో ఇది రెండో సినిమా. ఇది వరకు మేం ‘పాగల్’లో కలసి నటించాం. ఆ సమయంలోనే ‘ఓరి దేవుడా’లో నటించమని అడిగారు. కానీ ఆ పాత్ర నాకు సరిపోదని ‘నో’ చెప్పా. విశ్వక్ సినిమాలో నటిస్తావా? అంటూ రెండు మూడు ఆఫర్లు వచ్చాయి. వాటిని కూడా పక్కన పెట్టా. ‘దాస్ కా ధమ్కీ’ కథ మాత్రం చాలా బాగా నచ్చింది. అందుకే ఒప్పుకొన్నా’’
‘‘నన్ను నేను కొత్తగా చూసుకొనే అవకాశం ఈ సినిమాతో దక్కింది. ఇందులో ఎప్పుడూ లేనంతగా డాన్సులు చేశాను. అవి చూసి చాలామంది అభిమానులు ‘మిమ్మల్ని ఇలా ఎప్పుడూ చూడలేద’ంటూ అభినందిస్తున్నారు. ‘పాగల్’తో విశ్వక్ నటుడిగా తెలుసు. ఈ సినిమాలో తనలోని దర్శకుడ్నీ చూశా. నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ, ఓ సినిమా నిర్మించడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో విశ్వక్‌కి ఫుల్ మార్కులు పడతాయి. దర్శకుడిగా విశ్వక్‌లో నాకు ఓ త్రివిక్రమ్ కనిపించారు. త్రివిక్రమ్ సెట్లో ఎంత ఎనర్జీగా ఉంటారో... విశ్వక్ అలా ఉన్నాడు’’
‘‘విశ్వక్ దగ్గర చాలా మంచి కథలున్నాయి. పెద్ద హీరోలతో తను సినిమాలు చేస్తే... తప్పకుండా మంచి విజయాల్ని అందుకొంటాడు. గ్యాంగ్ స్టర్ కథలంటే విశ్వక్‌కి పిచ్చి. అలాంటి కథలు తను బాగా డీల్ చేయగలడు. చేస్తే.. లోకేష్ కనకరాజ్‌లా పెద్ద దర్శకుడు అవుతాడు’’
‘‘రావు రమేశ్, రోహిణిగార్లతో పని చేసే మంచి అవకాశం ఈ సినిమాతో నాకు వచ్చింది. ముఖ్యంగా రోహిణిగారికి నేను వీరాభిమానిని. ఆమెంటే చాలా ఇష్టం. రోహిణిగారికి ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. వీల్ ఛైర్‌లో కూర్చునే ఉంటారు. కానీ ఆమెను చూడగానే నా కన్నీళ్లు ఆగలేదు. అంత గొప్ప ఎక్స్‌ప్రెషన్స్ పలికించారు’’