Kushboo : నా బెడ్‌రూమ్ నిండా ఆయన ఫొటోలే!
ABN, First Publish Date - 2023-04-19T03:58:59+05:30
ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచారు ఖుష్బూ. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తన గుర్తింపుని నిలబెట్టుకొంటున్నారు...
ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచారు ఖుష్బూ. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తన గుర్తింపుని నిలబెట్టుకొంటున్నారు. తాజాగా ‘రామబాణం’లో కీలకమైన పాత్ర పోషించారు. గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న చిత్రమిది. మే 5న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఖుష్బూ ‘రామబాణం’ గురించి ఏమన్నారంటే..?!
‘రామబాణం’లో ఎలా కనిపించబోతున్నారు?
ఈ సినిమాలో భువనేశ్వరిగా కనిపిస్తా. కుటుంబం అంటే ప్రాణం. మామూలు గృహిణే. కానీ.. తన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే... పెద్ద పులిలా విరుచుకుపడుతుంది. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేసిన సినిమా ఇది. నాకూ ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ప్రాణం. అందుకే ఈ కథకు వెంటనే కనెక్ట్ అయిపోయా. మనం మర్చిపోతున్న సంప్రదాయాల్ని, ఆహార వ్యవహారాల్ని నా పాత్ర మరోసారి గుర్తు చేస్తుంది. ఈతరం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌లకు అలవాటు పడిపోయింది. మన ఇంట్లో, మట్టి కుండలో, నిప్పుల పొయ్యి మీద వండుకొన్న వంటల రుచే వేరు. ఆ రుచి ఎలాంటిదో భువనేశ్వరి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథలో మంచి సందేశం ఉంది. కుటుంబం అంతా కలిసుంటే ఎంత బలంగా ఉంటుందో ‘రామబాణం’ చూస్తే తెలుస్తుంది.
కథానాయికగా అప్పట్లో తమిళ చిత్రసీమకు ఇచ్చిన ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఎందుకు ఇవ్వలేదు?
చిత్రసీమ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినా సరే, నా కుటుంబం కోసం నేను అప్పట్లో చెన్నైలోనే ఉండిపోవాల్సివచ్చింది. తమిళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల, తెలుగు సినిమాలు చేయలేకపోయాను. చేసిన కొన్ని సినిమాలే అయినా... అగ్ర దర్శకులతో పనిచేశా. చిరంజీవిగారితో సినిమా చేయలేకపోయానే.. అనే లోటు మాత్రం ఉంది.
సెట్లో మీరే సీనియర్ కదా, ఈతరానికి ఏమైనా సలహాలు ఇస్తున్నారా?
నాకేమైనా తెలిస్తే కదా, సలహాలు ఇవ్వడానికి? (నవ్వుతూ). ఈతరమే నాకు ఎదురు సలహాలు ఇస్తోంది. ఎందుకంటే పరిజ్ఞానమంతా వాళ్ల చేతి వేళ్లపై ఉంది. మేకప్ విషయంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ ఈతరమే ఫాస్ట్‌గా ఉంది. వాళ్ల నుంచి మా తరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
కెరీర్ ప్రారంభంలో మీరు నటించిన సినిమాల్ని ఇప్పుడు చూసుకొంటే ఏమనిపిస్తుంది?
గర్వంగా ఉంటుంది. స్కూల్ డేస్ ఎవరైనా మర్చిపోతారా? నా కెరీర్ ప్రారంభం నాకు స్కూల్ డేస్‌లానే. రాఘవేంద్రరావు, పి,వాసు, బాలచందర్, భారతీరాజా.. ఇలా గొప్ప దర్శకులతో పనిచేశాను. అవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు.
ఇప్పటికీ డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా?
నేను అమితాబ్‌బచ్చన్‌కి వీరాభిమానిని. నా బెడ్ రూమ్ నిండా ఇప్పటికీ ఆయన ఫొటోలే ఉంటాయి. చిన్నప్పుడు ఆయనతో కలిసి నటించాను. హీరోయిన్ అయ్యాక మాత్రం ఛాన్స్ రాలేదు. ‘చీనీకమ్’లో ఆయన పక్కన టబుని చూసి కుళ్లుకున్నా. వెంటనే టబుకి ఫోన్ చేసి ‘నేనుండగా అమితాబ్‌తోనే రొమాన్స్ చేస్తావా?’ అని సరదాగా తిట్టేశా. అంతిష్టం ఆయనంటే. అమితాబ్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని ఉంది.