‘అమిగోస్’ అర్థం తెలుసుకొంటున్నారు!
ABN, First Publish Date - 2023-02-09T00:03:21+05:30
అమిగోస్ నా కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రం. ఇందులో తొలిసారి విలన్‌గా నటించాను. ఆ పాత్రలో కనిపించడం నాకు కొత్తగా అనిపించింది...
‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకొని ఫామ్‌లోకి వచ్చారు కల్యాణ్‌రామ్. ఇప్పుడు ‘అమిగో్‌స’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ తొలిసారిత్రిపాతాభ్రినయం చేశారు. శుక్రవారం ‘అమిగోస్’ విడుదల అవుతున్న సందర్భంగా బుధవారం కల్యాణ్ రామ్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
‘‘అమిగోస్ నా కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రం. ఇందులో తొలిసారి విలన్‌గా నటించాను. ఆ పాత్రలో కనిపించడం నాకు కొత్తగా అనిపించింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరో, హీరోగానే ఉంటాడు. తనలో కొన్ని ప్రతినాయక ఛాయలున్నా.. చివరికి మారిపోతాడు. కానీ ‘అమిగో్‌స’లో అలాంటి రొటీన్ విషయాలేం ఉండవు. అందుకే ఈ కథకు బాగా కనెక్ట్ అయాను’’.
ఫ ‘‘అమిగోస్ మన టైటిల్ కాదు. స్పానిష్ పదం. ఆ భాషలో స్నేహితులు అని అర్ధం. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురు ఉంటారో లేదో కానీ, దాదాపు ఒకే పోలికలతో ఉన్న మనుషుల గురించి మనం టీవీల్లోనో, దిన పత్రికలోనో చూస్తూనే ఉంటాం. అలాంటి ముగ్గురి కథ ఇది. ఈ సినిమాకి ‘స్నేహం’, ‘స్నేహితులు’ లాంటి మనకు తెలిసిన పదాలతోనే టైటిల్ పెట్టొచ్చు. కానీ ఇదే అర్థం వచ్చే పరభాషా పేర్లు ఏమున్నాయో వెదికాం. అలా ‘అమిగోస్’ కనిపించింది. ఈ పదం మనవాళ్లకు అర్థం అవుతుందా? లేదా? అనే చర్చ జరిగింది. ‘కాంతార’ అంటే అర్థం మనకు తెలీదు. కానీ ఆ సినిమా విడుదలయ్యాక దానర్థం ఏమిటో తెలిసింది. ‘అమిగోస్’ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే మనవాళ్లు తెలుసుకొంటున్నారు. ఆ విధంగా మా ప్రయత్నం సక్సెస్ అయినట్టే’’.
‘‘బింబిసార విజయం ఆస్వాదించేలోగానే ‘అమిగోస్’ మొదలైపోయింది. ‘బింబిసార’కు ముందు, ఆ తరవాత.. నేను ఒకేలా ఉన్నాను. కథల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. ఇక ముందు కూడా ఉంటా. ఏదో ఓ ప్రత్యేకత లేనిదే ఏ సినిమా ఒప్పుకోవాలని అనిపించదు. లాక్ డౌన్ సమయం నాకు వ్యక్తిగతంగా బాగా ఉపయోగపడింది. నా తప్పులేంటి? నా సినిమాల పరాజయానికి కారణం ఏమిటి? అనేది విశ్లేషించుకొనే వీలు చిక్కింది. ఆ తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతాను. బింబిసార 2 ఈ డిసెంబరులో మొదలవుతుంది. ‘డెవిల్’ షూటింగ్ 70 శాతం పూర్తయింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి నేను చెబితే బాగోదు. ఆ విషయం డాక్టర్లనే అడగాలి’’.
కల్యాణ్ రామ్ ముఖాముఖి సమయంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే ప్రశ్న కల్యాణ్ రామ్‌కి ఎదురైంది. దీనిపై కల్యాణ్‌రామ్ నేరుగా స్పందించలేదు. ‘‘ఈ విషయం గురించి డాక్టర్లు చెప్తేనే బాగుంటుంది’’ అని సమాధానం దాటేశారు.