Hit in Tamil Nadu : తమిళనాడులో హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం
ABN, First Publish Date - 2023-01-13T01:49:29+05:30
‘తమిళనాడులో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ముందే ‘వారిసు’ సినిమా షో వేశాం. రిస్క్ అని తెలిసినా, సినిమా బావుందనే నమ్మకంతో ముందుకెళ్లాం...
‘తమిళనాడులో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ముందే ‘వారిసు’ సినిమా షో వేశాం. రిస్క్ అని తెలిసినా, సినిమా బావుందనే నమ్మకంతో ముందుకెళ్లాం. సినిమా అయిపోగానే, ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. తమిళనాడులో హిట్ కొట్టి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా నటించారు. దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మాతలు. ఈ నెల 11న తమిళనాట విడుదలైన ‘వారిసు’ అక్కడ చక్కని ఆదరణ పొందుతోంది. ‘వారసుడు’ పేరుతో ఈనెల 14న తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘బొమ్మరిల్లు’ సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు ‘వారసుడు’ చూస్తున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి. వంశీ నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇచ్చాడు’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘విజయ్ ఒక్క సిట్టింగ్‌లోనే కథను ఓకే చేశారు. ‘వెయ్యికోట్లు పెట్టినా రాని అనుభూతి ఇది’ అని అల్లు అరవింద్ గారు అభినందించారు’ అన్నారు. వంశీ కఠోర శ్రమతో ఈ ఏడాది పెద్ద విజయం అందుకున్నాం అని తమన్ చెప్పారు. దిల్‌రాజు గట్స్ ఉన్న నిర్మాత, ఈ సినిమాపై ఆయనకు ఉన్న నమ్మకం నిజమైందని శరత్‌కుమార్ తెలిపారు. ‘వారిసు’ తమిళంలో ఘన విజయం సాధించింది, తెలుగులోనూ హిట్టవుతుందనే నమ్మకం ఉందని జయసుధ అన్నారు.