సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Star Heroines: స్టార్‌ హీరోయిన్లు.. స్మార్ట్‌ ఇన్వెస్టర్లు.. ఎక్కడంటే !

ABN, First Publish Date - 2023-04-30T12:57:44+05:30

ఒకప్పుడు వెండితెరపై వెలిగిన అతిరథ మహానటులు, నటీమణులు సైతం బికారులైన విషాద కాలాన్ని చూశాం... కానీ నేడు కెరీర్‌లో వెలుగు మొదలైనప్పటి నుంచే.. పెట్టుబడుల వ్యూహంతో బిలియనీర్లుగా మారేందుకు తహతహలాడుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు వెండితెరపై వెలిగిన అతిరథ మహానటులు, నటీమణులు సైతం బికారులైన విషాద కాలాన్ని చూశాం... కానీ నేడు కెరీర్‌లో వెలుగు మొదలైనప్పటి నుంచే.. పెట్టుబడుల వ్యూహంతో బిలియనీర్లుగా మారేందుకు తహతహలాడుతున్నారు స్టార్‌ హీరోయిన్లు.. దేశ విదేశాల్లో భవిష్యత్తు ఉన్న అనేక స్టార్టప్స్‌లో వాళ్లిప్పుడు స్మార్ట్‌ ఇన్వెస్టర్లు.. (Star Heroins - Smart Investors)

సినీతార బయట కంటపడితే వెర్రెత్తిపోయే జనం.. తెరపై మెరిస్తే తన్మయత్వంతో తరించే ప్రేక్షకులు... మహారాణులు ఎలా బతికారో ప్రత్యక్షంగా చూడలేదు కానీ, స్టార్‌డమ్‌ హీరోయిన్ల స్టార్‌ చూస్తే మాత్రం.. నక్షత్రాలే చిన్నబోతాయి. షూటింగ్‌ లొకేషన్‌లోకి అడుగుపెట్టగానే సకల సౌకర్యాలు. అడిగిందల్లా క్షణాల్లో అందించే సేవకులు. ఎండకు మేకప్‌ చెదరకుండా గొడుగుపట్టి.. చర్మం కందిపోకుండా కారవాన్‌ ఏర్పాటు చేసి.. విరామంలో పండ్లరసాలు అందించి.. సినిమా పూర్తయ్యే వరకు హీరోయిన్లను మహారాణుల్లా చూసుకుంటారు నిర్మాతలు. అయితే ఆ భాగ్యం శాశ్వతం కాదు. మహారాణుల్లా వెలిగిన మహానటీమణులకు సైతం కాలం పరీక్ష పెడుతుంది. హిట్లు ఆకాశానికి ఎత్తేస్తాయి, ఫ్లాపులు పాతాళానికి పడేస్తాయి. అంచనాలకు దొరకని మాయాలోకం సినీ ప్రపంచం. చూస్తుండగానే అలనాటి వైభవం మెల్లగా మసకబారుతుంది. ఇంటికి వరసకట్టే కార్లు.. షూటింగ్‌లో సిద్ధంగా ఉండే కారవాన్లు.. తరలివచ్చే వేలాది అభిమానులు.. హఠాత్తుగా (Star Heroines) మాయమైపోతారు. ఎప్పుడోకానీ రాని అదృష్టంలా అప్పుడప్పుడు అరకొర అవకాశాలు వెక్కిరిస్తుంటాయి. ఒక వెలుగు వెలిగినప్పుడు అంతోఇంతో దాచుకున్న సొమ్ము కర్పూరంలా కరిగిపోతూ వస్తుంది. సినిమాల్లో అలావచ్చి ఇలాపోయే సీన్‌లా జీవితం మారిపోతుంది. ఆ వైభవం.. ఆ వెలుగు.. ఆ తళుకులు.. ఆ అభిమానం.. కాపాడలేవు. కారణం? గ్లామర్‌ శాశ్వతం కాకపోవడం, ముందుచూపుతో వ్యవహరించకపోవడం.. ఆర్థిక సమాజపు భవిష్యత్తును అంచనా వేయలేకపోవడం.. ఇంకా చెప్పాలంటే స్టార్‌లుగా ఉన్నప్పుడే స్మార్ట్‌ ఇన్వెస్టర్‌లుగా మారకపోవడం..!.

ఎంత ముందుచూపు..

సినిమాల్లో.. హీరోలతో పోలిస్తే- హీరోయిన్ల జీవితకాలం చాలా తక్కువ. స్టార్‌డమ్‌ను కాపాడుకోవడం కత్తిమీద సాము. కొత్త హీరోయిన్లు వస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉంటుంది. ‘‘ఎంత పెద్ద నటీమణి అయినా వరుసగా పదేళ్లు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అతితక్కువ మంది మాత్రమే నిలబడతారు. చాలామంది కెరీర్‌ ఐదారు సినిమాలతోనే ముగిసిపోతుంది. అవకాశాలు ఉన్నప్పుడే డబ్బులు వస్తాయి. ఆ తరువాత ఆదాయం ఉండదు. ఇప్పుడు పొందిన సదుపాయాలతోనే జీవితాంతం బతకడం కష్టం..’’ అంటాడు దీపికాపదుకొనే పెట్టుబడుల వ్యవహారాలు చూసుకునే జిగర్‌షా. అందుకే అవకాశాలు-ఆదాయం ఉన్నప్పుడే భవిష్యత్తును నిర్మించుకోవాలి. తమ గ్లామర్‌, డబ్బు, సమయాన్ని పెట్టుబడుల్లోకి మళ్లించాలి అంటున్నారు నటీమణులు. ఒకరకంగా ఈ ఆర్థికవ్యూహం రిటైర్‌మెంట్‌ నాటికి కార్పస్‌ఫండ్‌లాంటిదన్న మాట. అందుకే సెట్స్‌లో ఉన్నప్పుడే జీవితాన్ని సెట్‌ చేసుకునే పనిలో పడ్డారు నేటి తరం హీరోయిన్లు. పాతతరం నటీమణుల్లా సినిమాల్లో సంపాదించిన కష్టార్జితాన్ని బంధువులకిచ్చి మోసపోవడం.. ఆర్భాటం కోసం విలాస భవంతులు నిర్మించుకోవడం.. తాహతుకు మించిన దానధర్మాలు చేయడం.. ఆదాయానికి మించి అప్పులు చేయడం.. వంటివి తగ్గించుకుంటున్నారు నవతరం తారలు. వాళ్లిప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే మార్గం ఎంచుకున్నారు. అదే ‘ఇన్వెస్ట్‌మెంట్‌’. ఇప్పుడున్నదంతా స్టార్టప్‌ల యుగం కాబట్టి చిన్న చిన్న కంపెనీల్లో స్వల్ప మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ధోరణి హాలీవుడ్‌లో ఇరవై ఏళ్ల కిందటే మొదలవ్వగా... బాలీవుడ్‌లో ఈ మధ్యనే ప్రారంభమైంది. కొత్తతరం హీరోయిన్లు స్టార్టప్‌ ఇన్వెస్టర్లుగా, వెంచర్‌ క్యాపిటలిస్టులుగా, బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారి... పారితోషికాలను పెట్టుబడుల్లోకి మళ్లించి.. భవిష్యత్తుకు భరోసా కల్పించుకుంటున్నారు. కొత్తతరం నటీమణులు వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను అనుసరిస్తుండటం మంచి పరిణామం.

కత్రిన రూటే వేరు.. (Katrina kaif)

బార్‌ అండ్‌ రెస్టారెంట్లలోని పెద్ద తెరలపై కత్రినాకైఫ్‌ ‘షీలా కి జవానీ’ పాటను చూస్తూ చల్లటి బీర్లు ఆస్వాదించేవాళ్లకు... ఆమె శృంగారతారగానే తెలుసు. ఆర్ధిక వ్యూహకర్త అని తెలియదు. ఆ పాట బాలీవుడ్‌నే కాదు ప్రపంచాన్నే ఉర్రూతలూగించింది. అలాంటి పాటకు అప్పుడున్నంత క్రేజ్‌ ఇప్పుడు లేదు. అచ్చం తన సినిమా కెరీర్‌ కూడా అలాగే ఉంటుందని పసిగట్టింది కత్రినా. ప్రేక్షకుల్లా మత్తులో పడిపోయి.. అదనపు ఆదాయం లేకుండా ఆగిపోలేదు. ఒకప్పుడు తనను వెదుక్కుంటూ సినిమా అవకాశాలు వచ్చేవి, ఇప్పుడు తనే వ్యాపార అవకాశాలను వెదుక్కుంటూ వెళుతోంది. సినిమాల్లో ఏకధాటిగా ఇరవైఏళ్లు నటించింది. ఇక, అలసట వచ్చేసింది. ప్రస్తుతం ఎంత సంపాదించినా.. రేప్పొద్దున స్థిరమైన ఆదాయం లేకపోతే ఎలాగన్న ప్రశ్న వేసుకుంది. ‘‘నాకు చిన్నప్పటి నుంచీ మేకప్‌, బ్యూటీకేర్‌ అంటే చాలా ఇష్టం. సౌందర్య ఉత్పత్తులను కొనడం ఇంకా ఇష్టం. ఎప్పుడు షాపింగ్‌మాల్స్‌కు వెళ్లినా మొదట నన్ను ఆకర్షించేది అవే!. టెక్చర్స్‌, కలర్స్‌, ఫార్ములాలను వాడేదాన్ని. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టాను. ఆ తరువాత నటిగా మారాక... మేకప్‌ నా జీవితంలో భాగం అయ్యింది. ఆఖరికి అదే నా వ్యాపార పెట్టుబడులకు మార్గం అవుతుందని ఊహించలేదు..’’ అంటోంది 39 ఏళ్ల కత్రినాకైఫ్‌. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే... మరోవైపు సౌందర్యఉత్పత్తుల పరిజ్ఞానాన్ని సంపాదించుకుంది. షూటింగ్‌ విరామంలో మేకప్‌ ఆర్టిస్టులతో మాట్లాడేది. రకరకాల కాస్మొటిక్స్‌ గురించి తెలుసుకునేది. కొన్నేళ్లకు ఆ రంగంపై అవగాహన ఏర్పడింది. ‘‘అంత రీసెర్చ్‌ చేశాక నమ్మకం కలిగింది.. నాకు ఇష్టమున్న ఈ రంగంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలని నిశ్చయించుకున్నా..’’ అని ఒక సందర్భంలో చెప్పింది. తన అభిరుచులు ఎరిగిన వ్యక్తిగత మేనేజర్‌ వివేక్‌కామత్‌ ‘నైకా’ వ్యవస్థాపకులైన ఫల్గుణి నాయర్‌ను కత్రినాకు పరిచయం చేశాడు. ‘వ్యాపార దక్షత, అమితమైన ఆసక్తి, పట్టుదల ఆమెను వ్యాపారవేత్తగా మారేలా చేశాయి’’ అన్నాడు వివేక్‌. మళ్లీ రెండేళ్లు లోతుగా అధ్యయనం చేసిన కత్రినా ‘కెఎవై బ్యూటీ’ ఏర్పాటుచేసి.. ‘నైకా’లో పెట్టుబడులు పెట్టింది. అలియాభట్‌ కూడా అదే సంస్థలో ఇన్వెస్టర్‌గా మారడం విశేషం.

కత్రినా ఒక్కరే కాదు. ప్రియాంకచోప్రా, అలియాభట్‌, అనుష్కాశర్మ, శ్రద్ధా, నయనతార ... ఇలా పలువురు స్టార్‌లు ఇన్వెస్టర్లుగా మారారు. ‘‘బాలీవుడ్‌తారల్లో ఒకరికొకరు మంచి స్నేహితులు. వుమెన్‌క్లబ్‌లలో సభ్యులు కూడా. వాళ్లంతా ఒక పెద్ద నెట్‌వర్క్‌గా ఏర్పడ్డారు. తరచూ యోగక్షేమాలతోపాటు ఇన్వెస్ట్‌మెంట్లు, స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ఫండ్స్‌ గురించి మాట్లాడుకుంటారు. చల్లటి సాయంత్రాల్లో అందరూ ఒకచోట డిన్నర్‌కు కలిసినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌ల ప్రస్తావన కూడా వస్తుంటుంది. ఒకరికి తెలిసిన విషయాలను మరొకరు పంచుకుంటారు. కొత్తతరం హీరోయిన్లలో ఇలాంటి ఆసక్తులు ఎక్కువ’’ అని విశ్లేషించారు ముంబయికి చెందిన పర్సనల్‌ ఫైనాన్స్‌ ప్లానర్‌ దీపిక కౌర్‌.

అందరిదీ ఇదే దోవ.. (Priyanka chopra)

ఇదే వరుసలో కత్రినాకైఫ్‌లా ఇన్వెస్టర్‌గా మారిన మరో నటీమణి ప్రియాంకచోప్రా. తను గ్లోబల్‌స్టార్‌గా ఎదిగి.. పెద్ద పెద్ద అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. భారీ పారితోషికాలు తీసుకుంటున్నప్పటికీ.. చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్లలో మదుపు చేయడం మానుకోదు. ఆమెకు ఫిట్‌నెస్‌, లైఫ్‌స్టయిల్‌, బ్యూటీ, ఫుడ్‌ వంటి స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఆసక్తి. అలాగని కొన్ని రంగాలకే పరిమితం కాదు.. ‘‘నాకు ఐడియానే కరెన్సీ. డబ్బుకంటే ఆలోచనే విలువైనదన్నమాట. కొన్ని సేవలకు అవసరమైన కంపెనీలు ఇప్పటికీ లేవు. అలాంటివి తారసపడినప్పుడు వెంటనే ఆరాతీస్తాను. ఆ సంస్థకు తప్పక భవిష్యత్తు ఉందనిపిస్తే.. వెంటనే భాగస్వామిగా మారిపోతా’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ప్రియాంక. ఆ మధ్య ఆమెను ‘బంబుల్‌ఇండియా’ అనే డేటింగ్‌ యాప్‌ ఆకర్షించింది. ‘‘అర్థవంతమైన, ఆరోగ్యకరమైన బంధాల కోసం మా యాప్‌ పనిచేస్తుంది. అబ్బాయిలు, అమ్మాయిలకు ఇదొక సురక్షితమైన ఆన్‌లైన్‌ కమ్యూనిటీ’’గా చెప్పుకుంటోందీ సంస్థ. డేటింగ్‌యాప్స్‌ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రియాంక బంబుల్‌ను ఎంచుకుంది. అందులో తనిప్పుడు ఒక భాగస్వామి. కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాల కంటే స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది కొత్తతరం. తమ ఇష్టాలకు అనుగుణంగానే పెళ్లిళ్లు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది.. కాబట్టి ఇలాంటి డేటింగ్‌యాప్‌లకు భవిష్యత్తు ఉంటుందన్నది ప్రియాంక ఆలోచన. ఆమె ఒకే రంగానికి పరిమితం కాదు కాబట్టి.. సిలికాన్‌వ్యాలీ సంబంధిత ‘హోల్బర్టన్‌ స్కూల్‌’లోనూ పెట్టుబడులు పెట్టింది. అమెరికాలోని సిలికాన్‌వ్యాలీలో హోల్బర్టర్‌ కంప్యూటర్‌సైన్స్‌ స్కూల్‌. లింక్డ్‌ఇన్‌, గూగుల్‌, టెస్లా, యాపిల్‌, ఫేస్‌బుక్‌, డ్రాప్‌బాక్స్‌, ఐబీఎం, సిస్కో వంటి సంస్థల్లో విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోందీ స్కూల్‌. అదే అమెరికాలో ఆన్‌లైన్‌లో అద్దెకు ఇళ్లను వెదికిపెట్టే ‘అపార్ట్‌మెంట్‌ లిస్ట్‌’ అనే సంస్థలో కూడా భాగస్వామిగా మారింది. వీటితోపాటు ప్రియాంకచోప్రా తన సొంత హెయిర్‌కేర్‌ బ్రాండ్‌ ‘అనొమలీ’ని సైతం నడుపుతోంది.

అన్నీ తానైౖ.. (Deepika padukone)

బాలీవుడ్‌లో మరో స్టార్‌ ఇన్వెస్టర్‌.. దీపికా పదుకొనె. సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను ఎలా ఎంచుకుంటుందో.. ఇన్వెస్ట్‌ చేయడానికి కూడా అంతే మంచి సంస్థలను ఎంచుకోవడంలో దిట్ట దీపిక. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో ఆమె ఒకరు. ప్రపంచ ప్రభావశీలురైన వందమంది ప్రముఖుల్లో ఒకరుగా టైమ్‌ మ్యాగజైన్‌ గుర్తింపును సొంతం చేసుకున్న దీపిక సినిమాలకే పరిమితం కాలేదు. సుమారు ముప్పయికి పైగా చిత్రాల్లో నటించిన 37 ఏళ్ల దీపిక ఆచితూచి తూకం వేసినట్లు నిర్ణయాలు తీసుకుంటుంది అంటారు ఆర్థికనిపుణులు. అందుకు ఆమె తండ్రి ప్రకాష్‌ పదుకొనే సహాయపడుతుంటాడు. సినిమా విషయాలు మాట్లాడుకునేందుకు దీపిక వ్యక్తిగత కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లే.. కేవలం పెట్టుబడుల వ్యవహారాలను చూసుకునేందుకు ప్రత్యేకంగా కేఏ ఎంటర్‌ప్రైజెస్‌ను నెలకొల్పింది. ఏ విషయాలను ఆ కార్యాలయంలోనే మాట్లాడటం ఆమెకు అలవాటు. ‘‘దీపిక ప్రతీ విషయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆమె సంపాదించిన మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడతాం. వివిధ రంగాల్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాం. దీపిక పోర్టుపోలియో వైవిద్యభరితంగా ఉంటుంది..’’ అంటాడు కేఏ ఎంటర్‌ప్రైజెస్‌కు ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న జిగర్‌ కే షా. ఇదివరకు ఆయన ఒక వెంచర్‌ క్యాపిటలిస్టు. ఇప్పుడు దీపిక తాలూకు ఆర్థిక కార్యకలాపాలన్నీ చూసుకుంటాడు. కాస్మొటిక్స్‌, బ్యూటీకేర్‌ రంగాల్లోనే రాణించాలనుకున్న ఆమె‘82 ఈ’ (ఎయిటీటూ ఈస్ట్‌) అనే కంపెనీలో భాగస్వామిగా మారింది. చర్మ సౌందర్యం కోసం పలు క్రీములను మార్కెట్‌లో విక్రయిస్తోందీ సంస్థ. బెంగళూరులోని ఆర్‌ ఆండ్‌ డీ ఇందుకోసం పనిచేస్తోంది. ‘‘ఎయిటీటూ ఈస్ట్‌ కంపెనీ తయారుచేసే ప్రతీ క్రీమ్‌ పరీక్షలన్నీ దాటుకుని వచ్చాక.. దీపిక తన చర్మానికి రాసుకుని ఫలితం బాగుందనిపిస్తేనే మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం. యువతరం అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకొచ్చాం..’’ అన్నారు కంపెనీ నిర్వాహకులు.

కొత్త ఐడియాలకు ఫిదా.. (alia bhatt)

అలియాభట్‌ వయసు చిన్నదే కానీ బుర్ర పెద్దది. సినీరంగంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న తండ్రి నుంచీ పాఠాలు నేర్చుకుంది. భవిష్యత్తులో తను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదని ముందే కళ్లు తెరిచింది. చురుకైన ఇన్వెస్టర్‌గా మారింది. అలియాకు కిడ్స్‌వేర్‌ను నెలకొల్పాలన్నది చిన్నప్పటి కల. ఆ కోరికతోనే ‘ఎద్‌ ఎ మామా’ అనే చిన్నపిల్లల దుస్తుల కంపెనీలోకి ప్రవేశించింది. పలు ఆన్‌లైన్‌ స్టోర్స్‌లలో కూడా దుస్తులను విక్రయిస్తోందీ సంస్థ. వీలుచిక్కినప్పుడల్లా అలియా ప్రచారం చేస్తోంది. దేవాలయాల్లో వాడిన పూలను సేకరించి (రీసైకిల్‌ ద్వారా) అగరుబత్తీలు, ధూపం, అత్తర్లు, పూజాసామగ్రిలను తయారుచేసే ‘పూల్‌’ సంస్థకు ఫిదా అయ్యిందీ బాలీవుడ్‌భామ. వెంటనే అందులో కూడా పార్టనర్‌షిప్‌ తీసుకుంది. ‘‘నేను బ్యాలెన్స్‌షీట్లను, టర్నోవర్‌ను అస్సలు చూడను. బిజినెస్‌ ఐడియా చెప్పిన వెంటనే.. టక్కున నచ్చిందా లేదా? అనేదే ముఖ్యం. సగటు కొనుగోలుదారుల్లాగ ‘భలేగుందే’ అనిపిస్తే చాలు..’’ అని పేర్కొంది అలియా. షూటింగ్‌ విరామాల్లో ఉన్నప్పుడు తన వ్యాపార విషయాలను జూమ్‌కాల్‌లో మాట్లాడుతూ.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుందట. మలైకా అరోరా ఫిట్‌నెస్‌, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తుంది. ‘కపివా’ అనే ఆయుర్వేద సంస్థలో ఇన్వెస్టర్‌గా ఉంటూనే బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ మారింది. ‘సర్వ యోగా’ అనే సంస్థను ఏర్పాటుచేసి, గట్టిగా ప్రచారం చేస్తోంది. ‘గెట్‌ ఎ వే’ అనే మరో ఆహార ఉత్పత్తుల సంస్థలో కూడా ఆమె కొంత మొత్తాన్ని పెట్టింది. ఇక, సీనియర్‌ నటీమణి మాధురీ దీక్షిత్‌, శిల్పాశెట్టి, ఐశ్వర్యారాయ్‌లు కూడా ఇన్వెస్టర్లుగా రాణిస్తున్నారు. ఐశ్వర్య ‘యాంబీ’ అనే స్టార్టప్‌లో చేరింది. ఈ సంస్థ వంద సెన్సర్స్‌తో గాలిలోని నాణ్యతను నిర్ధారించి వినియోగదారులకు విలువైన సమాచారం అందిస్తుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎంత? విషపూరిత కాలుష్యకారకాల శాతం ఎంత? ప్రాణవాయువు ఎంత ఉంది? అవసరమైనంత పచ్చదనం ఉందా? ఇలాంటి వాతావరణ విషయాలన్నీ ఈ యాప్‌ద్వారా పొందవచ్చు. ఇక, మాధురీ అయితే ‘గో కీ’ అనే ఎలకా్ట్రనిక్స్‌లో బాగానే పెట్టుబడులు పెట్టింది. శిల్పకు ముందు నుంచీ రియల్‌ఎస్టేట్‌ అంటే మక్కువ. కొంతమంది శ్రేయోభిలాషులతో కలిసి ‘గ్రూప్‌కో డెవలపర్స్‌’ ఏర్పాటు చేసింది. భూ యజమానులతో ఒప్పందాలు చేసుకుని అభివృద్ధి చేస్తుందీ కంపెనీ. ఆమె పెట్టుబడులున్న మరొక కంపెనీ ‘మామా ఎర్త్‌’. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఆరోగ్యసంబంధిత కంపెనీలంటే ఆసక్తి. హెచ్‌పీపీ (హై ప్రెజర్‌ ప్రెస్సింగ్‌) సాంకేతిక వ్యవస్థ ద్వారా శుద్ధమైన పండ్లరసాలను విక్రయించే ‘రాకియాన్‌ బేవరేజెస్‌’ అనే స్టార్టప్‌లో కలిసింది. వీరందరితోపాటు మలైకా అరోరా, శ్రద్ధాకపూర్‌, తాప్సీపన్ను, సమంత, దియామీర్జా, రష్మిక మందన్న, నయనతార తదితరులు పలు రకాల కంపెనీల్లో భాగస్వాములే!.

ఏ రంగాల్లో అధికం..?

ఎక్కువమంది హీరోలు భూములు, స్థలాలు, ఇళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య కార్యకలాపాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. అయితే హీరోయిన్లు మాత్రం ఆ రంగాలవైపు మళ్లడం లేదు. ఎందుకంటే జీవితాంతం వాటిని కాపాడుకోవడం, నిర్వహించడం కష్టం. అదేకనక డిమాండ్‌ ఉన్న కంపెనీల్లో భాగస్వాములుగా మారితే... ఏ ఇబ్బందీ ఉండదు. సమయం వెచ్చించాల్సిన పని లేదు. ఆ యజమానులే సంస్థల వ్యవహారాలన్నీ చూసుకుంటారు. ఇన్వెస్టర్లకు పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం మాత్రం అందుతుంటుంది. పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టిన తరువాత చాలామంది హీరోయిన్లు కుటుంబాలకే పరిమితం అవుతున్నారు.. కాబట్టి చిన్న వయసులోనే ఇన్వెస్ట్‌మెంట్లు పెడితే.. భవిష్యత్తులో నిరంతరాయంగా ఫలాలు దక్కుతుంటాయన్నది వారి ఆర్థికవ్యూహం. ఎక్కువమంది సినీతారలు బ్యూటీ, కాస్మొటిక్స్‌, ఫిట్‌నెస్‌, హెల్త్‌, హెయిర్‌కేర్‌, స్కిన్‌ కేర్‌, జువెలరీ, కిడ్స్‌వేర్‌ బ్రాండ్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు ఫైనాన్సియల్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న బంటీ చెబుతున్నారు. ఎందుకీ రంగాలవైపు హీరోయిన్లు చూస్తున్నారంటే... 2017లో 15 బిలియన్‌ డాలర్లతో మొదలై నేడు 23 బిలియన్‌ డాలర్లకు చేరుకుందీ బీపీసీ (బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌) రంగం. మరో ఐదేళ్లకు 40 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం ఖాయం. దానికితోడు భారత్‌లో యువతరం జనాభా అధికం. ఐటీ, కార్పొరేట్‌ రంగాల వృద్ధిరేటు ఎక్కువగా ఉండటంతో యువ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ పరిణామాలన్నీ మార్కెట్‌ను పెంచేవేనని సర్వేలు చెబుతున్నాయి.

‘‘సినిమా స్ర్కిప్ట్‌ను ఎంచుకోవడానికి ఎంత సీరియస్‌గా ఆలోచిస్తారో.. ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతకంటే లోతుగా పరిశీలిస్తారు. కన్సల్టెంట్‌ రీసెర్చ్‌ సంస్థల ద్వారా కీలకమైన సమాచారాన్ని తెప్పించుకున్న తరువాత.. సొంత విచక్షణతో నిర్ణయం తీసుకుంటున్నారు హీరోయిన్లు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా మాత్రం డబ్బులు పెట్టడం లేదు. అన్ని వర్గాల ప్రముఖులు, నిపుణులతో వారికి సామాజిక సంబంధాలు ఉంటాయి కాబట్టి.. భవిష్యత్తును అంచనావేసే దార్శనికత వారికుంది. అలాంటి చోట మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు..’’ అని తెలిపారు దీపిక పెట్టుబడులకు ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న జిగర్‌ షా.

ఒకప్పుడు వాణిజ్య ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం సమకూరేది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినా, బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారినా ఆదాయం లభిస్తోంది. కొందరు హీరోయిన్లు రెమ్యునరేషన్‌కు బదులు కంపెనీల్లో స్వల్ప భాగస్వామ్యం కోరుతున్నారు. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా సదరు సంస్థల ఉత్పత్తులను ప్రచారం చేస్తూ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతున్నారు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో తమ చరిష్మానే పెట్టుబడిగా పెట్టి.. లాభాలను ఆర్జిస్తున్నారు. ఇలా రకరకాల పద్ధతుల్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు స్టార్‌ ఇన్వెస్టర్లు.

‘‘నాకు సినిమాలు ప్రాణం అయితే వ్యాపారం వ్యాపకం. ఒక కొత్త ఉత్పత్తిని, ఒక సేవను మార్కెట్‌లోకి తీసుకొచ్చి.. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొని.. దాన్ని అమ్మడం.. లాభాలు తీయడం ... అన్నిటికంటే పెద్ద సవాలు. ఈ రోజుల్లో ఒక బ్రాండ్‌కు ఇమేజ్‌ను తీసుకురావడం అన్నిటికన్నా కష్టం. ఎంతో ఆసక్తి, పట్టుదల ఉంటేకానీ సాధ్యం కాదు. బ్రాండ్‌ను తయారుచేయడం అంటే ఒక బిడ్డను పెంచి పెద్ద చేయడం లాంటిది. అది ఎదుగుతున్నప్పుడు బిడ్డ పెరుగుతున్నంత సంతోషం కలుగుతుంది యజమానికి!. కొన్నిసార్లు అయితే సినిమాల్లోలాగే ఇన్వెస్టర్‌గా బిజీగా మారిపోతాను. ఎన్ని గంటలు పనిచేస్తున్నానో లెక్కపెట్టుకోలేనంత పనిచేస్తుంటాను. కొన్నిసార్లు నా భర్తకు విసుగొచ్చి.. ‘‘ఇక .. ఆ వ్యాపారం చాలు. కాసేపైనా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేయరాదూ’’ అంటుంటాడు. జీవితంలో ఎవరి భవిష్యత్తును వారు నిర్మించుకోవాల్సిందే!.’’

- కత్రినా కైఫ్‌

ఏ కంపెనీలో ఎవరు పెట్టుబడి పెట్టారు?..

కత్రినాకైఫ్‌ - nykaa

దీపికా పదుకొనె - epigamia - furlenco - blu smart- bellatrix- frontrow - 82 E - Atomberg - playshifu

అలియాభట్‌

Ed-a-mamma-phool

ప్రియాంకచోప్రా - bumble india- holberton school- apartment list- perfect moments-genies - co-owns sona - Anomaly- purple pebble pictures

అనుష్కాశర్మ - blue tribe foods

ఐశ్వర్యారాయ్‌- Ambee

శ్రద్ధాకపూర్‌ - my glamm - bella casa

శిల్పాశెట్టి - mama earth - fast and up- chicnutrix - simple soulful- groupco developers

మాధురీదీక్షిత్‌ - GoQii

మలైకా అరోరా - kapiva - sarva

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ - Rakyan Beverages

నయనతార - chaiwale

- మల్లెంపూటి ఆదినారాయణ

Updated Date - 2023-04-30T12:59:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!