Nawazuddin Siddiqui: భార్యని బాత్రూమ్ కూడా వాడుకోనివ్వలేదు.. నటుడిపై ఆలియా సిద్ధిఖీ లాయర్ సంచలన ఆరోపణలు
ABN, First Publish Date - 2023-02-01T13:35:41+05:30
ఎటువంటి సపోర్టు లేకుండా బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui). వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్‌లో దూసుకెళుతున్నాడు.
ఎటువంటి సపోర్టు లేకుండా బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui). వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్‌లో దూసుకెళుతున్నాడు. అయితే.. ఈ నటుడు తనని వేధిస్తున్నాడంటూ కొన్ని రోజుల క్రితం ఆయన భార్య ఆలియా సిద్ధిఖీ (Aaliya Siddiqui) ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ సైతం సంచలన ఆరోపణలు చేశారు.
దీనికి సంబంధించిన రిజ్వాన్ ఓ స్టేట్‌మెంట్‌ని విడుదల చేశారు. అందులో.. ‘మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నా క్లయింట్‌ని ఇంటిని నుంచి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందుకే ఆమెపై అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిందటూ కంప్లైంట్ చేశారు. అరెస్ట్ చేయిస్తామని పోలీసులతో ఆలియాని బెదిరించారు. అంతేకాకుండా.. ప్రతి రోజూ సూర్యస్తమయం తర్వాత ఆమెని పోలీస్ స్టేషన్‌కి పిలిచి ఇబ్బంది పెట్టారు. ఏ పోలీస్ అధికారి కూడా నా క్లైయింట్ హక్కులను రక్షించేందుకు ప్రయత్నించలేదు. పలుమార్లు పోలీసుల ముందే ఆమెని అవమానించారు. నవాజుద్దీన్‌తో తనకి ఉన్న రిలేషన్‌షిప్ గురించే కాకుండా.. ఆమె మైనర్ కుమారుడు పుట్టుక గురించి కూడా ప్రశ్నించారు.
అంతేకాకుండా.. మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లయింట్‌కి ఆహారం, బెడ్ ఇవ్వడం లేదు. స్నానానికి బాత్రూమ్ వాడుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అలాగే నా క్లయింట్ చుట్టూ చాలామంది మగ బాడీగార్డులను పెట్టారు. తన మైనర్ కొడుకుతో పాటు ఆమె ప్రస్తుతం ఉంటున్న హాలులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చివరికి నా క్లైయింట్ నుంచి కోర్టు కేసుల కోసం సంతకాలు తీసుకునే అవకాశం లేకుండా చేశారు. అయినా నేను, నా టీం కష్టపడి ఆమె సంతకాలు తీసుకుని.. కోర్టులో వరుస కేసులు ఫైల్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.