Oscars 2023: మూడు విభాగాల్లో భారతీయ సినిమాల నామినేషన్
ABN, First Publish Date - 2023-01-25T14:55:39+05:30
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సినీ కళాకారుడికి ఒక్కసారైనా ఆస్కార్ అవార్డుని సాధించాలనే కల ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సినీ కళాకారుడికి ఒక్కసారైనా ఆస్కార్ అవార్డుని సాధించాలనే కల ఉంటుంది. ఆస్కార్స్ 2023 కోసం మనదేశం నుంచి ఎన్నో మంచి చిత్రాలు ఈ అవార్డు కోసం పలు విభాగాల్లో పోటీకి వెళ్లాయి. అందులో కొన్ని మాత్రమే ఆస్కార్‌కి ఫైనల్ నామినేషన్‌ని దక్కించుకున్నాయి. ఆ జాబితాను తాజాగా అవార్డుల కమిటీ విడుదల చేసింది. అందులో పలు భారతీయ చిత్రాలు పలు విభాగాల్లో నామినేషన్‌ని దక్కించుకున్నాయి.
ఆర్ఆర్ఆర్ (RRR)
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ పాటకి ఆస్కార్ రావాలని ప్రతి సినీ లవర్స్ కోరకుంటున్నారు. కొన్ని రోజుల కిందటే ఆస్కార్ పురస్కారాల్లో 15 పాటల తుది జాబితాకి ఎంపికైన ఈ పాట, చివరి ఐదు పాటల్లో ఓ నామినేషన్‌ని కైవశం చేసుకుని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్’లోని అప్లాజ్..., ‘టాప్ గన్: మేవరిక్’లోని హోల్డ్ మై హ్యాండ్..., ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’లోని లిఫ్ట్ మి అప్.., ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని దిస్ ఈజ్‌ఎ లైఫ్.. పాటలతో పోటీలో నిలిచింది. ఈ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న తొలి భారతీయ గీతం ఇదే కావడం విశేషం.
ఆల్ దట్ బ్రెత్స్ (All That Breathes)
పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో తెలుపుతూ.. ఆ నేపథ్యంతో తెరకెక్కించిన భారతీయ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రెత్స్’ (All That Breathes). ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీని ఢిల్లీకి చెందిన ప్రకృతి ప్రేమికులు మహ్మద్ సాద్, నదీం షెహ్‌జాద్ జీవితాల ఆధారంగా శౌనక్ సేన్ తెరకెక్కించాడు. గాయపడ్డ పక్షులను రక్షించడం కోసం ఈ సోదరులిద్దరూ చేసిన ప్రయత్నాలను ఇందులో పొందుపరిచారు. అయితే ఇంతకుముందే ఈ డాక్యుమెంటరీ ప్రఖ్యాత బాఫ్టా అవార్డుకు సైతం నామినేట్ అయ్యింది. ఈ విభాగంలో నామినేట్ అయిన తొలి భారతీయ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రెత్స్’ కావడం విశేషం.
ది ఎలిఫెంట్ విస్ఫరర్స్ (The Elephant Whisperers)
భారతీయ డాక్యుమెంటరీ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగానికి నామినేట్ అయింది. కార్తీకి గోంజాల్వ్స్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్ 41 నిమిషాల నిడివి ఉంది. ఈ డాక్యుమెంటరీ అవార్డు కోసం ఇది మరో పద్నాలుగు డాక్యుమెంటరీలతో పోటీపడుతోంది.