RIP Kaikala Satyanarayana: కైకాల మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
ABN, First Publish Date - 2022-12-23T12:22:53+05:30
నవరసాలను సులువుగా పండించగల తెలుగు నటుల్లో కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) ఒకరు. అలాంటి నటుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.
నవరసాలను సులువుగా పండించగల తెలుగు నటుల్లో కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) ఒకరు. అలాంటి నటుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదంలో నెలకొంది. ఆయన మరణ వార్త విని.. ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. మహేశ్ బాబు, రవితేజ, రామ్‌చరణ్, నానితో పాటు మరికొందరు నటులు కైకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
మహేశ్ బాబు (Mahesh Babu) చేసిన ట్వీట్‌లో.. ‘కైకాల సత్యనారాయణ మృతి చెందడం చాలా బాధాకరం. కలిసి పని చేయడం వల్ల ఆయనతో నాకు చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు.
‘కైకాల సత్యనారాయణ మరణవార్త విని చాలా బాధపడ్డాను. మన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది !! ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని రామ్‌చరణ్ (Ram Charan) రాసుకొచ్చాడు.
‘లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ మరణ వార్త విని బాధపడ్డాను. భారతీయ సినిమా చూసిన అత్యుత్తమ నటుల్లో ఆయన ఒకరు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని రవితేజ Raviteja) రాసుకొచ్చాడు. అలాగే మరికొంతమంది నటులు కూడా కైకాల మృతికి సంతాపం వ్యక్తం చేశారు.