సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

AsianTarakaRama: బాలయ్య చేతుల మీదుగా పున: ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-14T17:35:12+05:30

నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా కన్నతండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి..

Asian TarakaRama Launch
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాచిగూడలోని ‘తారకరామ’ (Taraka Rama) థియేటర్‌ను వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్.. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌లు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka RamaRao)పై ఉన్న అభిమానంతో ‘తారకరామ’ థియేటర్‌ను ‘ఏషియన్ తారకరామ’ (Asian TarakaRama) థియేటర్‌గా పునరుద్ధరించారు. బుధవారం జరిగిన ఈ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ప్రొడ్యూసర్ శిరీష్ (Shirish) చేతుల మీదగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా కన్నతండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తారకరామ థియేటర్‌కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. నాన్నగారు ఏది చేసినా చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తారు. అది ఆయన దూరద్రుష్టి. ఆయన నటిస్తుంటే జానపదాలు జావళీలు పాడాయి. పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. సాంఘికాలు సామజవరగమనాలు పాడాయి. కళామతల్లి కళకళలాడింది. నటనకు జీవం పోసిన నటధీశాలుడు నందమూరి తారకరామారావుగారు. తెలుగువారి స్ఫూర్తి ప్రదాత తారకరామారావుగారు. చిత్ర పరిశ్రమ మద్రాస్‌లో వున్నప్పుడు.. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యాటక స్థలంగా వుండేది. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. ఈ థియేటర్‌కి ఒక చరిత్ర వుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం. తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం.

1978లో ‘అక్బర్ సలీం అనర్కాలి’తో ఈ థియేటర్‌ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 95లో కొన్ని అనివార్యకారణాల వలన మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది మూడోసారి. ఈ థియేటర్‌కి గొప్ప చరిత్ర వుంది. ‘డాన్’ సినిమా ఇక్కడ 525రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు ‘మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు’.. ఇలా అన్నీ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అలాగే మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ పేరు కూడా ఈ థియేటర్‌లోనే నాన్న గారు నామకరణం చేశారు. నారాయణ్ కె దాస్ నారంగ్‌ (Narayan K Das Narang)గారికి, నాన్నగారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ ఆ పరంపరని ముందుకు తీసుకువెళ్తున్నారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. వారి పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా వుంది. ఈ అనుబంధం ఇలానే కొనసాగించాలి. సునీల్ నారంగ్ (Suneel Narang) గారు అందరికి అందుబాటు ధరలో టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైనది. ఎంతమంది ఎన్నిసార్లు థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారనేది ఒక ప్రశ్న. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ వుంది. అందరం కలసి మంచి సినిమాలని అందించాలి. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కి వస్తారు. థియేటర్లో పొందే ఆనందం వేరు. మంచి సినిమాలు తీయడం మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు చలన చిత్ర పరిశ్రమ వర్ధిల్లాలని, ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

Updated Date - 2022-12-14T17:35:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!