RK Selvamani: చట్టాల అమలులో లోపం ఉంది.. ఇకనైనా మారాలి..
ABN, First Publish Date - 2022-10-30T15:27:50+05:30
తమిళం(Tamil)లో మూవీ డైరెక్టర్‌గా మంచి పాపులారిటీ ఉన్న దర్శకుడు ఆర్.కే.సెల్వమణి (R. K. Selvamani)..
తమిళం(Tamil)లో మూవీ డైరెక్టర్‌గా మంచి పాపులారిటీ ఉన్న దర్శకుడు ఆర్.కే.సెల్వమణి (R. K. Selvamani). తెలుగు ప్రేక్షకులని సైతం ఈయన సుపరిచితులే. ప్రముఖ సీనియర్ నటి, ఏపీ మంత్రి రోజా (Roja) భర్త. ఈయన తాజాగా చెన్నైలో జరిగిన ఓ మూవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చట్టాలపై వ్యాఖ్యలు చేశారు.
బుద్ధా ఫిలిమ్స్ బ్యానరుపై నేశమ్ మురళి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పొల్లాచ్చి’. కొత్త నటీనటులు నటించిన ఈ చిత్రం ఆడియోను తాజాగా రిలీజ్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పొల్లాచ్చి అత్యాచార ఘటన ఇతివృత్తంతో, సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని రూపొందించగా, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను రిలీజ్ చేశారు. దర్శకుడు ఆర్.కె.సెల్వమణి మాట్లాడుతూ.. ‘ఈ ఆడియో రిలీజ్ మా సంఘంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మన దేశ చట్టాలన్నీ విదేశీ చట్టాలకు ధీటుగానే ఉన్నాయి. కానీ వాటిని సక్రమంగా అమలు చేయడంలోనే అసలు సమస్య. ఈ పరిస్థితి మారాలి’ అని అన్నారు. మరో దర్శకుడు ఆర్.వి. ఉదయకుమార్ మాట్లాడుతూ.. ‘ప్రతి చిత్రాన్ని బాధితుల గొంతుకగా వినిపించేలా దర్శకుడు మురళి నిర్మిస్తున్నారు. ఒక చిత్రం తీసినప్పటికీ ఆ మూవీ విడుదలైన తర్వాత ప్రజలకు, సమాజానికి ఎలాంటి మేలు జరిగిందన్నది ముఖ్యం’ అని అన్నారు. నిర్మాత, దర్శకుడు నేశం మణి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అధ్యయనం చేసి తెరకెక్కించాం. ప్రతి ఒక్కరి మనస్సును ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు. సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా, సీపీఎం నేత కె.బాలకృష్ణన్, డీపీఐ నేత తోల్ తిరుమావళన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.