సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘హిట్లర్‌’కు 25 వసంతాలు.. ఎలా మొదలైందంటే!

ABN, First Publish Date - 2022-01-05T02:43:35+05:30

మలయాళంలో మమ్ముటీ హీరోగా నటించిన చిత్రాన్ని తెలుగులో హిట్లర్‌గా తెరకెక్కించారు ముత్యాల సుబ్బయ్య. అప్పట్లో దర్శకత్వ శాఖలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ఉండేది. అదే చిరకాల కోరికగా భావించేవారు. వెంకటేశ్‌ లాంటి పెద్ద హీరోతో ‘పవిత్ర బంధం’ లాంటి సూపర్‌హిట్‌ తీసిన సుబ్బయ్యకు చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం ఎలా వచ్చింది. ‘హిట్లర్‌’ ఎలా కార్యరూపం దాల్చింది. అన్న విషయాలను ముత్యాల సుబ్బయ్య ‘చిత్రజ్యోతి’తో పంచుకున్నారు. (హిట్లర్‌ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన చిత్రాన్ని తెలుగులో హిట్లర్‌గా తెరకెక్కించారు ముత్యాల సుబ్బయ్య. అప్పట్లో దర్శకత్వ శాఖలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ఉండేది. అదే చిరకాల కోరికగా భావించేవారు. వెంకటేశ్‌ లాంటి పెద్ద హీరోతో ‘పవిత్ర బంధం’ లాంటి సూపర్‌హిట్‌ తీసిన సుబ్బయ్యకు చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం ఎలా వచ్చింది? ‘హిట్లర్‌’ ఎలా కార్యరూపం దాల్చింది.. అనే విషయాలను ముత్యాల సుబ్బయ్య ‘చిత్రజ్యోతి’తో పంచుకున్నారు. (హిట్లర్‌ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి)


తొలిసారి పెద్ద హీరోతో చేసిన సినిమా హిట్‌ కావడంతో భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తిరుమలకు వెళ్లాను. శ్రీవారి దర్శనం చేసుకుని రూమ్‌కు తిరిగి వచ్చాను. నేను ఏ ఊరు వెళ్లినా సాయంత్రం ఇంటికి ఫోన్‌ చేసి కాసేపు మాట్లాడటం అలవాటు. అలాగే ఆ రోజు కూడా ఇంటికి ఫోన్‌ చేశాను. మా ఆవిడ నన్ను ‘మావా’ అని పిలిచేది. ‘‘మావా..ఎడిటర్‌ మోహన్‌గారు ఫోన్‌ చేశారు. రాగానే నిన్ను ఫోన్‌ చెయ్యమన్నారు’’ అని చెప్పింది. అప్పటికే మోహన్‌గారికి ‘మామగారు’, ‘పల్నాటి పౌరుషం’ రెండు సినిమాలు చేశాను. ‘ఆయన ఎందుకు ఫోన్‌ చేశాడబ్బా!’ అని ఆలోచనలో పడ్డాను.


సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూ...

అప్పట్లో ఈ సెల్‌ఫోన్లు లేవుగా. అందుకే తిరుపతి నుంచి మద్రాసుకు రాగానే మోహన్‌గారికి ఫోన్‌ చేశాను. ‘‘రేపు ఉదయం ఒకసారి ఆఫీసుకు రాగలరా’’ అని అడిగారాయన. ‘‘తప్పకుండా వస్తాను సార్‌’’ అని చెప్పి ఆ మర్నాడు ఉదయమే ఆయన ఆఫీసుకు వెళ్లాను. ‘‘కంగ్రాట్స్‌ సుబ్బయ్యగారు’’ అన్నారు మోహన్‌గారు, విషయం ఏమీ చెప్పకుండా. నాకు అర్థం కాలేదు. ‘‘ఎందుకు సార్‌?’’ ఆశ్యర్యంగా చూస్తూ ప్రశ్నించాను. ఆయన వివరాలు ఏమీ చెప్పకుండా సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూ ‘‘మలయాళంలో మమ్ముట్టిగారు నటించిన ‘హిట్లర్‌’ రైట్స్‌ కొన్నాను. ఒకసారి ఆ సినిమా చూస్తారా సుబ్బయ్యగారూ’’ అని అడిగారు. ‘‘అలాగే చూద్దాం’’ అన్నాను.


జోకులు వద్దు సార్‌.. ఊరుకోండి...

థియేటర్‌లో ప్రొజెక్షన్‌ ఏర్పాటు చేశారు మోహన్‌గారు. ఆ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది నాకు. ఆ విషయమే చెప్పాను. ‘‘ఈ సినిమా తెలుగులో మనం చేస్తున్నాం సుబ్బయ్యా.. హీరో ఎవరైతే బాగుంటారు?’’ అని ప్రశ్నించారు మోహన్‌. ‘‘పెద్ద హీరో ఎవరు చేసినా బాగుంటుంది సార్‌.. చిరంజీవిగారు చేేస్తే ఇంకా బాగుంటుంది సార్‌’ అన్నాను. ‘‘ఆయనే చేస్తున్నారు సుబ్బయ్యా. మీరే ఆ సినిమాకు డైరెక్టర్‌’’ అని చెప్పగానే మొదట నేను నమ్మలేదు. ‘నేనేమిటి, చిరంజీవిగారి చిత్రానికి దర్శకత్వం వహించడమేమిటి? జోకులు వద్దు సార్‌.. ఊరుకోండి?’ అన్నాను. ‘‘జోకులు కాదు సుబ్బయ్యా...నిజమే’’ అని చెప్పారు మోహన్‌.


నా చిరకాల కోరిక....

అప్పటికే ఎడిటర్‌ మోహన్‌ చిరంజీవిగారికీ, అల్లు అరవింద్‌గారికీ ఆ సినిమా చూపించడం, వారిద్దరికీ నచ్చి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగాయి. సెంటిమెంట్‌ సీన్లు బాగా తీస్తానని నాకు అప్పటికే పేరు వచ్చింది. ‘హిట్లర్‌’ సినిమాలో కూడా సెంటిమెంట్‌ సీన్లు బాగా ఉండటంతో దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యను పెట్టండి అని చిరంజీవిగారు చెప్పారట. అందుకే నాకు కబురుచేసి, సినిమా చూపించారు. ఇదంతా ఎడిటర్‌ మోహన్‌గారు చెప్పగానే సంతోషం పట్టలేకపోయాను. చిరంజీవిగారితో సినిమా చేయాలన్నది నా చిరకాల కోరిక. నాకే కాదు దర్శకత్వశాఖలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ గోల్‌ చిరంజీవిగారి సినిమాకు దర్శకత్వం వహించడం. అందుకే ఎడిటర్‌ మోహన్‌గారు అలా చెప్పగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను.


12 నెలల తర్వాత మేకప్‌...

ఆ తర్వాత ఎడిటర్‌ మోహన్‌గారితో కలిసి చిరంజీవిగారి దగ్గరకు వెళ్లాను. ‘‘ఏం సుబ్బయ్యా...ఎలా ఉన్నావు?’’ అని ఆయన ఆప్యాయంగా పలకరించారు. ‘‘చాలా థాంక్స్‌ సార్‌...మిమ్మల్ని డైరెక్ట్‌ చేయాలనే నా చిరకాల కోరిక ఇలా తీరుతోంది’’ అన్నాను. ఆయన నవ్వేసి నా భుజం తట్టారు. ఆ సమయంలో అల్లు అరవింద్‌గారు కూడా అక్కడే ఉండటంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను. చిరంజీవిగారు అప్పటికి మేకప్‌ వేసుకుని దాదాపు 12 నెలలు అవుతోంది. ఏ కథ చెప్పినా ఆయనకు నచ్చకపోవడంతో రిజక్ట్‌ చేస్తున్నారు. రొటీన్‌ పాత్రలు కాకుండా మంచి కథతో, వైవిధ్యమైన పాత్రతో వస్తేనే సినిమా చేయాలని ఆయన నిర్ణయించుకుని ఇంటికే పరిమితమైన తరుణం అది.


శాల్తీ లేచిపోతుంది జాగ్రత అన్నారు...

అటువంటి నేపథ్యంలో ‘హిట్లర్‌’ కథ ఓ.కే. చేయడం, ఆ సినిమాకు నన్ను దర్శకునిగా ఎంపిక చేయడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. అప్పటికే నేను ఆయన సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం ఆయన అభిమానులకు తెలిసిపోవడంతో అభినందనలతో పాటు రెండు మూడు వార్నింగ్‌ ఉత్తరాలు కూడా వచ్చాయి. ‘‘గ్యాప్‌ తర్వాత మా గురువుగారు సినిమా చేస్తున్నారు. సినిమా తప్పకుండా హిట్‌ అవ్వాలి. తేడా వచ్చిందో శాల్తీ లేచిపోతుంది జాగ్రత్త’’ అంటూ. అయినా నేను భయపడలేదు. ఎందుకంటే ‘హిట్లర్‌’ చాలా మంచి సినిమా. బాగా తియ్యడానికి అవకాశం ఉంది. నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశాం. హిట్‌ అవుతుందనే ఆత్మవిశ్వాసంతోనే ఆ సినిమా చేశాను.


అనుకున్నది అనుకున్నట్టు తీశా...

కొన్నిరోజుల తర్వాత ‘హిట్లర్‌’ సినిమా షూటింగ్‌ మొదలైంది. తొలి రోజున నేను కొంచెం భయపడ్డాను కానీ చిరంజీవిగారు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను. అన్ని సీన్లూ సూపర్‌గా పండాయి. 1. చిరంజీవిగారి మీద రెండు పేథస్‌ సాంగ్స్‌ (‘ఓ కాలమా...’, ‘కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే...’) చిత్రీకరించడం, ప్రేక్షకులు వాటిని అంగీకరించడం గొప్ప విషయమే. పేథస్‌ సాంగ్స్‌ డాన్స్‌ మాస్టర్‌కు ఇవ్వకుండా నేనే చిత్రీకరించడం నాకు మొదటినుంచీ అలవాటు. చిరంజీవిగారు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా చెప్పింది చెప్పినట్లు చేశారు. రీరికార్డింగ్‌ కోటి అద్భుతంగా చేశారు. అయితే సినిమాలో, ‘హ బి బీ..’ సాంగ్‌ ట్యూన్‌ చిరంజీవిగారికి మొదట నచ్చలేదు. కానీ పాట రికార్డింగ్‌ పూర్తయి వచ్చిన తర్వాత విని ఆయన కూడా సంతృప్తి చెందారు. 


అవకాశం  నాకే రావడం నిజంగా అదృష్టమే కదా..

చిరంజీవిగారి తండ్రి పాత్రలో ఎవరు చేసినా అది రొటీనే అవుతుంది. అందుకే దాసరి నారాయణరావుగారు వేస్తేనే విభిన్నంగా ఉంటుందని మేమంతా ఏకగ్రీవంగా నిర్ణయించాం. ఎడిటర్‌ మోహన్‌గారికీ, నారాయణరావుగారికీ ఉన్న అనుబంధం కూడా ఆయన ఈ పాత్ర చేయడానికి కారణమైంది. సినిమాలో సీరియస్‌నెస్‌ ఎంత ఉందో, కామెడీ కూడా ఆ స్థాయిలోనే ఉండటం ‘హిట్లర్‌’ ప్రత్యేకత. రాజేంద్రప్రసాద్‌, సుధాకర్‌, బ్రహ్మానందం, కల్పనారాయ్‌ పాత్రలు అద్భుతంగా కుదిరాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్‌ కాపీ చూసి అందరం హ్యాపీ. 1997 జనవరి 4న విడుదలైంది. పెద్ద హిట్‌. ఆ సినిమాతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకు నన్ను దర్శకుడిగా ఎంపిక చేసిన చిరంజీవిగారికి, అల్లు అరవింద్‌గారికీ, ఎడిటర్‌ మోహన్‌గారికీ పాదాభివందనాలు. చాలామంది దర్శకులు ఉన్నారు. వాళ్లలో నాకే అవకాశం రావడం నిజంగా అదృష్టమే కదా.


దానికి నేను ఒప్పుకోను...

‘‘చిరంజీవికి లైఫ్‌ ఇచ్చావయ్యా’’ అని కొందరు అంటారు. కానీ దానికి నేను ఒప్పుకోను. ‘‘తనతో సినిమా చేేసే అవకాశం చిరంజీవిగారే నాకు ఇచ్చారు. అలా ఆయనే నాకు లైఫ్‌ ఇచ్చారు’’ అని చెప్పేవాడిని. సినిమా బాగా ఆడుతున్న రోజుల్లో ఒకసారి చిరంజీవిగారి ఆఫీసునుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ‘‘చిరంజీవిగారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు’’ అని. నేను ఎక్కడో ఉన్నాను. అక్కడి నుంచి రావడానికి రెండు రోజులు పట్టింది. అప్పటికే పరిశ్రమలో చాలామంది సెల్‌ఫోన్లు వాడుతున్నారు. నేను అప్పటికి ఇంకా సెల్‌ ఫోన్‌ కొనుక్కోలేదు. అందుకే ఆయన దగ్గరకి వెళ్లగానే ‘‘సారీ సార్‌.. మీ మెసేజ్ నాకు అందడం లేటైంది. అందుకే మిమ్మల్ని వెంటనే కలవలేకపోయాను’’ అన్నాను. ‘‘అదేమిటి.. నీకు సెల్‌పోన్‌ లేదా?’’ అని అడిగారు చిరంజీవిగారు. ‘‘లేదు సార్‌.. ఇంకా కొనలేదు’’ అన్నాను నవ్వుతూ. కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశాను. మర్నాడు ఉదయమే ఇంటికి ఓ పార్సిల్‌ వచ్చింది. విప్పి చూస్తే అందులో సెల్‌ఫోన్‌ ఉంది. చిరంజీవిగారు పంపించిన కానుక అది.


ఒంగోలులో ఫంక్షన్‌

‘హిట్లర్‌’ వంద రోజుల వేడుక ఎక్కడ చేయాలన్న విషయం మీద చాలా చర్చ జరిగింది. ఒక్కో సెంటర్‌లో ఒక్కో సినిమా వంద రోజుల వేడుక చేయడం చిరంజీవిగారికి ఆనవాయితీగా ఉండేది. అలా ఆలోచించి ఒంగోలులో ‘హిట్లర్‌’ ఫంక్షన్‌ పెట్టారు. వాళ్ల నాన్నగారు మొదట్లో ఉద్యోగం చేసిన ప్రాంతం కావడంతో ఒంగోలుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. భారీ ఎత్తున అక్కడ ఫంక్షన్‌ నిర్వహించారు. అలా ‘పవిత్రబంధం’, ‘హిట్లర్‌’ చిత్రాల ఘనవిజయంతో దర్శకుడిగా నా స్థాయి పెరిగింది. పారితోషికం కూడా బాగా పెరిగింది. 

- వినాయకరావు

Updated Date - 2022-01-05T02:43:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!