Chiranjeevi పై అప్పట్లో విషప్రయోగం చేయించిందెవరు?
ABN, First Publish Date - 2022-07-23T00:45:46+05:30
సినీ ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతుంటే.. వారిని కిందకి లాగడానికి ప్రయత్నించేవారు పదిమంది ఉంటారు. శాశ్వత శత్రుత్వం, చిరకాల మిత్రత్వం ఏమీ ఉండదని చెప్పుకొనే ఈ పరిశ్రమలో అసూయ, ద్వేషాలకు, కుట్రలు, కుతంత్రాలకు మాత్రం ఎలాంటి ఢోకాలేదు. నిజజీవిత రాజకీయాల్ని తలపించే రీతిలో ఇక్కడా రాజకీయాలు నడుస్తుంటాయి.
సినీ ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతుంటే.. వారిని కిందకి లాగడానికి ప్రయత్నించేవారు పదిమంది ఉంటారు. శాశ్వత శత్రుత్వం, చిరకాల మిత్రత్వం ఏమీ ఉండదని చెప్పుకొనే ఈ పరిశ్రమలో అసూయ, ద్వేషాలకు, కుట్రలు, కుతంత్రాలకు మాత్రం ఎలాంటి ఢోకాలేదు. నిజజీవిత రాజకీయాల్ని తలపించే రీతిలో ఇక్కడా రాజకీయాలు నడుస్తుంటాయి. అలాంటి ఇండస్ట్రీలో ఎవరి అండదండలు లేకుండా, ఎవరి రికమండేషన్స్‌తోనూ పనిలేకుండా.. నటుడిగా ప్రవేశించి స్వయంకృషితో సెల్ఫ్ మేడ్‌గా ఎదిగారు చిరంజీవి (Chiranjeevi). కెరీర్ బిగినింగ్‌లో విలన్ వేషాలు వేస్తూ.. క్రమేపీ హీరో వేషాలకు టర్న్ అయిన చిరు.. ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వరుస విజయాలు సాధిస్తూ.. డ్యాన్సులతోనూ, ఫైట్స్‌తోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆ టాలెంట్ తోనే ఆయన అధిక సంఖ్యలో అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఆ టైమ్‌లో ఆయన స్టార్ డమ్‌ను సహించలేని కొందరు ఆయనపై విష ప్రయోగానికి పాల్పడ్డం అప్పట్లో సంచలనమైది.
అది1988వ సంవత్సరం. క్రియేటివ్ కమర్షియల్స్ (Creative Commercials) బ్యానర్ పై ఎ.కోదండరామి రెడ్డి (A.Kodandaramireddy) దర్శకత్వంలో చిరంజీవి ‘మరణమృదంగం’ (Marana mrudangam) అనే చిత్రంలో నటిస్తున్నారు. యండమూరి రచించిన అదే పేరుతో వచ్చిన నవలనే సినిమాగా తీస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో ఔట్ డోర్‌లో జరుగుతోంది. ఆ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు. షూటింగ్ గ్యాప్ లో చిరు వారితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలోనే అందరూ షాకయ్యే ఒక సంఘటన జరిగింది.
అభిమానినంటూ ఒక వ్యక్తి చిరంజీవి ముందుకొచ్చాడు. ఆ రోజున తన పుట్టినరోజని, మీ సమక్షంలోనే తన కేక్ కట్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. వెంటనే వెంట తెచ్చుకున్న ఒక కేక్ ను కట్ చేసి.. చిరంజీవి నోట్లో బలవంతంగా పెట్టాలని ప్రయత్నించాడు. ఊహించని ఆ పరిణామానికి చిరు ఆశ్చర్యపోతూనే అతడ్ని అడ్డుకున్నారు. దాంతో ఆ కేక్ కింద పడిపోయింది. అప్పటికే కొంత ఆయన నోట్లోకి వెళ్లిపోవడంతో ఆయన పెదాలు నీలంగా మారడం మొదలైంది. కింద పడ్డ కేక్ లో ఏవో పదార్ధాలుండడం, ఆ వ్యక్తి ప్రవర్తన అనుమానంగా ఉండడం అక్కడివారు గమనించారు. వెంటనే చిరంజీవిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయాన్ని వైద్యులు తెలిపారు. విషానికి విరుగుడు ఇచ్చి చిరంజీవిని గండం నుంచి గట్టెక్కించారు. అప్పట్లో జాతీయ పత్రికలు అన్నీ ఈ వార్తను ప్రచురించాయి. కొన్ని తెలుగు పత్రికలు కూడా ఈ అంశాన్ని కవర్ చేశాయి. అసలు ఆ విషప్రయోగాన్ని చేయించిందెవరు? మీడియాలో ఆ వార్త హైలైట్ కాకుండా చేసిందెవరు? అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఏదేమైనా ఆయనపై అభిమానుల అంతులేని అభిమానమే ఆయన్ను కాపాడింది. కొసమెరుపేంటంటే.. ‘మరణమృదంగం’ చిత్రం నుంచే చిరంజీవికి మెగాస్టార్ (Megastar) బిరుదు వచ్చింది. నిర్మాత కె.యస్.రామారావు (KS Ramarao).. మెగాస్టార్స్ మైటీ మూవీ అని ‘మరణమృదంగం’ చిత్రానికి పబ్లిసిటీ ఇవ్వడం అప్పట్లో సంచలనమైంది. ఆ తర్వాత ఆ బిరుదు చిరంజీవి ఇంటిపేరుగా మారిపోయింది.