సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Avatar 2: తెలుగు రైట్స్‌.. రూ.100 కోట్లకు!

ABN, First Publish Date - 2022-12-14T13:44:05+05:30

సినిమా అంటేనే ఓ అందమైన ఊహా ప్రపంచం. ప్రేక్షకుల్ని రెండుగంటల పాటు సరికొత్త లోకాల్లో విహరింపజేయడంలో జేమ్స్‌ కెమెరాన్‌ (James Cameron) సిద్ధహస్తుడు.

Avatar 2
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా అంటేనే ఓ అందమైన ఊహా ప్రపంచం. ప్రేక్షకుల్ని రెండుగంటల పాటు సరికొత్త లోకాల్లో విహరింపజేయడంలో జేమ్స్‌ కెమెరాన్‌ (James Cameron) సిద్ధహస్తుడు. ‘అవతార్‌’ (Avatar) చూసిన వాళ్లంతా జేమ్స్‌ సృజనాత్మకతకు నివ్వెరపోయారు. ఇది వరకెప్పుడూ మనం చూడని ఓ లోకాన్ని సృష్టించేశాడు కెమెరాన్‌. ఆ లోకంలోని అందాల్ని, అద్భుతాల్ని, కథల్నీ, వ్యథల్నీ కళ్లకు కట్టాడు. ఓ మాస్టర్‌ పీస్‌ని అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమా సాధించని వసూళ్లని... ‘అవతార్‌’ సాధించింది. ‘ఇలాంటి సినిమా మళ్లీ చూడలేం..’ అంటూ విమర్శకులు సైతం కొనియాడేలా చేసింది. తాజాగా ‘అవతార్‌ 2’ (Avatar 2) వస్తోంది. ఈసారి నీటిలో.. నీలి ప్రపంచాన్ని చూపించబోతున్నాడు జేమ్స్‌. ‘అవతార్‌’ అద్భుతమైతే.. ‘అవతార్‌ 2’ అంతకు మించి ఉండబోతోందన్న సంకేతాల్ని ప్రచార చిత్రాలు అందిస్తున్నాయి. ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా, దాదాపుగా 160 భాషల్లో ‘అవతార్‌ 2 ద వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar: The Way of Water) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు అందరి దృష్టీ.. ఈ సినిమాపైనే.

‘అవతార్‌ 2’ తెలుగు రైట్స్‌ని రూ.100 కోట్లకు దక్కించుకోవడానికి ఒకరిద్దరు నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కుదర్లేదు. ‘ఓ హాలీవుడ్‌ డబ్బింగ్‌ సినిమాకి ఇంత రేటా’ అని మిగతా వారు ఆశ్చర్యపోయారు. కానీ... ‘అవతార్‌’ పుట్టు పూర్వోత్తరాలు, దాని చరిత్ర, అందుకోసం జేమ్స్‌ పడిన కష్టం, ఈ సినిమాకొచ్చిన క్రేజ్‌.. ఇవన్నీ అర్థమైతే ఆ వంద కోట్లు కూడా తక్కువే అంటారు. ‘అవతార్‌’ ప్రపంచాన్ని సృష్టించడం వెనుక జేమ్స్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ‘అవతార్‌’ ఆలోచన జేమ్స్‌కి 1994లోనే వచ్చింది. కానీ.. ఆ కథని సినిమాగా తీయాలంటే అప్పటి సాంకేతికత సరిపోదు. అందుకే టెక్నాలజీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాడు. తన ఆలోచనలతో కొత్త కెమెరాల రూపకల్పన, మోషన్‌ పిక్చర్స్‌ సాంకేతికత అభివృద్ధి చెందడంలో తాను ఓ భాగమయ్యాడు. ‘అవతార్‌’ అనే పేరు పెట్టడం వెనుక, పాత్రలకు నీలి రంగు పూయడం వెనుక కూడా బలమైన కారణాలు ఉన్నాయి. జేమ్స్‌కి ఇండియన్‌ మైథాలజీ అంటే చాలా ఇష్టం. మన రాముడు, కృష్ణుడు.. పాత్రలని ఆయన బాగా అధ్యయనం చేశాడు. ఆ ప్రభావంతోనే ‘అవతార్‌’ అంటూ తన కలల ప్రాజెక్టుకి నామకరణం చేశాడు. అవతార్‌ ప్రపంచంలో తాను చూపించాలనుకొన్న మనుషుల్నీ, వాళ్ల కథని ఓ డాక్యుమెంట్‌గా రాసుకొన్నాడు అవతార్‌. ఇప్పుడు ఆ డాక్యుమెంట్‌ ఆధారంగానే ‘అవతార్‌’, ‘అవతార్‌ 2’ పుట్టుకొచ్చాయి.

రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలు..

డిసెంబరు 6న లండన్‌లో ‘అవతార్‌ 2’ ప్రీమియర్‌ షోలు నిర్వహించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్ర నిడివి దాదాపుగా 192 నిమిషాలు. ‘అవతార్‌ 1’తో పోలిస్తే... 30 నిమిషాలు ఎక్కువే. ఇండియన్‌ వెర్షన్‌లో నిడివి కొంచెం తగ్గించే అవకాశం ఉంది.

అమ్మ కల.. జేమ్స్‌ మాయ..

‘అవతార్‌’ పుట్టుకకు మూలం ఓ కల అంటే ఎవరూ నమ్మలేరు. జేమ్స్‌ మాతృమూర్తికి ఎప్పుడో ఓ కల వచ్చిందట. అందులో ముఫ్పై అడుగుల ఎత్తున్న మనుషులు కనిపించార్ట. అంతా నీలి రంగులో ఉన్నార్ట. ఇదే కలని.. తనయుడు జేమ్స్‌తో పంచుకొంది. అప్పుడే ‘అవతార్‌’ కథకు బీజం పడింది. ‘పండోరా’ అనే ఓ అద్భుతమైన ఊహా ప్రపంచాన్ని సృష్టించాడు జేమ్స్‌. ప్రకృతి అందాల మధ్య... కలుషితమైన మనుషులకు దూరంగా జీవనం సాగిస్తున్న ఓ జాతిని చూపించాడు. అక్కడ దొరికే ఖనిజాల్ని, సంపదని దోచుకోవడానికి ఓ కార్పొరేట్‌ సంస్థ కుట్ర పన్నితే... దాన్నుంచి తమ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి ‘పండోరా’ వాసులు ఏం చేశారు? ఎలా పోరాటం చేశారు? అనేదే ‘అవతార్‌’ కథ. నిజానికి బలహీనుల్ని, దుర్బుద్ధితో దోచుకోవడానికి బలవంతుడు పన్నే కుతంత్రం ఇది. దానికి అద్భుతమైన సాంకేతికతను, తన ఊహా శక్తిని జోడించాడు జేమ్స్‌ కెమెరాన్‌. మానవ సంబంధాల్ని, ప్రేమని, హృదయాల్ని హత్తుకొనేలా చెప్పి, ఈ కథకు ఓ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చాడు. ‘అవతార్‌’ అంటే అద్భుతమైన కలల ప్రపంచం మాత్రమే కాదు.. మనసుల్ని మెలిపెట్టే సన్నివేశాలు కూడా అని చెప్పాడు. అందుకే ‘అవతార్‌’ అంతగా జనాదరణ పొందింది. ఇప్పుడు ‘అవతార్‌ 2’ వంతు వచ్చింది.

టెక్నాలజీని కనిపెట్టారు..

‘అవతార్‌ 2’ బడ్జెట్‌ మన లెక్కల్లో.. దాదాపుగా రూ.7,500 కోట్ల రూపాయలు. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రమిదే. ‘అవతార్‌’ కోసం రూ.1200 కోట్లు ఖర్చు పెడితే.. రూ.23000 కోట్ల ఆదాయం ఆర్జించింది. ‘అవతార్‌’ కనీ వినీ ఎరుగని విజయం సాధించడంతో.. ‘అవతార్‌ 2’కి రంగం సిద్ధం చేశాడు జేమ్స్‌. 2014లోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ.. ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయాల్లో భారీ జాప్యం జరిగింది. కరోనాతో నిర్మాణానంతర కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. దాదాపు 80 శాతం సన్నివేశాల్ని నీటిలో తెరకెక్కించాల్సివచ్చింది. జేమ్స్‌ ఆలోచనలల్ని ‘క్యాప్చర్‌’ చేసే కెమెరాలు, సాంకేతికత అప్పట్లో అందుబాటులో లేవు. దాని కోసం జేమ్స్‌ ఏళ్ల తరబడి ఎదురు చూశాడు. ఈలోగా స్ర్కిప్టులో మార్పులు, చేర్పులు, నటీనటులకు శిక్షణ తరగతులు... వీటికి సమయం కేటాయించాడు. ఈ సినిమాలో నటించే నటీనటులకు, కెమెరా అసిస్టెంట్లకు ఈత రావాల్సిందే అనే నిబంధన పెట్టాడు జేమ్స్‌. రానివాళ్లకు ప్రత్యేకంగా నేర్పించారు. స్కూబా డైవింగ్‌లోనూ శిక్షణ ఇప్పించారు. నీటిలో షూటింగ్‌ జరుగుతున్నంత కాలం... సెట్‌ బయట పదుల సంఖ్యలో అంబులెన్సులు, డాక్టర్లు అందుబాటులో ఉండేవారు. ట్రైల్‌ షూట్లకైతే లెక్కే లేదు. షూటింగ్‌ కోసం 9 లక్షల గ్యాలెన్ల నీటిని నిలవ చేయగల సామర్థ్యం ఉన్న వాటర్‌ ట్యాంకర్లను ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఈ సినిమా కోసం అండర్‌ వాటర్‌ మోషన్‌ టెక్నాలజీని ఉపయోగించారు. సోనీ వెన్నిస్‌ అనే సరికొత్త కెమెరా సాయంతో.. ఈ సినిమా చిత్రీకరించారు. జేమ్స్‌కి ఎలాంటి లెన్సులు కావాలో తెలుసుకొని.. ఈ కెమెరాని తయారు చేశారు నిపుణులు. త్రీడీ, 4డీ, 5కె, 8కె ఫార్మెట్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఇక్కడితో ఆగదు..

‘అవతార్‌’ ఫ్రాంచైజీని జేమ్స్‌ ఇక్కడితో ఆపడం లేదు. పార్ట్‌ 3, 4, 5 కూడా రాబోతున్నాయి. పార్ట్‌ 3కి సంబంధించిన చిత్రీకరణ కూడా దాదాపుగా పూర్తయిందని హాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 2024 డిసెంబరులో ‘అవతార్‌ 3’ రాబోతోంది. 2026, 2028లలో మిగిలిన భాగాలు విడుదల అవుతాయి. ‘అవతార్‌ 2’ వచ్చే ముందే ‘అవతార్‌’ని రీ రిలీజ్‌ చేశారు. ‘అవతార్‌’ కథని, ఆ ప్రపంచాన్ని ఈతరం ప్రేక్షకులకు స్థూలంగా గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. అయితే రీ రీలీజ్‌లోనూ ‘అవతార్‌’ అద్భుతాలు సృష్టించింది. భారీ వసూళ్లు సాధించింది. ‘అవతార్‌ 3’, ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’ విడుదల చేసేటప్పుడు కూడా పాత సినిమాల్ని మళ్లీ విడుదల చేయాలన్న ఆలోచనకు ఈ వసూళ్లు మరింత ఊతం ఇచ్చాయి.

Updated Date - 2022-12-14T15:44:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!