Superman: సోషల్ మీడియాలో స్టార్ హీరో కొత్త పోస్ట్.. షాక్‌లో ఫ్యాన్స్
ABN, First Publish Date - 2022-12-15T13:54:19+05:30
హాలీవుడ్ (Hollywood) సినిమాల్లో ఎన్నో సూపర్ హీరో (SuperHero) క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిలో సూపర్‌మ్యాన్ (Superman)కి ఉన్న ఫాలోయింగ్ గురించి పత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
హాలీవుడ్ (Hollywood) సినిమాల్లో ఎన్నో సూపర్ హీరో (SuperHero) క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిలో సూపర్‌మ్యాన్ (Superman)కి ఉన్న ఫాలోయింగ్ గురించి పత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్యారెక్టర్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది ఇష్టపడతారు. ఈ క్యారెక్టర్‌లో ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు అలరించారు. అందులో అందరికంటే ఎక్కువ మంది అభిమానాన్ని చూరగొన్నది మాత్రం హేన్రీ కేవిల్ అని చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ డీసీ (DC) క్రియేట్ చేసిన డీసీ ఎక్సెటెండెడ్ యూనివర్స్ (DCEU)లో భాగంగా సూపర్‌మ్యాన్‌గా నటించిన కేవిల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవలే ‘బ్లాక్ ఆడమ్’ అనే సినిమాలో సూపర్ మ్యాన్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఈ తరుణంలో తన అభిమానులకు కేవిల్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు.
డీసీఈయూలో భాగంగా భవిష్యత్తులో వచ్చే సినిమాల్లో సూపర్‌మ్యాన్‌గా తను నటించట్లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆయన చేసిన పోస్ట్‌లో.. ‘ఇప్పుడే నాకు జేమ్స్ గన్, పీటర్ సఫ్రాన్‌లతో సమావేశం జరిగింది. అందరికీ ఇదో విచారకరమైన వార్త. నేను ఇకపై సూపర్‌మ్యాన్‌గా కనిపించను. అక్టోబర్‌లో నేను తిరిగి వస్తానని స్టూడియో ప్రకటించింది. దాని తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ అదే జీవితం అంటే. మార్పు జరిగింది. నేను దాన్ని గౌరవిస్తాను. జేమ్స్, పీటర్‌లకు నిర్మించడానికి ఓ విశ్వం ఉంది. వారితో పని చేయబోయే వారందరికీ శుభాకాంక్షలు. వారు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు నాకు సపోర్టుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మనకి కొంచెం బాధ కలగొచ్చు. కానీ సూపర్ మ్యాన్ మన చుట్టే ఉంటాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సూపర్‌మ్యాన్‌గా నా సమయం పూర్తైంది. మీతో ప్రయాణం చాలా సరదాగా సాగింది. సాగుతుంది’ అని రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్ చూసిన ఎంతోమంది నెటిజన్లు, కేవిల్ ఫ్యాన్స్ బాధ పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు ఎల్లప్పుడూ మా తరానికి సూపర్‌మ్యాన్‌గా గుర్తుండిపోతారు’ అని ఒకరు.. ‘ఇది వినడానికి బాధగా ఉంది. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు’ అని ఇంకొకరు.. ‘ఇదో బాధాకరమైన రోజు. ఫ్యాన్స్ అందరూ నీకు ఎల్లప్పుడూ సపోర్టుగా ఉంటారు’ అని వేరొకరు.. ‘ఇకపై ఎవరూ సూపర్‌మ్యాన్‌గా కనిపించిన మాకు అవసరం లేదు. హెన్నీ కేవిల్ మాత్రం ఎప్పటికీ నెంబర్ 1’ అని మరొకరు రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్‌కి ‘షాజమ్’ ఫేమ్ నటుడు జాచరీ లేవీ కూడా స్పందించాడు. ‘మరో యూనివర్స్ మనం మళ్లీ కలుద్దాం సర్’ అని రాసుకొచ్చాడు. అతని కామెంట్‌ని చూసిన నెటిజన్లు కేవిల్ కచ్చితంగా మరోసారి సూపర్‌మ్యాన్‌గా కనిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.