కందికొండ యాదగిరి కథ ఇదే!
ABN, First Publish Date - 2022-03-13T00:33:57+05:30
సినీ గేయ రచయిత కందికొండ కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. సంగీత ప్రియులను అలరించాయి. వరంగల్ జిల్లా నాగుర్లపల్లి గ్రామంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్ చదువుతున్న సమయంలో సంగీత దర్శకుడు చక్రి కందికొండకు పరిచయమయ్యారు.
సినీ గేయ రచయిత కందికొండ కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. సంగీత ప్రియులను అలరించాయి. వరంగల్ జిల్లా నాగుర్లపల్లి గ్రామంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్ చదువుతున్న సమయంలో సంగీత దర్శకుడు చక్రి కందికొండకు పరిచయమయ్యారు. మొదట జాపపద గేయాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన చక్రితో ఉన్న సాన్నిహిత్యంతో తన ఆసక్తిని సినీ సాహిత్యం వైపు మళ్లించారు. చక్రి సంగీతం అందించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లి కూయవే గువ్వా’ పాటతో సినీ ప్రపంచానికి పరిచయమయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస అవకాశాలు ఇవ్వడంతో గేయ రచయితగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. మెలోడీ పాటలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన ‘ఇడియట్’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే, ‘పోకిరి’లో ‘గలగల పారుతున్న గోదారిలా’, ‘జగడమే’, పాటలు రచించారు. రెండు దశాబ్ధాల సినీ ప్రస్థానంలో కందికొండ 1300 పాటలు రాశారు. ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్నాక బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా జనం నోట మార్మోగాయి. తొలుత నోటి క్యాన్సర్‌తో పోరాడిన ఆయన ఆ తర్వాత వెన్నెముక సమస్యతో బాధపడ్డారు. మరోసారి ఆస్పత్రి పాలు కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా కారణంతో మరింత ఇబ్బందుల పాలయ్యారు. కందికొండ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగా ఉన్నా, తాజాగా మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో శనివారం కందికొండ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భాంతికి లోనయింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కేటీఆర్ సార్ ఆదుకోండి: కందికొండ తనయ
గత డిసెంబర్‌లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కందికొండ కుటుంబానికి ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి ఎదురైంది. మోతీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆయనకు చికిత్సకు సరిపడ డబ్బు లేదు. కందికొండ తనయ మాతృక తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చొరవ చూపాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాశారు.
‘‘కేటీఆర్ సర్.. ఈ ఏడాది జూన్ నెలలో మా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి మాకు సాయం చేసి అండగా నిలిచినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్న వెంటిలేటర్‌పై కిమ్స్‌లో ఉన్నప్పుడు మా పరిస్థితి స్వయంగా తెలుసుకుని చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఆర్థికంగానూ అండగా నిలిచారు. దాదాపు 40 రోజులపాటు వైద్యులు నాన్నకు ప్రత్యేకంగా చికిత్స అందించారు. గత నెలలోనూ నాన్న వెన్నెముకకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం ‘మెడికవర్’లో చేరితే అప్పుడు కూడా మీ కార్యాలయం అత్యంత వేగంగా స్పందించింది. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చూడాలని మా అమ్మ మంత్రి హరీశ్‌రావును గతంలో కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారిని కలవాల్సిందిగా సూచించారు. 2012 నుంచి నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినా చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు కోసం నాన్న రూ.4.05 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ నెల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని ఆదేశించాడు. మా కష్టాన్ని గుర్తించి చిత్రపురి కాలనీ లేదా, ఇంకెక్కడైనా నివాసం కల్పించండి సార్. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు కూడా తగిన సాయం చేయాలని సవినయంగా కోరుతున్నాం. మానాన్న ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సీఎం కేసీఆర్ కలలుకనే ‘బంగారు తెలంగాణ’ కోసం తనవంతు రచనలు చేస్తారని ఆశిస్తున్నా’’ అని మాతృక లేఖ రాశారు. ఈ లేఖ చదివిన కేటీఆర్ వెంటనే స్పందించారు.
కందికొండ హిట్ పాటలు:
మళ్లి కూయవే గువ్వా...(ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం)
చూపుల్తో గుచ్చి గుచ్చి... (ఇడియట్)
ఈరోజే తెలిసినది (ఇడియట్)
నిన్నే నిన్నే (దేశముదురు)
మనసులే.. కలిసే (దేశముదురు)
ఐ వానా సూపర్‌మెన్ (స్టాలిన్)
చెన్నై చంద్రమా (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి)
నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్ (టెంపర్)