Rishab Shetty: ‘కాంతార’ను ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదు
ABN, First Publish Date - 2022-10-30T01:18:41+05:30
‘కాంతార’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇంత గొప్పగా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు అన్నారు.. చిత్ర హీరో, దర్శకుడు రిషభ్ శెట్టి..
‘కాంతార’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇంత గొప్పగా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు అన్నారు.. చిత్ర హీరో, దర్శకుడు రిషభ్ శెట్టి (Rishab Shetty). సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ‘కాంతార’ (Kantara) చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 15న మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. టాలీవుడ్‌లోనూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం విజయవంతగా ప్రదర్శింపబడుతోన్న తరుణంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు ఈ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్‌ను నిర్వహిస్తోంది. శనివారం ఈ చిత్రయూనిట్ తిరుపతి జయశ్యామ్ థియేటర్‌ను.. అలాగే విశాఖపట్నంలోని జాగదాంబ థియేటర్‌ను సందర్శించింది. ఈ టీమ్ వెళ్లిన ప్రతి చోటా ప్రేక్షకులు టీమ్‌కు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకుల ఆనందం చూసిన టీమ్.. వారికి చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా రిషభ్ శెట్టి (Rishab Shetty) మాట్లాడుతూ.. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు. 2 వారాల్లో ఈ సినిమా 45 కోట్లు వసూళ్లు సాధించి దాదాపుగా 50 కోట్ల వసూళ్లకు చేరువవ్వడం ఆనందంగా ఉంది. ఇంతలా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఇండియా వైడ్ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మీరు మెచ్చే, మీకు నచ్చే విధంగా సినిమాలు చేసేందుకు కృషి చేస్తాను.. అని తెలిపారు.
కాగా, ఇంతకుముందు ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుందని ఈ చిత్రం ప్రూవ్ చేసింది. ఈ సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ బన్ని వాసు చెప్పాడు. ఏంటి బన్ని వాసు ఇంత ఎగ్జయిట్ అవుతున్నాడని అనుకున్నాను. అతని మాట ప్రకారం సినిమా చూశాను. అప్పుడు నాకు ఇందులో ఉన్న ఎమోషన్ అర్థమైంది. ఈ ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందని అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేశాం.. అని చెప్పారు.