బాక్సాఫీసు దగ్గర హోరాహోరి
ABN, First Publish Date - 2022-03-23T06:47:57+05:30
రెండు వారాలుగా బాలీవుడ్‌లో రెండు చిత్రాల మధ్య కలెక్షన్ల యుద్ధం జరుగుతోంది. ఇందులో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఒకటైతే, అక్షయ్‌కుమార్ నటించిన ‘బచ్చన్ పాండే’ మరొకటి....
రెండు వారాలుగా బాలీవుడ్‌లో రెండు చిత్రాల మధ్య కలెక్షన్ల యుద్ధం జరుగుతోంది. ఇందులో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఒకటైతే, అక్షయ్‌కుమార్ నటించిన ‘బచ్చన్ పాండే’ మరొకటి. 1990లలో జమ్ము కశ్మీర్‌లో చెలరేగిన తీవ్రమైన ఉగ్రవాదంలో చాలా మంది పండిట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణాలు చూడలేక మిగిలిన పండిట్స్ కట్టుబట్టలతో వలస వెళ్లిపోయారు. ఆనాటి వెతలను కళ్లముందు ఉంచుతూ దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి రూపొందించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఇక అక్షయ్‌కుమార్ నటించిన ‘బచ్చన్ పాండే’ ఈ నెల 18న విడుదలైంది. తమిళ చిత్రం ‘జిగర్తండా’కు ఇది రీమేక్. ఒకటి చరిత్రను కళ్లెదుట నిలిపే వాస్తవ చిత్రం, మరొకటి మాస్ మసాలా ఫిల్మ్. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మాస్ చిత్రాలకే ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చూడడానికి జనం పోటెత్తుతున్నారు. ఇప్పటివరకూ దాదాపు రూ. 179 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. ట్రేడ్ పండితుడు హిమేష్ మన్కడ్ చెప్పిన వివరాల ప్రకారం మొదట 600 థియేటర్లలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం విడుదల అయింది. వారం తిరగకుండా ఆ సంఖ్య 1400లకు పెరిగిపోయిందట. సినిమా బాగుందనే టాక్ అంతటా వ్యాపించడంతో సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో కిక్కిరిసిన ప్రేక్షకులతో ఈ సినిమా ఆడుతోందట. ‘ద కశ్మీర్ ఫైల్స్’ విడుదలైన వారం రోజులకు అక్షయ్‌కుమార్ సినిమా ‘బచ్చన్ పాండే’ రిలీజ్ అయింది. అక్షయ్‌కుమార్ సినిమా అంటే చాలు. ఎలా ఉన్నా విడుదలైన మూడు నాలుగు రోజుల్లోనే రూ 50 కోట్ల వసూళ్లు ఉంటాయి. కానీ ‘బచ్చన్‌పాండే’ చిత్రం రూ 37 కోట్ల దగ్గరే ఆగిపోవడం గమనార్హం. ‘ద కశ్మీర్ ఫైల్స్’ విజయం దర్శకనిర్మాతలు కూడా ఊహించలేదు. ‘బుక్ మై షో’ లెక్కల ప్రకారం ఇప్పటికి 50 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయి. ఇంతకుముందు ‘దంగల్’ చిత్రానికి ఈ స్థాయిలో టికెట్ అమ్మకాలు ఉండేవట. పాటలు, పెద్ద హీరో, ఇతర కమర్షియల్ హంగులు ఏమీ లేకపోయినా ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఇంతగా ప్రేక్షకాదరణ పొందడం ట్రేడ్ సర్కిల్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా చూసి తడిసిన గుండెతో, కళ్ల నీళ్లతో ప్రేక్షకులు బయటకు వస్తున్న దృశ్యాలు ప్రతి చోటా కనిపిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, కర్నాటక, త్రిపుర, గోవాల ప్రభుత్వాలు ఇప్పటికే వినోదపు పన్నును రద్దు చేశాయి.
‘ద కశ్మీర్ ఫైల్స్ ’ చిత్రం నుంచి ‘బచ్చన్ పాండే ’ గట్టి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ చిత్రానికి వస్తున్న వసూళ్లను తీసి పారెయ్యడానికి వీల్లేదు. బాక్సాఫీసు దగ్గర పోరాటం చేస్తూనే కలెక్షన్లు పెంచుకోవడానికి పోరాటం చేస్తున్నాడు ‘బచ్చన్ పాండే’.