బనారస్ ఓ థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ!
ABN, First Publish Date - 2022-10-30T09:47:30+05:30
‘‘బనారస్ ఓ అందమైన ప్రేమకథ. ఇందులో ఓ థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. టైమ్ మిషన్ నేపథ్యం కూడా ఉంది. ఇన్ని రకాల అంశాలు ఓ ప్రేమకథలో ఇమడడం కొత్తగా...
‘‘బనారస్ ఓ అందమైన ప్రేమకథ. ఇందులో ఓ థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. టైమ్ మిషన్ నేపథ్యం కూడా ఉంది. ఇన్ని రకాల అంశాలు ఓ ప్రేమకథలో ఇమడడం కొత్తగా అనిపిస్తుంద’’న్నారు జైద్ ఖాన్. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’. నవంబరు 4న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు జైద్ ఖాన్. ‘‘ఇలాంటి కథ కోసం నేను ఏడేళ్లుగా అన్వేషిస్తున్నాను. జయతీర్థ నాకు ఈ కథ చెప్పారు. తొలి సగం ప్రేమకథలా అనిపించినా, ద్వితీయార్థంలో ఓ షాకింగ్ ఎలిమెంట్ ఉంది. అది నచ్చే ఈ కథ ఒప్పుకొన్నాను. ఇప్పుడంతా పాన్ ఇండియా హవా నడుస్తోంది. దాంతో పాటు ఈ సినిమా పూర్తయ్యాక నా స్నేహితులకు, సన్నిహితులకూ చూపించా. వాళ్లంతా ‘ఇది పాన్ ఇండియా కంటెంట్.. దాన్ని కన్నడ సీమకే పరిమితం చేయొద్దు’ అని సలహా ఇచ్చారు. అందుకే దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. కన్నడ సీమ గురించి ఈ రోజు అందరూ గొప్పగా మాట్లాడుకొంటున్నారు. సాంకేతికంగా కన్నడ సినిమా బలంగా తయారైంది. మా సినిమా కూడా అందుకు అతీతం కాదు. విజువల్స్ విషయంలో చాలా శ్రద్ధ పెట్టాం. ఓ బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కథ ప్రకారం బనార్‌సలో 85 శాతం చిత్రీకరణ జరిపాం. ఈ సినిమా చూశాక ఒక్కసారైనా ‘బనారస్’ వెళ్లాలనిపిస్తుంది. ప్రస్తుతం నాలుగు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొన్నా. వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తా’’ అన్నారు.