Year Ender 2022: బాలీవుడ్‌ని షేక్ చేసిన టాప్ 5 సౌత్ సినిమాలు ఇవే..
ABN, First Publish Date - 2022-12-21T15:48:01+05:30
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకి గడ్డుకాలం నడుస్తున్న విషయం తెలిసిందే. 2022లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి.
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకి గడ్డుకాలం నడుస్తున్న విషయం తెలిసిందే. 2022లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. అయితే మరోవైపు పలు సౌత్ డబ్బింగ్ చిత్రాలు మాత్రం బాలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపించాయి. మరి కొన్ని రోజుల్లో 2022 ముగిసిపోనుంది. ఈ తరుణంలో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నేసిన సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం..
1. కేజీయఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2)
కన్నడ నటుడు యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’. ఐదేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కేజీయఫ్ చాప్టర్ 1’ కి తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకి పైగా కలెక్షన్లని సాధించింది. కేవలం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్దే ఈ చిత్రానికి రూ.435 కోట్ల వసూళ్లు వచ్చాయి.
2. ఆర్ఆర్ఆర్ (RRR)
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ చిత్రాలతో రాజమౌళికి ఏర్పడ్డ క్రేజ్ కారణంగా ఈ సినిమాపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే మార్చి 25న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లని సాధించింది. ఒక్క హిందీ సెక్టార్‌లో ఈ చిత్రానికి దాదాపు రూ.277 కోట్ల వసూళ్లు దక్కాయి.
3. కాంతార (Kantara)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమని షేక్ చేసిన మరో సౌత్, కన్నడ మూవీ ‘కాంతార’. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. మొదట కన్నడలోనే విడుదలై ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో.. కొన్ని రోజుల గ్యాప్‌లో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు. దీంతో కేవలం మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకులని థియేటర్స్ వచ్చేలా చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టింది. కేవలం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్దే ఈ చిత్రం దాదాపు రూ.82 కోట్ల వసూళ్లని సాధించింది.
4. కార్తీకేయ 2 (Karthikeya 2)
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ, దర్శకుడు చందు మొండేటి కాంబోలో తెరకెక్కిన ‘కార్తీకేయ 2’ చిత్రానికి తెలుగు మాత్రమే అంచనాలు ఉన్నాయి. దానికి కారణం కొన్నేళ్ల క్రితం విడుదలైన ‘కార్తీకేయ’ సూపర్ హిట్ సాధించడమే. అయితే.. వేరే భాషల్లో ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు లేవు. కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని మూవీ టీం పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసింది. దీంతో అనుకున్నట్లుగానే ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు.120 కోట్ల వసూళ్లని కలెక్షన్లని కొల్లగొట్టింది. బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్ల వసూళ్లని సాధించింది.
5. మేజర్ (Major)
టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతోపాటు మలయాళం, హిందీలోనూ విడుదలై హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఫుల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 65 కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ఈ మూవీకి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.15 కోట్ల వసూళ్లు వచ్చాయి.